న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్ప్(ఐఆర్‌ఎఫ్‌సీ) ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్)ను చేపట్టనుంది. కంపెనీలో పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటా(ఎంపీఎస్) నిబంధన అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఆరి్థక సంవత్సరం(2023–24)లో 11శాతానికిపైగా వాటాను విక్రయించే వీలున్నట్లు అధికారిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతం రైల్వే రంగ ఫైనాన్సింగ్ కంపెనీలో ప్రభుత్వం 86.36 శాతం వాటా ను కలిగి ఉంది.
దీపమ్, రైల్వే శాఖల సీనియర్ అధికారులతో ఏర్పాటైన అంతర్‌మంత్రివర్గ గ్రూప్ ఎంతమేర వాటా విక్రయించాలనే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సెబీ ఎంపీఎస్ నిబంధనలో భాగంగా ప్రభుత్వం 11.36 శాతం వాటాను ఆఫర్ చేయవలసి ఉంటుంది. స్టాక్ ఎక్సే్ఛంజీలలో 2021 జనవరిలో లిస్టయిన కంపెనీ ఐదేళ్లలోపు ఎంపీఎస్‌ను అమలు చేయవలసి ఉంది. అయితే వాటా విక్రయ అంశంపై ఇన్వెస్టర్ల ఆసక్తిని గమనిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
బీఎస్‌ఈలో ఐఆర్‌ఎఫ్‌ఎస్ షేరు దాదాపు రూ. 51 వద్ద కదులుతోంది. ఈ ధరలో 11.36 శాతం వాటాకుగాను ప్రభుత్వం రూ. 7,600 కోట్లు అందుకునే వీలుంది. కాగా.. ప్రభుత్వం కొంతమేర వాటాను విక్రయించనుండగా.. మరికొంత తాజాగా జారీ చేయనున్నట్లు అంచనా. ఓఎఫ్‌ఎస్ వార్తల నేపథ్యంలో ఐఆర్‌ఎఫ్‌సీ షేరు బీఎస్‌ఈలో తొలుత రూ. 52.7 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. చివరికి 0.6 శాతం బలపడి రూ. 51.2 వద్ద ముగిసింది. ఈ నెలలో ఇప్పటివరకూ షేరు 38 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment