గోల్డ్ డిపాజిట్‌లకు కొత్త స్కీమ్!
న్యూఢిల్లీ: పసిడి డిపాజిట్ పథకాన్ని ఆధునీకరించి, పునఃప్రారంభించాలని గోల్డ్ అండ్ సిల్వర్ రిఫైనర్ ఎంఎంటీసీ పీఏఎంపీ సూచించింది. ప్రభుత్వరంగ ఎంఎంటీసీ- స్విట్జర్లాండ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రపంచ ప్రముఖ గోల్డ్ రిఫైనర్ పీఏఎంపీ జాయింట్ వెంచర్ (జేవీ)గా ‘ఎంఎంటీసీ పీఏఎంపీ’ ఏర్పాటయ్యింది. ఏ విధంగా ప్రతిపాదిత పథకాన్ని పునఃప్రారంభించాలన్న అంశాన్ని కూడా జేవీ వివరించింది.
జేవీ ఎండీ రాజేష్ ఖోస్లా తెలిపిన ఈ వివరాల ప్రకారం...
కనీసం 40 గ్రాములు డిపాజిట్ చేయగలిగిన విధంగా పథకాన్ని మార్చాలి.
దేశ వ్యాప్తంగా బీరువాల్లో దాదాపు 25,000 టన్నుల పసిడి నిల్వలు నిక్షిప్తమయ్యాయి.
ఇలాంటి పథకం ద్వారా మొత్తం నిల్వల్లో ఒక శాతం సమీకరించగలిగినా... కనీసం ఒక యేడాదిలో 250 టన్నుల పసిడి దిగుమతులను కట్టడికి చేయవచ్చు. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడికి ఈ చర్య దోహదపడుతుంది.
దేశ వ్యాప్తంగా 500 గృహాల సర్వే ప్రాతిపదికన తాజా ప్రతిపాదనను జేవీ చేసింది.
1999లో ప్రారంభించిన ప్రస్తుత గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రకారం కనీస పసిడి డిపాజిట్ 500 గ్రాములు. ఇందువల్ల ఈ పథకం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంది. ఈ పథకం వల్ల కేవలం దేవాలయాలు, ట్రస్టులు మాత్రమే ప్రయోజనం పొందగలుగుతున్నాయి.
ఆర్‌బీఐ ఇలాంటి ప్రతిపాదన ఒకటి ఇప్పటికే చేసింది. దీనిపై నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్నాం.
దిగుమతులపై నిబంధనలను మరింత కఠినతరం చేసినా, భారత్‌లో పసిడి డిమాండ్ ప్రస్తుత స్థాయి (వార్షికంగా దాదాపు 850 టన్నులు) దిగువకు పడిపోయే అవకాశం లేదు.
{పతిపాదిత గోల్డ్ కొత్త పథకాన్ని ప్రవేశపెడితే, దీని ద్వారా లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ ధ్రువీకరణ పొందిన ఏకైక రిఫైనరీగా ఎంఎంటీసీ పీఏఎంపీ మంచి ప్రయోజనం పొందగలుగుతుంది. బ్యాంకులు నిర్దేశించిన విధంగా సమీకరణ, నాణ్యత నిర్ధారణ, రవాణా, రిఫైనింగ్, రి-ట్రాన్స్‌పోర్ట్‌సహా దేశంలో పసిడి సర్క్యులేషన్‌కు సంబంధించి విస్తృతస్థాయిలో సేవలను జేవీ నిర్వహిస్తుంది.