న్యూఢిల్లీ: మెటల్ రంగ సంస్థ భారత్ అల్యూమినియం కంపెనీ(బాల్కో)లో మిగిలిన 49 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. అంతేకాకుండా సంస్థ ప్రమోటర్ గ్రూప్ వేదాంతా చేపట్టిన ఆర్బిట్రేషన్‌ను ఉపసంహరింప చేయాలని చూస్తున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. ఇందుకు వీలుగా వేదాంతాతో గనుల శాఖ, దీపమ్ ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్లు తెలియజేశారు.
మిగిలిన వాటా విషయంలో అధిక విలువ వివాదంపై 2009లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాల్కో ఆర్బిట్రేషన్ కేసును దాఖలు చేసింది. కాగా.. బాల్కో ప్రమోటర్లతో ప్రాథమిక చర్చలు చేపట్టినట్లు పాండే వెల్లడించారు. ఈ విషయంలో మరింత లోతుగా చర్చించనున్నట్లు తెలియజేశారు. కంపెనీని స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేయాలంటే ఆర్బిట్రేషన్ కేసును వెనక్కి తీసుకోవలసి ఉన్నట్లు వివరించారు. ఇందుకు ప్రమోటర్లు ఒప్పుకుంటే పబ్లిక్ ఇష్యూకి సన్నాహాలు ప్రారంభిస్తామని తెలియజేశారు.
వాటా విక్రయం ఇలా
2001లో ప్రభుత్వం మెటల్ పీఎస్‌యూ.. బాల్కోలో 51 శాతం వాటాను స్టెరిలైట్ ఇండస్ట్రీస్‌కు విక్రయించింది. వేదాంతా గ్రూప్ అనుబంధ కంపెనీ స్టెరిలైట్ ఇందుకు రూ. 551 కోట్లు వెచ్చించింది. మిగిలిన 49 శాతం వాటా ప్రభుత్వం వద్దే ఉంది. ఒప్పందంలోని కాల్ ఆప్షన్ ప్రకారం 2004లో స్టెరిలైట్ మిగిలిన 49 శాతం వాటా కోసం ప్రభుత్వానికి రూ. 1,099 కోట్లు ఆఫర్ చేసింది. అయితే వాటా విలువ అంతకంటే అధికమని కాగ్ నివేదిక పేర్కొనడంతో ప్రభుత్వం ఆఫర్‌ను తిరస్కరించింది.
దీంతో 2009లో ప్రమోటర్ వేదాంతా గ్రూప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. బాల్కో ఆర్బిట్రేషన్ అంశం హిందుస్తాన్ జింక్ కేసు(2009)ను పోలి ఉన్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే 2021 నవంబర్‌లో సుప్రీం కోర్టు ఓపెన్ మార్కెట్ విక్రయానికి ప్రభుత్వాన్ని అనుమతించింది. తద్వారా 29.5 శాతం వాటాను విక్రయించేందుకు ప్రభుత్వానికి వీలు చిక్కింది. 2022లో ప్రమోటర్ సంస్థ వేదాంతా ఆర్బిట్రేషన్‌ను ఉపసంహరించడంతో ప్రభుత్వం హిందుస్తాన్ జింక్‌లో వాటాను అమ్మేందుకు సన్నాహాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment