ఉరి కొయ్యకు మరో యువరైతు
తొగుట : అప్పులు రైతుల పాలిట ఉరి కంబాలుగా మారుతున్నాయి. వర్షాలు పడకపోవడం, సాగు చేసిన పంటలు ఎండిపోతుండడం, చేసిన అప్పులు తీర్చేమార్గంలేక అన్నదాతలు ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తూ ఉరికంబాలు ఎక్కుతున్నారు. శుక్రవారం కూడా జిల్లాలకు చెందిన ఓ యువరైతు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని గుడికందుల గ్రామానికి చెందిన తుడుం రాజయ్య - దుర్గమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక్కగానొక్క కుమారుడైన సాంసోని (25)లు ఉన్నారు.
అయితే రాజయ్య ఇటీవల కాలంలో రూ. 1.50 లక్షలు అప్పు చేసి ముగ్గురు కుమార్తెలకు వివాహం చేశాడు. ఉన్న రెండు ఎకరాల భూమిలో సాంసోని ఏడాది కిందట సుమారు రూ. లక్ష అప్పులు చేసి రెండు బోరుబావులను తవ్వించగా అందులో చుక్కా నీరు పడలేదు. దీంతో తండ్రీకొడుకు చేసిన అప్పులు, వడ్డీలతో కలిసి సుమారు రూ. 3 లక్షలు ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో పంటలు పండకపోవడంతో అప్పులుతీర్చే మార్గం లేక సాంసోని భార్యతో కలిసి హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. వారం రోజుల కిందట గ్రామానికి చేరుకున్న సాంసోని అప్పుల విషయంలో గ్రామస్తులతో చర్చిస్తూ బాధపడ్డాడు.
అప్పుల విషయంలో తీవ్రమనస్తాపానికి గురైన సాంసోని శుక్రవారం గ్రామ శివారులో చాకలి ఆనందం వ్యవసాయ బావి వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని అటుగా వెళుతున్న వారు గమనించి కుటుంబీకులకు, గ్రామస్తులకు సమాచారం అందించారని తెలిపారు. కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. వృద్ధాప్యంలో ఉన్న తమకు ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, సాంసోని భార్య అరుణ రోదనలు పలువురిని కంటతడిలు పెట్టించాయి. ఈ మేరకు మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు మిరుదొడ్డి పోలీసులు తెలిపారు.