
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్లకు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలను ప్రకటించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా తమ దరఖాస్తును మళ్లీ దాఖలు చేసినట్లు వేదాంత ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ సంస్థ వెల్లడించింది. 2027 నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా రూ. 1.5 లక్షల కోట్లతో ఎలక్ట్రానిక్ చిప్ ప్లాంటును నెలకొల్పనున్నట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
దేశీయంగా చిప్ తయారీని ప్రోత్సహించే దిశగా సెమీకండక్టర్ ఫ్యాబ్‌ల ఏర్పాటుకు ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహకాలను కేంద్రం 30 శాతం నుంచి 50 శాతానికి ఇటీవల పెంచింది. దీంతో గతంలో సమర్పించిన దరఖాస్తును ఉపసంహరించుకుని వేదాంత ఫాక్స్‌కాన్ తాజాగా మరోసారి దాఖలు చేసింది. 2027 ప్రథమార్ధంలో 5,000 వేఫర్లతో ప్రారంభించి .. నెలకు 40,000 వేఫర్ల స్థాయికి ఉత్పత్తిని పెంచుకోనున్నట్లు వేదాంత ఫాక్స్‌కాన్ సంస్థ సీఈవో డేవిడ్ రీడ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment