అల్యూమినియం కంపెనీల డైలమా | Aluminum companies step back on investment plans | Sakshi
Sakshi News home page

అల్యూమినియం కంపెనీల డైలమా

Published Fri, Dec 30 2022 5:06 AM | Last Updated on Fri, Dec 30 2022 5:06 AM

Aluminum companies step back on investment plans - Sakshi

అల్యూమినియం రంగ దిగ్గజాలు వేదాంతా, నోవెలిస్‌ పెట్టుబడి వ్యయాలపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. దేశీ దిగ్గజం హిందాల్కో మాత్రం విస్తరణ ప్రణాళికలను అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వివరాలు చూద్దాం..

ముంబై: తయారీ వ్యయాలు పెరిగిపోవడానికితోడు.. అంతర్జాతీయంగా అల్యూమినియం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతుండటంతో దిగ్గజ కంపెనీలు పెట్టుబడి ప్రణాళికలపై వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2022–23) పెట్టుబడి వ్యయాలపై కొంతమేర కోతలు అమలు చేస్తున్నాయి. వెరసి ప్రణాళికలను తిరిగి సమీక్షిస్తున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్‌) కాలానికి ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తూ వేదాంతా అల్యూమినియం, విద్యుత్‌ విభాగంపై పెట్టుబడి వ్యయాల్లో 40 శాతం కోతను అమలు చేయనున్నట్లు ఇన్వెస్టర్లకు తెలియజేసింది. దీంతో ఈ ఏడాదికి తొలుత అనుకున్న 100 కోట్ల డాలర్ల(సుమారు రూ. 8,250 కోట్లు) వ్యయాలకుగాను 60 కోట్ల డాలర్లనే వెచ్చించనుంది. ఫలితంగా 2 బిలియన్‌ డాలర్లస్థానే 1.6 బిలియన్‌ డాలర్లకే మొత్తం పెట్టుబడులు పరిమితంకానున్నాయి.   

నోవెలిస్‌ సైతం
ఆదిత్య బిర్లా గ్రూప్‌ దిగ్గజం హిందాల్కో విదేశీ అనుబంధ సంస్థ నోవెలిస్‌ సైతం పెట్టుబడి వ్యయాలను పునఃసమీక్ష చేయనుంది. యూఎస్‌లో ప్యాకేజింగ్, ఆటోమోటివ్, కన్‌స్ట్రక్షన్‌ రంగాలకు ప్రొడక్టులను సరఫరా చేస్తున్న కంపెనీ పెట్టుబడి వ్యయాలను 30–37 శాతం స్థాయిలో తగ్గించుకోనుంది. 1.3– 1.6 బిలియన్‌ డాలర్లకు బదులుగా 0.9–1 బిలియ న్‌ డాలర్లనే వెచ్చించనుంది. ఇందుకు అధిక ఇంధన ధరలు, గ్లోబల్‌ స్థాయిలో నీరసించిన అల్యూమినియం ధరలు కారణమని కంపెనీ ప్రస్తావిస్తోంది.  

40 శాతం డౌన్‌
అల్యూమినియం ధరలు ఈ ఏడాది మార్చిలో టన్నుకి 4,000 డాలర్లను తాకగా.. నవంబర్‌కల్లా 40 శాతం పతనమయ్యాయి. ఎల్‌ఎంఈలో టన్ను 2,400 డాలర్లకు చేరింది. మరోపక్క ఊపందుకున్న ఇంధన ధరలు పలు ప్రాథమిక లోహ(బేస్‌ మెటల్‌) కంపెనీల జులై–సెప్టెంబర్‌(క్యూ2) లాభదాయకతను దెబ్బతీశాయి. అయితే పలు మెటల్‌ రంగ కంపెనీల యాజమాన్యాల తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్‌–మార్చి)లో మార్జిన్లు బలపడనున్నాయి. లాభాలు పుంజుకోనున్నాయి. తయారీ వ్యయాలు తగ్గడం తదితర అంశాలు ఇందుకు సహకరించనున్నట్లు పరిశ్రమ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

హిందాల్కో సై
ఈ ఏడాదికి దేశీ బిజినెస్‌పై హిందాల్కో రూ. 3,000 కోట్ల పెట్టుబడులు వెచ్చిస్తోంది. కంపెనీ వివరాల ప్రకారం కొన్ని ప్రాజెక్టుల పరికరాలకు అనుమతులు ఆలస్యమవుతున్నప్పటికీ ఇప్పటికే రూ. 2,500 కోట్లు వినియోగించింది. దేశీయంగా పటిష్ట డిమాండ్‌ నెలకొన్న నేపథ్యంలో పెట్టుబడి వ్యయాలు కొనసాగుతున్నట్లు హిందాల్కో ఎండీ సతీష్‌ పాయ్‌ పేర్కొన్నారు. యూఎస్‌లోనూ ప్రధానంగా అల్యూమినియం పానీయాల క్యాన్లకు డిమాండ్‌ కనిపిస్తున్నట్లు తెలియజేశారు. ఇక వచ్చే ఏడాది(2023–24) ద్వితీయార్ధానికల్లా 3 మిలియన్‌ టన్నుల అల్యూమినియం తయారీ సామర్థ్యాన్ని అందుకోనున్నట్లు వేదాంతా సీఈవో సునీల్‌ దుగ్గల్‌ వెల్లడించారు. ప్రస్తుత 2.4 ఎంటీపీఏ సామర్థ్యాన్ని ప్రణాళికలకు అనుగుణంగా విస్తరిస్తున్నట్లు తెలియజేశారు. మరోవైపు ఒడిషాలోని ఝార్సిగూడా యూనిట్‌లో చేపట్టిన 1.8 ఎంటీపీఏ సామర్థ్యం ఇటీవలే పూర్తయిన విషయాన్ని ప్రస్తావించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement