గాజిరెడ్డిపల్లిలో ‘వడ్డీ’ జలగ
♦ అప్పులిచ్చి ఇళ్లు, పొలాలు రాయించుకుంటున్న వడ్డీ వ్యాపారి
♦ గ్రామస్తుల అమాయకత్వమే ఆసరా.. ఫిర్యాదు అందుకున్న పోలీసులు
తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో కొందరు కుటుంబ పోషణ, ఇతరాత్ర అవసరాల కోసం అప్పులు చేస్తున్నారు. ఈ అవసరమే ఓ వడ్డీ వ్యాపారికి కలిసొచ్చింది. అప్పులిస్తూనే ఇళ్లు, పొలాలు రాయించుకుంటున్నాడు. ఇటీవల ఓ వ్యక్తి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు తీగలాగే పనిలో పడ్డారు.
మెదక్: మండల పరిధిలోని గాజిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.3 వడ్డీతో స్థానికులకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు అప్పులు ఇస్తున్నాడు. అంతేకాదు అప్పు తీసుకున్న వ్యక్తికి సంబంధించిన ఇళ్లు, పొలాలను రిజిస్ట్రేషన్, లేదంటే మార్టిగేజ్ చేయించుకున్నట్టు సమాచారం. ఇదంతా తెలిసే జరుగుతున్నా బాధితులు నేరు మెదపని స్థితిలో ఉండిపోతున్నారు. సదరు వడ్డీ వ్యాపారి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నారు. అప్పుతీసుకుని ఆరు నెలలు కాగానే అసలుకు వడ్డీ, ఆపై చక్రవడ్డీ వేసి ముక్కుపిండి వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అనుమతులు లేని దందా
అప్పులు ఇవ్వాలంటే సంబంధిత అధికారుల నుంచి వ్యాపారి అనుమతులు తీసుకోవాలి. ముఖ్యంగా అప్పులిచ్చిన వ్యక్తి నుంచి అవసరమైన కాగితాలు తీసుకుంటారు. కానీ, ఇళ్లు, పొలాలను రిజిస్ట్రేషన్ చేసుకోరు. అయితే, గాజిరెడ్డిపల్లిలో సదరు వ్యాపారి మాటే శాసనంగా నడుస్తోంది. బూర్గుపల్లి గ్రామంలోనూ ఈ వ్యాపారి పాగా వేసినట్టు తెలిసింది. వీటితో పాటు వెండి, బంగారు ఆభరణాలను సైతం తాకట్టు పెట్టుకుని వడ్డీ రూ.3 చొప్పున అప్పులిస్తున్నాడు. అంతేకాదు గ్రామంలో బెల్టుషాపు నిర్వహిస్తున్నా పట్టించుకునేవారు లేదు. అర్ధరాత్రి 12 గంటల వరకు అక్కడ దందా నడుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల గాజిరెడ్డిపల్లిలో అప్పు చెల్లించే విషయంలో ఓ వ్యక్తి గొడవ పడటంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు విషయంపై ఆరా తీయడం మొదలుపెట్టారు.