కెయిర్న్ విలీనానికి లైన్ క్లియర్
వేదాంత వాటాదారుల ఆమోదం
న్యూఢిల్లీ: వేదాంతలో కెయిర్న్ ఇండియా విలీనానికి మరో అడుగు ముందుకు పడింది. కెయిర్న్ ఇండియా విలీనానికి వేదాంత లిమిటెడ్ వాటాదారులు, రుణదాతలు ఆమోదం తెలిపారు. ఈ వారం మొదట్లో వేదాంత లిమిటెడ్ మాతృ సంస్థ వేదాంత రీసోర్సెస్ వాటాదారులు సైతం ఈ విలీనానికి ఆమోదం తెలిపారు. కానీ, వచ్చే వారం సెప్టెంబర్ 12న జరిగే కెయిర్న్ ఇండియా వాటాదారుల సమావేశం కీలకం కానుంది. ఎందుకంటే సవరించిన షేర్ల మార్పిడి నిష్పత్తి ప్రకారం వేదాంత టేకోవర్‌కు కెయిర్న్ ఇండియా వాటాదారులు అంగీకారం తెలపాల్సి ఉంది.
సవరించిన డీల్ ప్రకారం కెయిర్న్ వాటాదారులకు రూ.10 ముఖ విలువ గలిగిన ఒక షేరుకు గాను రూ.1 ముఖ విలువ కలిగిన వేదాంత షేరుతోపాటు నాలుగు ప్రిఫరెన్స్ షేర్లను 18 నెలల కాలానికి 7.5% వడ్డీ రేటుతో జారీ చేస్తుంది. కెయిర్న్ ఇండియాలో ఎల్‌ఐసీకి 9.06%, మాజీ ప్రమోటర్ కెయిర్న్ ఎనర్జీకి 9.82% వాటాలు ఉన్నాయి. కాగా, నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న కెయిర్న్ విలీనం, భారీ రుణ భారాన్ని మోస్తున్న వేదాంతకు లభించనుంది. వేదాంతకు రూ.77,952 కోట్ల రుణాలు ఉండగా, కెయిర్న్ ఇండియా రిజర్వ్ నిధులు రూ.23,290 కోట్లను రుణాలను తీర్చివేసేందుకు ఉపయోగించాలని అనుకుంటున్నట్టు వేదాంత ఇప్పటికే తెలిపింది.