న్యూఢిల్లీ: ఐఆర్‌సీటీసీలో మరికొంత వాటాను కేంద్ర ప్రభుత్వం విక్రయించనున్నది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ)లో కొంత వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయిస్తామని పేర్కొంది. ఈ విక్రయ ప్రక్రియను నిర్వహించడానికి మర్చంట్ బ్యాంకర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. మర్చంట్ బ్యాంకర్లు తమ దరఖాస్తులను వచ్చే నెల 10లోపు సమర్పించాల్సి ఉంటుంది.
ఐఆర్‌సీటీసీలో కేంద్రానికి ప్రస్తుతం 87.40 శాతం వాటా ఉంది. సెబీ నిర్దేశించిన కనీస పబ్లిక్ హోల్డింగ్ నిబంధనల ప్రకారం ఈ వాటాను 75 శాతానికి తగ్గించుకోవలసి ఉంది. గతేడాది ఈ కంపెనీలో కొంత వాటాను ఐపీఓ ద్వారా కేంద్రం విక్రయించి రూ.690 కోట్లు సమీకరించింది. కాగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.10 లక్షల కోట్లు సమీకరిం చాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంట్లో భాగంగా ఎల్‌ఐసీలో కొంత వాటాను ఐపీఓ ద్వారా విక్రయించనున్నది. వాటా విక్రయ వార్తలతో ఐఆర్‌సీటీసీ 1% నష్టంతో రూ.1,347 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment