
న్యూఢిల్లీ: రైల్వే రంగ పీఎస్‌యూ దిగ్గజం ఐఆర్‌సీటీసీలో ప్రభుత్వం 5 శాతంవరకూ వాటాను విక్రయించనుంది. ఇందుకు షేరుకి రూ. 680 ఫ్లోర్ ధరను ప్రకటించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్)లో భాగంగా 2.5 శాతం వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఇన్వెస్టర్ల నుంచి అధిక స్పందన లభిస్తే మరో 2.5 శాతం వాటాను సైతం ఆఫర్ చేయనుంది.
వెరసి 4 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా ప్రభుత్వానికి రూ. 2,700 కోట్లు సమకూరే వీలుంది. కాగా.. బుధవారం ముగింపు ధర రూ. 735తో పోలిస్తే ఇది 7.5 శాతం డిస్కౌంట్. నేడు సంస్థాగత ఇన్వెస్టర్లకు, శుక్రవారం రిటైలర్లకు ఓఎఫ్‌ఎస్ అందుబాటులోకి రానుంది. వాటా విక్రయ నిధులు ప్రభుత్వానికి డిజిన్వెస్ట్‌మెంట్‌కింద జమకానున్నాయి.