ముంబై: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మెజారిటీ అంచనాలకన్నా తక్కువగా 3 శాతమే (స్థూల దేశీయోత్పత్తి విలువతో పోల్చి) నమోదయ్యే అవకాశం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నివేదిక ఒకటి పేర్కొంది. 2022–23లో కనీసం 3.5 శాతం క్యాడ్ నమోదవుతుందన్న మెజారిటీ అంచనాలకు భిన్నంగా ఎస్‌బీఐ నివేదిక ఉండడం గమనార్హం. సాఫ్ట్‌వేర్ ఎగుమతులు, రెమిటెన్సులు (ప్రపంచంలోని వివిధ దేశాల్లోని భారతీయులు దేశానికి పంపే డబ్బు) పెరగడం, స్వాప్ డీల్స్ ద్వారా ఫారెక్స్ నిల్వలలో ఐదు బిలియన్ డాలర్లు పెరిగే అవకాశాలు దీనికి కారణమని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది.
క్రూడ్ 10 డాలర్ల పెరుగుదలతో క్యాడ్ 0.4 శాతం అప్
క్రూడ్ ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల క్యాడ్‌ను 40 బేసిస్ పాయింట్ల (0.4 శాతం) వరకు ప్రభావితం చేస్తుందని నివేదిక పేర్కొంది. ప్రతి 10 డాల ర్ల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని 50 బేసిస్ పాయింట్ల పెరుగుదలకు, 23 బేసిస్ పాయింట్ల వృద్ధి కోతకు దారితీస్తుందని నివేదిక విడుదల సందర్భంగా ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో ఎక్సే్ఛంజ్ రేటు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న నివేదిక, రూపా యి ప్రతి 100 పైసలు పతనం వల్ల మన సాఫ్ట్‌వేర్ ఎగుమతులు 250 మిలియన్ డాలర్లమేర పెరుగుతాయని విశ్లేషించింది.
భారత్ కరెంట్ అకౌంట్‌లోటు ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 2.8 శాతం (జీడీపీ విలువతో పోల్చి) లేదా 23.9 బిలియన్ డాలర్లుగా నమోదయిన విషయాన్ని నివేదిక ప్రస్తావిస్తూ, పటిష్ట రెమిటెన్సులు, సాఫ్ట్‌వేర్ ఎగుమతు లు క్యాడ్‌ను జూన్ త్రైమాసికంలో 60 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు తెలిపింది. ఇదే ధోరణి కొనసాగితే రెండవ త్రైమాసికంలో కూడా క్యాడ్ 3.5% లోపే నమోదుకావచ్చని పేర్కొంది. చమురు ధరలు భారీ గా పెరిగితే మాత్రం 2022–23 క్యాడ్‌పై ప్రతికూలత తప్పదని విశ్లేషించింది. 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో క్యాడ్ 13.4 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.5 శాతం). ఎగుమతులకన్నా దిగుమతుల పరిమాణం భారీగా పెరుగుతుండడం తాజా కరెంట్ అకౌంట్ తీవ్రతకు కారణమవుతోంది.
క్యాడ్ అంటే...
ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు.
Comments
Please login to add a commentAdd a comment