
అంతకుముందు కీలక సీసీఎస్ భేటీ
రాజకీయ, ఆర్థిక కమిటీల భేటీలు కూడా
‘పహల్గాం’ కార్యాచరణపై కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సారథ్యంలో బుధవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అంతకుముందు ఆయన నేతృత్వంలో రోజంతా అతి కీలకమైన అత్యున్నత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్), తర్వాత రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ), ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలు ఉంటాయి. జాతీయ భద్రతకు సంబంధించి అత్యున్నత నిర్ణాయక విభాగమైన సీసీఎస్ సమావేశం వారం వ్యవధిలోనే ఇది రెండోసారి కావడం విశేషం.
పహల్గాం దాడి జరిగిన మర్నాడే ఏప్రిల్ 23న జరిగిన సీసీఎస్ భేటీలో పాక్‌పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘‘ఈ సమావేశాలన్నింటికీ పహల్గాం దాడే ప్రధాన అజెండా అని తెలుస్తోంది. పాక్‌కు బుద్ధి చెప్పేందుకు తీసుకోవాల్సిన సైనిక, రాజకీయ, ఆర్థికపరమైన నిర్ణయాలను సీసీఎస్ తదితర భేటీల్లో ఖరారు చేస్తారు. అనంతరం జరిగే మంత్రివర్గం భేటీలో వాటికి ఆమోదముద్ర వేస్తారు’’ అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పహల్గాం దాడి తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుండడం ఇదే తొలిసారి.