
పసిడి డిపాజిట్లు జిగేల్!
బంగారు ఆభరణాలను డిపాజిట్ చేయడం ద్వారా ఇకపై ఇన్వెస్టర్లు 3% వరకూ వడ్డీని పొందే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా పన్ను రహితంగా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు దేశంలోనే అత్యధికంగా పసిడిని దిగుమతి చేసుకునే బ్యాంక్ ఆఫ్ నోవా స్కాటియా ప్రణాళికలు సిద్ధం చేసింది. గోల్డ్ డిపాజిట్ పథకంకింద ఇన్వెస్టర్ల నుంచి ఆభ రణాలను సమీకరించేందుకు ఆభరణ వర్తకులతో జత కట్టే యోచనలో ఉంది. ఈ పథకం అమలుకోసం రిజర్వ్ బ్యాంక్‌తోపాటు, వజ్రాలు, ఆభరణ వర్తక ఫెడరేషన్(జీజేఎఫ్)తోనూ నోవా స్కాటియా చర్చలు నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ ఎండీ రాజన్ వెంకటేష్ చెప్పారు. ఈ పథకంలో భాగంగా బంగారు ఆభరణాలను డిపాజిట్ చేసే ఇన్వెస్టర్లకు వడ్డీ కింద కూడా బంగారాన్నే ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఎస్‌బీఐ మాత్రమే...
ప్రస్తుతం దేశీయంగా ఇలాంటి పథకాన్ని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ అందిస్తోంది. అయితే గోల్డ్ డిపాజిట్ పథకానికి వడ్డీ నామమాత్ర స్థాయిలో 0.75% నుంచి 1% వరకూ అందిస్తోంది. కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) పెరిగిపోతుండటంతో కొంతకాలంగా ఇటు ప్రభుత్వం, అటు రిజర్వ్ బ్యాంక్ బంగారం దిగుమతులపై పలు ఆంక్షలను అమలు చేస్తున్న విషయం విదితమే. దీంతో నోవా స్కాటియాకు అవసరమైనమేర పసిడిని దిగుమతి చేసుకోవడం సమస్యగా పరిణమించింది. దేశీయ ఆభరణ వర్తకులకు కూడా బంగారం సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. పెళ్లిళ్లు, పండుగలు వంటి సీజన్‌ల కారణంగా ధర పెరిగినప్పటికీ దేశంలో బంగారానికి డిమాండ్ మెరుగుపడుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో భారతీయుల దగ్గర ఆభరణాల రూపంలో ఉన్న 20,000 టన్నుల బంగారం అంచనాలపై నోవా స్కాటియా బ్యాంక్ వర్గాలకు దృష్టి మళ్లింది. అయితే గోల్డ్ డిపాజిట్ పథకంపై చర్చలు తుది దశలో ఉన్నాయని, కొన్ని అంశాలను పరిష్కరించుకోవలసి ఉన్నదని వెంకటేష్ చెప్పారు. ఇవి పూర్తయితే పథకాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. కాగా, ఈ పథకానికి త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ అనుమతి లభిస్తుందని విశ్వసిస్తున్నట్లు జీజేఎఫ్ చైర్మన్ హరేష్ సోనీ చెప్పారు. ఈ పథకానికి 2.5-3% వడ్డీ రేటును తాము ప్రతిపాదించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా పసిడి డిపాజిట్ కాలపరిమితిని రెండు నుంచి ఏడేళ్ల కాలానికి ప్రతిపాదించినట్లు తెలిపారు. స్టేట్‌బ్యాంక్‌లో గోల్డ్ డిపాజిట్లకు కాలపరిమితి మూడు నుంచి ఐదేళ్లుగా ఉంది.