తలసరి అప్పు రూ.35,373
రెండేళ్లలో రెండింతలు అవుతున్న అప్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం అప్పుల కుప్పలా మారుతోంది. ఏటికేడు అప్పులు, వడ్డీల భారం రాష్ట్రాన్ని వణికిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో రూ.70 వేల కోట్ల అప్పులు ఉండగా... 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1.23 లక్షల కోట్లకు చేరుతున్నాయి. అంటే రుణభారం రెట్టింపవుతోంది. ఇదే సమయంలో మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఆసుపత్రుల నిర్మాణాన్ని బడ్జెటేతర వనరుల ద్వారా చేపడతామని ప్రభుత్వం పేర్కొంది.
మిషన్ భగీరథకు రూ.30 వేల కోట్లు, ఈ ఏడాది నిర్మించే 2.60 లక్షల డబుల్ బెడ్‌రూం ఇళ్లకు రూ.15 వేల కోట్లు, హైదరాబాద్‌లో నాలుగు ఆసుపత్రుల నిర్మాణానికి రూ.5వేల కోట్లు అవసరమని అంచనా. ఈ లెక్కన దాదాపు రూ.50 వేల కోట్ల దాకా అప్పులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో అప్పుల భారం వచ్చే ఏడాది రూ.2 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గతేడాది వడ్డీల కోసమే ప్రభుత్వం రూ.7,162 కోట్లు వ్యయం చేసింది. 2016-17లో వడ్డీల చెల్లింపులకు రూ.7,706 కోట్లు కావాలని తాజా బడ్జెట్‌లో అంచనా వేసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభా ఉంది. ప్రభుత్వం చేసిన అప్పులను పంచితే తలసరి అప్పు రూ.35,373 చేరుతోంది.