Gold Deposits
-
ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు 795 టన్నులు
ముంబై: ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు ఏడాది కాలంలో 5 శాతం పెరిగాయి. ఈ ఏడాది మార్చి చివరికి 794.64 టన్నులకు చేరాయి. ఇందులో 56.32 మెట్రిక్ టన్నులు గోల్డ్ డిపాజిట్లు రూపంలో ఉన్నాయి. 2022 మార్చి నాటికి ఇవి 760.42 టన్నులుగా ఉన్నాయి. అప్పటికి గోల్డ్ డిపాజిట్లు 11.08 మెట్రిక్ టన్నులతో పోలిస్తే, గణనీయంగా వృద్ధి చెందాయి. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సంలో ఆర్బీఐ 34.22 టన్నుల బంగారం నిల్వలను పెంచుకుంది. మార్చి చివరినాటికి ఆర్బీఐ వద్దనున్న 794.64 టన్నుల బంగారంలో 437.22 టన్నులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వద్ద సురక్షితంగా ఉందని, 301.10 టన్నులు దేశీయంగా నిల్వ ఉన్నట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. 2023 మార్చి నాటికి ఆర్బీఐ వద్దనున్న మొత్తం విదేశీ మారకం నిల్వల విలువలో (డాలర్లలో) బంగారం నిల్వల విలువ 7.81 శాతానికి పెరిగింది. 2022 సెప్టెంబర్ నాటికి ఇది 7.06 శాతంగా ఉంది. ఆర్బీఐ వద్ద విదేశీ మారకం నిల్వలు 2022 సెప్టెంబర్ నాటికి 532.66 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023 మార్చి నాటికి 578.45 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ మొత్తంలో విదేశీ కరెన్సీ ఆస్తుల రూపంలో 509.69 బిలియన్ డాలర్లు ఉంది. 411.65 బిలియన్ డాలర్లను సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయగా, 75.51 బిలియన్ డాలర్లు ఇతర సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్లలో ఇన్వెస్ట్ చేసి ఉంది. 22.52 బిలియన్ డాలర్లు విదేశీ వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. -
Geological Survey of India: జమ్మూకశ్మీర్‌లో 59 లక్షల టన్నుల లిథియం
న్యూఢిల్లీ: బ్యాటరీలు, విద్యుత్ పరికరాల తయారీలో ఉపయోగించే అత్యంత కీలకమైన లిథియం నిక్షేపాలను తొలిసారిగా మన దేశంలో గుర్తించారు. జమ్మూకశ్మీర్‌లో దాదాపు 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ వెల్లడించింది. ‘‘జమ్మూకశ్మీర్‌లోని రిసాయి జిల్లా సలాల్ హైమనా ప్రాంతంలో లిథియం నిల్వలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) గుర్తించింది’’ అని ట్వీట్ చేసింది. గనుల శాఖ 2018–19లో నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 51 ఖనిజ క్షేత్రాలను కనిపెట్టింది. సంబంధిత సమాచారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవేసింది. బంగారంతో పాటు పొటాషియం, మాలిబ్డినం, ఇంకా ఇతర ప్రాథమిక లోహాల నిక్షేపాలను 11 రాష్ట్రాల్లో గుర్తించారు. బంగారం నిల్వలను 5 క్షేత్రాలను కనుగొన్నారు. జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గనుల శాఖ తెలిపింది. భారత్ ప్రస్తుతం లిథియంను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. విద్యుత్ వాహనాల తయారీలో లిథియం చాలా కీలకం. ఇప్పుడు ఈ ఖనిజ నిల్వలు జమ్మూకశ్మీర్‌లో బయటపడడంతో రాబోయే రోజుల్లో దేశంలో విద్యుత్ వాహనాల తయారీ రంగం వేగం పుంజుకోనుంది. లిథియం దిగుమతుల భారం పెద్దగా ఉండదు కాబట్టి విద్యుత్ వాహనాల ధరలు దిగివచ్చే అవకాశాలున్నాయి. స్మార్ట్ఫోన్ల తయారీలోనూ లిథియం ఉపయోగిస్తారు. -
కర్నూలులో బంగారు నిక్షేపాల వెలికితీత
తుగ్గలి: బంగారు నిక్షేపాల వెలికితీతలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని పగిడిరాయి–జొన్నగిరి గ్రామాల మధ్య డ్రిల్లింగ్ పనులను మంగళవారం జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించింది. తుగ్గలి మండలంలోని పగిడిరాయి, బొల్లవానిపల్లి, జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో 40 ఏళ్లుగా వివిధ కంపెనీలు సర్వేలు చేసి, బంగారం నిక్షేపాలున్నాయని గుర్తించాయి. దాదాపు 15 ఏళ్లుగా సర్వే చేస్తున్న జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిక్షేపాల వెలికితీతకు సిద్ధమై.. 2013లోనే ప్రభుత్వ అనుమతులు పొందింది. నిక్షేపాల వెలికితీతపై కొందరు కోర్టుకు వెళ్లడంతో పనుల్లో జాప్యమైంది. గతేడాది ఎకరా రూ.12 లక్షలు చొప్పున 300 ఎకరాలు కొనుగోలు చేసి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, భూములు కోల్పోయే రైతులకు డబ్బులు చెల్లించడంలో జాప్యం జరగడం, కొన్నాళ్ల పాటు కంపెనీ ప్రతినిధులు మొహం చాటేయడంతో మైనింగ్ ప్రాజెక్టు కలగా మిగిలింది. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం కంపెనీ ప్రతినిధులు వచ్చి రైతులతో మాట్లాడి ఏడాది కౌలు చెల్లించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సోమవారం డ్రిల్లింగ్ పనులు మొదలు పెట్టారు. -
బంగారంపై వడ్డీ గుంజుతున్న శ్రీవారు
-
కలెక్టర్‌కు బంగారు నిక్షేపాల సమాచారం
అనంతపురం: ఓ వృద్ధుడు తన ఇంట్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. పుట్లూరు మండలం ఎన్.తిమ్మాపురం గ్రామానికి చెందిన వెంకట కొండయ్య అనే వృద్ధుడు ఈ విషయమై కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. తన ఇంట్లో ఉన్న నిధులను వెలికితీసి ప్రభుత్వానికి ఇవ్వాలని ఆయన కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మార్వో, పోలీసులు ఆ వృద్ధుడి ఇంటిని పరిశీలించారు. -
మహేశ్ బ్యాంకులో రూ.3కోట్ల కుంభకోణం
గోల్డ్లోన్ల పేరిట బ్యాంకు సిబ్బంది చేతివాటం, కేసు నమోదు ఖమ్మం, న్యూస్‌లైన్: ఖమ్మంలోని మహేశ్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో కుంభకోణం వెలుగుచూసింది. బినామీ ఖాతాలను తెరచి బంగారం రుణం పేరిట కోట్ల రూపాయలు దుర్వినియోగానికి పాల్పడిన ఈ ఘటనలో బ్యాంకు సిబ్బందే కీలకపాత్ర పోషించినట్టు తెలిసింది. ఈ కుంభకోణంపై గత 15 రోజులుగా బ్యాంకు సిబ్బంది అంతర్గత విచారణ జరుపుతున్నారు. బంగారం డిపాజిట్ చేయకుండానే 21 మంది పేరిట బినామీ ఖాతాలను తెరచి దాదాపు రూ.3 కోట్ల వరకు సిబ్బంది స్వాహా చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రమేయం ఉందని గతంలో బ్యాంకు మేనేజర్‌గా పనిచేసిన అరుణ్‌కుమార్, అకౌంటెంట్ శ్రీనివాస్‌లను సస్పెండ్ చేశారు. బ్యాంకు కొత్త మేనే జర్గా బాధ్యతలు చేపట్టిన కనకరాజు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పసిడి డిపాజిట్లు జిగేల్!
బంగారు ఆభరణాలను డిపాజిట్ చేయడం ద్వారా ఇకపై ఇన్వెస్టర్లు 3% వరకూ వడ్డీని పొందే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా పన్ను రహితంగా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు దేశంలోనే అత్యధికంగా పసిడిని దిగుమతి చేసుకునే బ్యాంక్ ఆఫ్ నోవా స్కాటియా ప్రణాళికలు సిద్ధం చేసింది. గోల్డ్ డిపాజిట్ పథకంకింద ఇన్వెస్టర్ల నుంచి ఆభ రణాలను సమీకరించేందుకు ఆభరణ వర్తకులతో జత కట్టే యోచనలో ఉంది. ఈ పథకం అమలుకోసం రిజర్వ్ బ్యాంక్‌తోపాటు, వజ్రాలు, ఆభరణ వర్తక ఫెడరేషన్(జీజేఎఫ్)తోనూ నోవా స్కాటియా చర్చలు నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ ఎండీ రాజన్ వెంకటేష్ చెప్పారు. ఈ పథకంలో భాగంగా బంగారు ఆభరణాలను డిపాజిట్ చేసే ఇన్వెస్టర్లకు వడ్డీ కింద కూడా బంగారాన్నే ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్బీఐ మాత్రమే... ప్రస్తుతం దేశీయంగా ఇలాంటి పథకాన్ని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ అందిస్తోంది. అయితే గోల్డ్ డిపాజిట్ పథకానికి వడ్డీ నామమాత్ర స్థాయిలో 0.75% నుంచి 1% వరకూ అందిస్తోంది. కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) పెరిగిపోతుండటంతో కొంతకాలంగా ఇటు ప్రభుత్వం, అటు రిజర్వ్ బ్యాంక్ బంగారం దిగుమతులపై పలు ఆంక్షలను అమలు చేస్తున్న విషయం విదితమే. దీంతో నోవా స్కాటియాకు అవసరమైనమేర పసిడిని దిగుమతి చేసుకోవడం సమస్యగా పరిణమించింది. దేశీయ ఆభరణ వర్తకులకు కూడా బంగారం సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. పెళ్లిళ్లు, పండుగలు వంటి సీజన్ల కారణంగా ధర పెరిగినప్పటికీ దేశంలో బంగారానికి డిమాండ్ మెరుగుపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారతీయుల దగ్గర ఆభరణాల రూపంలో ఉన్న 20,000 టన్నుల బంగారం అంచనాలపై నోవా స్కాటియా బ్యాంక్ వర్గాలకు దృష్టి మళ్లింది. అయితే గోల్డ్ డిపాజిట్ పథకంపై చర్చలు తుది దశలో ఉన్నాయని, కొన్ని అంశాలను పరిష్కరించుకోవలసి ఉన్నదని వెంకటేష్ చెప్పారు. ఇవి పూర్తయితే పథకాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. కాగా, ఈ పథకానికి త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ అనుమతి లభిస్తుందని విశ్వసిస్తున్నట్లు జీజేఎఫ్ చైర్మన్ హరేష్ సోనీ చెప్పారు. ఈ పథకానికి 2.5-3% వడ్డీ రేటును తాము ప్రతిపాదించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా పసిడి డిపాజిట్ కాలపరిమితిని రెండు నుంచి ఏడేళ్ల కాలానికి ప్రతిపాదించినట్లు తెలిపారు. స్టేట్‌బ్యాంక్‌లో గోల్డ్ డిపాజిట్లకు కాలపరిమితి మూడు నుంచి ఐదేళ్లుగా ఉంది.