న్యూఢిల్లీ: ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2023)లో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) జోరుమీదుంది. కంపెనీలు నిధుల సమీకరణకు క్విప్‌ను అత్యధికంగా ఆశ్రయిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకూ క్విప్ ద్వారా రూ. 50,218 కోట్లు సమకూర్చుకున్నాయి. ఇది గతేడాది(2022) నమోదైన రూ. 8,196 కోట్లతో పోలిస్తే ఆరు రెట్లు అధికంకావడం గమనార్హం!
ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపడం సానుకూల ప్రభావం చూపుతోంది. ఇక రైట్స్, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) మార్గంలోనూ నిధుల సమీకరణ సైతం 2022తో పోలిస్తే భారీగా ఎగసింది. ఎన్‌ఎస్‌ఈ వివరాల ప్రకారం 2023లో రైట్స్ ఇష్యూల ద్వారా రూ. 8,017 కోట్లు అందుకున్నాయి. గతేడాది ఇవి రూ. 3,646 కోట్లుకాగా.. ఓఎఫ్‌ఎస్ ద్వారా 44 శాతం అధికంగా రూ. 15,959 కోట్లు లభించాయి. 2022లో ఇవి రూ. 11,110 కోట్లు మాత్రమే.
కారణాలివీ
క్విప్ ద్వారా నిధుల సమీకరణ వృద్ధికి ప్రధానంగా ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలంగా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. మార్కెట్లు లాభాల బాటలో కొనసాగుతున్నంతకాలం ఇన్వెస్టర్లకు రిటర్నులు లభిస్తుంటాయని తెలియజేశారు. అందులోనూ వేగవంతంగా పెట్టుబడుల సమీకరణకు వీలుండటంతో కంపెనీలు క్విప్ చేపట్టేందుకు ప్రాధాన్యత ఇస్తుంటాయని వివరించారు. లిస్టెడ్ కంపెనీలు పెట్టుబడి వ్యయాల కోసం, పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటా నిబంధనల అమలు కోసం సాధారణంగా కంపెనీలు క్విప్‌నకు తెరతీస్తుంటాయని విశ్లేషకులు తెలియజేశారు. లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే వీలున్న క్విప్ ద్వారా సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి వేగంగా నిధులను అందుకునేందుకు వీలుండటం మరొక సానుకూల అంశమని తెలియజేశారు.
దిగ్గజాలు సై
ఈ ఏడాది క్విప్ ద్వారా ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ రూ. 8,800 కోట్లు అందుకుంది. ఈ బాటలో యూనియన్ బ్యాంక్(యూబీఐ) రూ. 5,000 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) రూ. 4,500 కోట్లు చొప్పున సమీకరించాయి. బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్ సైతం క్విప్ ద్వారా రూ. 2,305 కోట్లు సమకూర్చుకోవడం ప్రస్తావించదగ్గ అంశం! ఈ జాబితాలో చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చేరాయి. రైట్స్, ఎఫ్‌పీవో తదితరాలతో పోలిస్తే.. తక్కువ సమయం, సులభ నిబంధనల కారణంగా క్విప్ చేపట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment