గాంధీనగర్: భారత్‌లో సెమీకండక్టర్ల తయారీపై దేశ, విదేశ కంపెనీలు పోటీపడుతున్నాయి. సెమీకాన్ సదస్సు వేదికగా తమ ప్రణాళికలను వెల్లడించాయి. తాము తలపెట్టిన చిప్ ఫ్యాక్టరీ తొలి దశ రెండున్నరేళ్లలో సిద్ధమవుతుందని వేదాంత చీఫ్ అనిల్ అగర్వాల్ వెల్లడించారు. ఇప్పటికే భాగస్వాములను ఎంపిక చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. తొలి దశపై 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు.
‘రెండున్నరేళ్లలో 2.5 ఏళ్లలో వేదాంత తయారు చేసిన మేడిన్ ఇండియా చిప్‌ను అందించబోతున్నాం‘ అని అగర్వాల్ చెప్పారు. 20 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్ల ప్లాంటు కోసం వేదాంతతో కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ నుంచి తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్ తప్పుకున్న నేపథ్యంలో అగర్వాల్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అటు భారత్‌లో చిప్‌ల తయారీ వ్యవస్థలోకి ప్రవేశించాలంటే ’అత్యంత సాహసికులై’ ఉండాలని ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియు పేర్కొన్నారు. వేదాంత జాయింట్ వెంచర్ గురించి ప్రస్తావించకుండా, ఇక్కడ ఎదురయ్యే ప్రతి అనుభవం.. కంపెనీలను మరింత దృఢంగా మారుస్తాయని ఆయన చెప్పారు.
ఏఎండీ డిజైన్ సెంటర్..
మరోవైపు, వచ్చే అయిదేళ్లలో భారత్‌లో 400 మిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు అమెరికన్ చిప్ తయారీ దిగ్గజం అడ్వాన్స్‌డ్ మైక్రో డివైజెస్ (ఏఎండీ) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మార్క్ పేపర్‌మాస్టర్ తెలిపారు. బెంగళూరులో తమ కంపెనీకి సంబంధించి అతి పెద్ద డిజైన్ సెంటర్‌ను 5,00,000 చ.అ. విస్తీర్ణంలో ఈ ఏడాది ఆఖరు నాటికి ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
అయిదేళ్ల వ్యవధిలో 3,000 పైచిలుకు ఇంజనీరింగ్ ఉద్యోగాలను కల్పించనున్నట్లు పేపర్‌మాస్టర్ పేర్కొన్నారు. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో భారత్‌లో తమ కార్యకలాపాలు పది ప్రాంతాలకు విస్తరించినట్లవుతుందని చెప్పా రు. భారత్‌లో ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ డిజైన్, ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించడంలో ఏఎండీ ప్రణాళికలు కీలకపాత్ర పోషించగలవని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విటర్‌లో ట్వీట్ చేశారు.
చిప్ ప్లాంటుకు జోరుగా కసరత్తు: మైక్రాన్
గుజరాత్‌లో తమ చిప్ ప్లాంటు ఏర్పాటుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు అమెరికన్ సెమీకండక్టర్ల తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్ సంజయ్ మెహరోత్రా తెలిపారు. దీనితో రాబోయే రోజుల్లో ప్రత్యక్షంగా 5,000, పరోక్షంగా 15,000 మందికి ఉపాధి లభించగలదని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment