ఇక పసిడికీ వడ్డీ వస్తుంది.. | Gold to interest rate | Sakshi
Sakshi News home page

ఇక పసిడికీ వడ్డీ వస్తుంది..

Published Thu, Sep 10 2015 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

ఇక పసిడికీ వడ్డీ వస్తుంది..

ఇక పసిడికీ వడ్డీ వస్తుంది..

- గోల్డ్ బాండ్, డిపాజిట్ పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- మెటల్‌కు దేశీయంగా డిమాండ్‌ను తగ్గించే ప్రయత్నం
- బీరువాలకే పరిమితమవుతున్న కనకం మార్కెట్‌లోకి వచ్చే ఏర్పాటు
న్యూఢిల్లీ:
బంగారం బాండ్,  పసిడి డిపాజిట్ (మోనిటైజేషన్) పథకాలకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. మెటల్‌గా (ఫిజికల్ గోల్డ్) పసిడి డిమాండ్‌ను తగ్గించడానికి, ఇళ్లలో, సంస్థల్లో బీరువాలకే పరిమితమవుతున్న పసిడిని వ్యవస్థలోకి తీసుకువచ్చి, ఆర్జన సామర్థ్యం సమకూర్చడం, తద్వారా దేశ ఆర్థిక పటిష్టత ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యాలు.  కేబినెట్ సమావేశం అనంతరం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ విషయాన్ని ప్రకటించారు. పసిడికి ప్రత్యామ్నాయంగా ఫైనాన్షియల్ అసెట్‌ను అభివృద్ధి చేయడానికి సావరిన్ గోల్డ్ బాండ్(ఎస్‌జీబీ) స్కీముని ప్రారంభించాలని ఈ ఏడాది బడ్జెట్ ప్రతిపాదించింది. ఇందుకనుగుణంగా తాజా పథకాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
 
పసిడి నిల్వల నిధి ఏర్పాటు...
తాజా బంగారం పథకాల నేపథ్యంలో పసిడి ధరల్లో మార్పుల ఇబ్బందులను ఎదుర్కొనడానికి ఒక పసిడి నిల్వల నిధి ఏర్పాటు కానున్నట్లు కేబినెట్ సమావేశం అనంతరం వెలువడిన ఒక ప్రకటన తెలిపింది. ఈ పథకాల వల్ల వచ్చే లాభ, నష్టాలను ఈ ఫండ్ నిర్వహిస్తుంది.  2015-16 నుంచీ ప్రభుత్వ మార్కెట్ రుణ ప్రణాళికలో భాగంగా ఈ సావరిన్  గోల్డ్ బాండ్లు జారీ అవుతాయి. బాండ్ల ధర ఎలా ఉండాలన్న అంశాన్ని ఆర్థికమంత్రిత్వశాఖతో సంప్రదింపులతో ఆర్‌బీఐ నిర్ణయిస్తుంది.

ప్రస్తుతం కడ్డీలు, నాణేల రూపంలో  దాదాపు 300 టన్నుల పసిడి ఫిజికల్‌గా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పెట్టుబడులలో కొంత బాండ్లలోకి వస్తాయని భావిస్తున్నారు. భారత ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. కనుక ఈ బాండ్లకు సావరిన్ (ప్రభుత్వ) గ్యారెంటీ ఉంటుంది. అందువల్ల బాండ్లు సావరిన్ రుణాల కిందకు వస్తాయి. తద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచీ ద్రవ్య లోటు లక్ష్యం పరిధిలో ఇవి ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.6 లక్షల కోట్లు ప్రభుత్వ రుణ ప్రణాళిక. ఇందులో దాదాపు రూ.3.6 లక్షల కోట్ల రుణ సమీకరణ సెప్టెంబర్ కల్లా పూర్తవుతుంది. గోల్డ్ బాండ్ స్కీమ్‌కు కూడా కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది.
 
గోల్డ్ బాండ్, డిపాజిట్ స్కీమ్‌లను పరిశ్రమ సమాఖ్య స్వాగతించింది. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వల్ల పారదర్శకత పెరుగుతుందని, లక్షలాది కుటుంబాలు ప్రయోజనం పొందే అవకాశం ఉందని, గోల్డ్ సేవింగ్స్‌ను ఆర్థిక పెట్టుబడుల రూపంలోకి మరల్చే సామర్థ్యం దీనికి ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ సోమసుందరమ్ పీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్య వల్ల బంగారం దిగుమతులు తగ్గుతాయని, పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందని ఆల్ ఇండియా జెమ్స్, జ్యువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ మాజీ డెరైక్టర్ బచ్‌రాజ్ బమల్వా పేర్కొన్నారు.
 
డిపాజిట్ స్కీమ్ ఇలా..
- ప్రజలు తమ వద్ద అదనంగా ఉన్న పసిడిని బ్యాంకుల్లో స్వల్ప (1-3 సంవత్సరాలు), మధ్య (5-7 సంవత్సరాలు), దీర్ఘకాలిక కాలాలకు (12-15 సంవత్సరాలు)  డిపాజిట్ చేసుకోవచ్చు.
- బంగారం రూపంలో వడ్డీని గుణించి, మెచ్యూరిటీ తరువాత నగదు రూపంలో అసలు, వడ్డీలను చెల్లిస్తారు. అంతర్జాతీయంగా కొన్ని దేశాల్లో పసిడి డిపాజిట్ విలువపై 0.75 శాతం నుంచి 2శాతం వరకూ వడ్డీ ఉంది.
- స్వల్పకాలిక డిపాజిట్లపై వడ్డీరేటు ఆయా బ్యాంకులు నిర్ణయిస్తాయి. మధ్యకాలిక, దీర్ఘకాలిక డిపాజిట్లపై వడ్డీరేటు (బ్యాంకుల సేవలను ఫీజులు సహా) ఆర్‌బీఐతో సంప్రదించి కాలానుగుణంగా ప్రభుత్వం ప్రకటిస్తుంది.
- దేశంలో అదనపు పసిడి దాదాపు 20,000 టన్నులు ఉంటుందని అంచనా. తాజా పథకం వల్ల దాదాపు రూ.5,40,000 కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తాయని అంచనా.
- స్థిర డిపాజిట్ల తరహాలోనే ఈ మూడు కాలాల పసిడి డిపాజిట్లకు లాక్-ఇన్-పీరియడ్ బ్రేకింగ్‌కు వీలుంటుంది. అయితే ముందస్తు ఉపసంహరణల విషయంలో (కొంతభాగం ఉపసంహరణ సహా) కొంత జరిమానా అమలవుతుంది.
- వ్యక్తులు లేదా వ్యవస్థలు కనీసం 30 గ్రాములు డిపాజిట్ చేయాలి. డిపాజిట్‌కు సంబంధించి లభించే వడ్డీని ఆదాయపు పన్ను, కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
- ఇదేమీ బ్లాక్ మనీ వంటి అంశాలకు దారితీసే ప్రొడక్ట్ కాదు. సాధారణ పన్ను నిబంధనలు అన్నీ ఈ డిపాజిట్ స్కీమ్‌కూ వర్తిస్తాయి.
- ధరలు పెరిగితే ఈ డిపాజిట్ వల్ల డిపాజిట్‌దారుకు ప్రయోజనం చేకూరుతుంది. అలాగే డిపాజిట్ చేసిన పసిడి విలువకు సంబంధించి వడ్డీ కూడా పొందవచ్చు.
- డిపాజిట్ కాల వ్యవధి పూర్తయిన తరువాత, డిపాజిట్‌దారు అప్పటి పసిడి వాస్తవ విలువను పొందవచ్చు. స్వల్పకాలిక డిపాజిట్ అయితే ఫిజికల్ గోల్డ్‌ను పొందే వీలుంది. రెండు సందర్భాల్లో వడ్డీ లభిస్తుంది.  డిపాజిట్ చేసిన పసిడి విలువ తగ్గితే... తగ్గిన విలువే లభిస్తుంది. అయితే వడ్డీ ఇక్కడ కస్టమర్‌కు కలిసి వచ్చే అంశం.
- డిపాజిట్‌గా వచ్చిన పసిడిని వేలానికి, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పసిడి నిల్వల భర్తీలకు వినియోగిస్తారు. అశోక్ చక్రతో కూడిన ఇండియన్ గోల్డ్ కాయిన్ తయారీలో సైతం దీనిని వినియోగిస్తారు. దిగుమతులు తగ్గించడం, దేశీయంగా సరఫరాల మెరుగు లక్ష్యంగా ఆభరణ వర్తకులకు కూడా ఈ పసిడిని అమ్మే వెసులబాటును బ్యాంకులకు కల్పిస్తారు. అయితే ఆయా సందర్భాల్లో నో-యువర్-కస్టమర్ నిబంధనలను బ్యాంకుల తప్పనిసరిగా పాటించాలి.
- పసిడి డిపాజిట్ పథకం అమలు తేదీ తత్సబంధ అంశాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుంది.
- డిపాజిట్ స్కీమ్ అమల్లో బ్యాంకులకు ప్రోత్సాహకాలు ఉంటాయి.
 
గోల్డ్ బాండ్‌ల స్వరూపం...
- గోల్డ్ బాండ్ పథకం వార్షిక గరిష్ట పరిమితి వ్యక్తికి 500 గ్రాములు. 5 నుంచి 7 సంవత్సరాల కాలపరిమితితో ఈ బాండ్ల జారీ జరుగుతుంది. ఈ స్కీమ్ ప్రకారం, పసిడిని ఫిజికల్‌గా కాకుండా, భారత పౌరులు గోల్డ్ బాండ్ల రూపంలో కొనుగోలు చేయవచ్చు.
- 5, 10.50, 100 గ్రాముల చొప్పున ఈ గోల్డ్ బాండ్లు జారీ అవుతాయి. వాటి కాలవ్యవధి 5 నుంచి 7 ఏళ్లు వుంటుంది. దాంతో బంగారం ధరల మధ్యకాలిక ఒడిదుడుకుల నుంచి పెట్టుబడిదారుకు ఊరట లభిస్తుంది.
- గోల్డ్ బాండ్ల విషయంలో వడ్డీ రేటు, మార్కెట్‌లో అప్పటి బంగారం ధర ప్రాతిపదికన ఉంటుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ, పోస్టాఫీసుల ద్వారా బాండ్లను మార్చుకుని, డబ్బు తిరిగి తీసుకునే వీలుంటుంది.
- భారత పౌరులు, సంస్థలకు మాత్రమే ఈ బాండ్లను ఆఫర్ చేస్తారు. ఇన్వెస్టర్లు మెచ్యూరిటీ కంటే ముందస్తుగా వీటిని అమ్మేందుకు వీలుగా ఎక్స్ఛేంజీలపై ఈ బాండ్లు ట్రేడవుతాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement