
ఎల్ అండ్ టీకి అధిక వ్యయాల దెబ్బ
33 శాతం తగ్గిన నికర లాభం
ముంబై : ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్ అండ్ టీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 37 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.967 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.606 కోట్లకు తగ్గిపోయిందని ఎల్ అండ్ టీ పేర్కొంది. వ్యయాలు అధికమవడం, కొన్ని ప్రాజెక్టుల కార్యకలాపాలు నెమ్మదించడం నికర లాభం క్షీణతకు ప్రధాన కారణాలని తెలిపింది. నికర అమ్మకాలు రూ.18,975 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.20,252 కోట్లకు పెరిగాయని పేర్కొంది.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.26,376 కోట్ల కొత్త ఆర్డర్లు సాధించామని, వీటిల్లో అంతరాజీయ ఆర్డర్లు రూ.8,110 కోట్లని ్ల(31 శాతమని) వెల్లడించింది. జూన్ చివరి నాటికి తమ గ్రూప్ ఆర్డర్ బుక్ విలువ 22 శాతం వృద్ధితో రూ.2,38,973 కోట్లకు ఎగసిందని వివరించింది. దీంట్లో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా 26 శాతమని పేర్కొంది. ఎల్ అండ్ టీ గ్రూప్ టెక్నాలజీ, ఇంజినీరింగ్,నిర్మాణ, తయారీ, ఆర్థిక సేవల రంగాల్లో దాఆపు 30 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీ వార్షిక ఆదాయం 1,500 కోట్ల డాలర్లకు పైగా ఉంటుందని అంచనా.
ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ ఐపీఓ
ఎల్ అండ్ టీ సంస్థ తన ఐటీ విభాగం, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయనుంది. ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌లో 15 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) ద్వారా విక్రయించాలన్న ప్రతిపాదన శుక్రవారం జరిగిన ఎల్ అండ్ టీ బోర్డ్ సమావేశంలో ఆమోదం పొందింది. ఈ వాటా విక్రయం ద్వారా రూ.2,500 కోట్లు నిధులు వస్తాయని అంచనా. దీనికి సంబంధించిన పత్రాలను ఎల్ అండ్ టీ వచ్చే నెల మూడో వారంలో సెబీకి సమర్పింస్తుందని సమాచారం. కాగా ఈ ఐపీఓకు కోటక్, సిటిబ్యాంక్, బార్‌క్లేస్‌లు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 9 డెలివరీ సెంటర్లతో షెవ్రాన్, హిటాచి, శాన్యో, లఫార్జే తదితర దిగ్గజ సంస్థలకు ఐటీ సేవలనందిస్తోంది.