కోల్ ఇండియా వాటా విక్రయం సక్సెస్
రూ. 22,557 కోట్ల సమీకరణ; కొత్త రికార్డు
* ఆఫర్ ఫర్ సేల్‌కు 1.07 రెట్ల స్పందన
* అతిపెద్ద కొనుగోలుదారు ఎల్‌ఐఎసీ..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బొగ్గు దిగ్గజం కోల్ ఇండియాలో (సీఐఎల్) వాటాల విక్రయానికి శుక్రవారం నిర్వహించిన ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విజయవంతమైంది. 10 శాతం వాటాల డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ఖజానాకు రూ. 22,557.3 కోట్లు లభించాయి.
ప్రభుత్వ రంగానికే చెందిన మరో దిగ్గజం ఎల్‌ఐఎసీ ఏకంగా మూడింట ఒక వంతు షేర్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. స్టాక్ ఎక్స్చేంజీల వద్ద గణాంకాల ప్రకారం మొత్తం 63.16 కోట్ల షేర్లకు గాను 67.52 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. తద్వారా ఇష్యూ 1.07 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయినట్లయింది. అత్యంత భారీ ఇష్యూ కింద కోల్ ఇండియా తన రికార్డును తానే మరోసారి బద్దలు కొట్టింది.
ఇటు ప్రైవేట్, అటు ప్రభుత్వ రంగంలో చూసినా ఏ సంస్థా కూడా ఇప్పటిదాకా ఇంత భారీ ఇష్యూ తలపెట్టలేదు. 2010లో పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు సీఐఎల్ ఏకంగా రూ. 15,000 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూ సక్సెక్స్‌తో కాగా, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యంలో దాదాపు సగభాగం వచ్చినట్లే అవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 43,425 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకుంది.
ఇన్వెస్టర్ల విశ్వాసం వెల్లడైంది..: కోల్ ఇండియా షేర్ల విక్రయానికి లభించిన స్పందనను చూస్తే సంస్కరణల విషయంలో ప్రభుత్వ నిబద్ధతపై ఇన్వెస్టర్లకున్న విశ్వాసం వెల్లడైనట్లు భావించవచ్చని బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. ఎల్‌ఐసీ ఏకంగా రూ. 7,000 కోట్ల మేర విలువ చేసే షేర్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. 5% డిస్కౌంటు లభించిన రిటైల్ ఇన్వెస్టర్లు రూ. 1,852.55 కోట్ల విలువ చేసే షేర్లకు బిడ్లు వేశారు. మరోవైపు, డిజిన్వెస్ట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తూ కార్మిక సంస్థలు కంపెనీకి చెందిన కొన్ని యూనిట్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.
బీఎస్‌ఈలో శుక్రవారం కోల్ ఇండియా షేరు ధర 3.81 శాతం క్షీణించి రూ. 360.85 వద్ద ముగిసింది.