ఆర్టీసీకి నిరాశే
బడ్జెట్‌లో రూ.236 కోట్లు కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: అప్పులు, నష్టాలతో సతమతమవుతున్న రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. అంతర్గత సామర్థ్యం పెంచుకుని నష్టాలు తగ్గించుకోవాలన్న హితోపదేశంతోనే సరిపెడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బడ్జెట్ కేటాయింపుల్లోనూ అదే పంథా అవలంబించారు. ఈ బడ్జెట్‌లో కేవలం రూ.236 కోట్లను విదిల్చి చేతులు దులుపుకొన్నారు. గతేడాది కేటాయించిన మొత్తంలో సగం కూడా విడుదల చేయలేదు.
గతేడాది ఆర్టీసీ సిబ్బంది వేతనాలు సవరించిన సమయంలో ఆర్టీసీని ఆదుకునేందుకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన సీఎం ప్రస్తుత బడ్జెట్‌లో దాని ఊసే ఎత్తలేదు. బడ్జెట్ ప్రతిపాదనలు చూసి ఆర్టీసీ యాజమాన్యం కంగుతినాల్సి వచ్చింది. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రణాళిక పద్దు కింద రూ.40 కోట్లు ప్రకటించింది.
బస్‌పాస్ రాయితీల రూపంలో నష్టపోతున్న మొత్తాన్ని రీయింబర్స్ చేసే క్రమంలో రూ.110 కోట్లు చూపింది. ప్రణాళికేతర పద్దు కింద మరో రూ.86 కోట్లను ప్రతిపాదించింది. గతేడాది రూ.150 కోట్లు ప్రకటించినా సవరించిన అంచనాలో దాన్ని రూ.91 కోట్లకు తగ్గించింది. గత బడ్జెట్ గడువు మరో పక్షం రోజులే ఉండగా ఇప్పటికీ నయా పైసా విడుదల కాలేదు. దీంతో తాజాగా కేటాయించిన నిధులు ఎంత వరకు విడుదల అవుతాయో చూడాల్సిందే.