ముంబై: ఆర్‌బీఐ వద్ద బంగారం నిల్వలు ఏడాది కాలంలో 5 శాతం పెరిగాయి. ఈ ఏడాది మార్చి చివరికి 794.64 టన్నులకు చేరాయి. ఇందులో 56.32 మెట్రిక్ టన్నులు గోల్డ్ డిపాజిట్లు రూపంలో ఉన్నాయి. 2022 మార్చి నాటికి ఇవి 760.42 టన్నులుగా ఉన్నాయి. అప్పటికి గోల్డ్ డిపాజిట్లు 11.08 మెట్రిక్ టన్నులతో పోలిస్తే, గణనీయంగా వృద్ధి చెందాయి. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సంలో ఆర్‌బీఐ 34.22 టన్నుల బంగారం నిల్వలను పెంచుకుంది. మార్చి చివరినాటికి ఆర్‌బీఐ వద్దనున్న 794.64 టన్నుల బంగారంలో 437.22 టన్నులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (బీఐఎస్) వద్ద సురక్షితంగా ఉందని, 301.10 టన్నులు దేశీయంగా నిల్వ ఉన్నట్టు ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది.
2023 మార్చి నాటికి ఆర్‌బీఐ వద్దనున్న మొత్తం విదేశీ మారకం నిల్వల విలువలో (డాలర్లలో) బంగారం నిల్వల విలువ 7.81 శాతానికి పెరిగింది. 2022 సెప్టెంబర్ నాటికి ఇది 7.06 శాతంగా ఉంది. ఆర్‌బీఐ వద్ద విదేశీ మారకం నిల్వలు 2022 సెప్టెంబర్ నాటికి 532.66 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023 మార్చి నాటికి 578.45 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ మొత్తంలో విదేశీ కరెన్సీ ఆస్తుల రూపంలో 509.69 బిలియన్ డాలర్లు ఉంది. 411.65 బిలియన్ డాలర్లను సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయగా, 75.51 బిలియన్ డాలర్లు ఇతర సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్లలో ఇన్వెస్ట్ చేసి ఉంది. 22.52 బిలియన్ డాలర్లు విదేశీ వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నట్టు ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment