Cairn India
-
రెట్రో వివాద పరిష్కార దిశలో వేదాంత!
న్యూఢిల్లీ: కేంద్రంతో దాదాపు రూ.20,495 కోట్ల విలువైన రెట్రాస్పెక్టివ్ పన్ను వివాద పరిష్కారం దిశగా బిలియనీర్ అనిల్ అగర్వాల్ మైనింగ్ గ్రూప్ వేదాంతా ముందడుగు వేసింది. ప్రభుత్వంపై ఇందుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో అలాగే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ (ఐఏటీ)లో విచారణలో ఉన్న కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే... బ్రిటీష్ మాతృసంస్థ ద్వారా వచ్చిన మూలధన లాభాలపై పన్ను తీసివేయడంలో విఫలమైనందుకు కెయిర్న్ ఇండియా నుండి రూ. 20,495 కోట్ల పన్నులను (పెనాల్టీతో సహా) ఐటీ శాఖ డిమాండ్ చేసింది. అటు తర్వాత 2011లో కెయిర్న్ ఇండియాను అగర్వాల్ గ్రూప్ కొనుగోలు చేసింది. వేదాంతా లిమిటెడ్‌లో ఈ సంస్ధ విలీనమైంది. దీనితో పన్ను డిమాండ్ కేసు విషయంలో ఐటీ శాఖతో వేదాంత న్యాయ పోరాటం చేస్తోంది. మరోవైపు గతంలో ఎప్పుడో జరిగిన వ్యాపార ఒప్పందాలపై కూడా పన్నులు విధించేలా (రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్) 2012లో చేసిన చట్టం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో కేంద్రం ఇటీవల ఈ చట్టాన్ని పక్కన పెట్టింది. ప్రభుత్వంపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటే సామరస్యంగా ఈ వివాదాల పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. -
కెయిర్న్‌పై భారత్‌కు ఎదురుదెబ్బ
స్టే ఇవ్వటానికి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్యానెల్ నో... న్యూఢిల్లీ: బ్రిటన్ చమురు దిగ్గజ సంస్థ– కెయిర్న్ ఎనర్జీ ప్రారంభించిన ఆర్ర్‌బిట్రేషన్ ప్రక్రియపై స్టే విధించాలని భారత్ దాఖలు చేసిన పిటిషన్‌ను అంతర్జాతీయ త్రిసభ్య ఆర్బ్రిట్రేషన్ ప్యానల్ తోసిపుచ్చింది. గతనెలలోనే జరిగిన ఈ వ్యవహారం కాస్త ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం– భారత్ ఆదాయపు పన్ను శాఖ రూ.10,247 కోట్ల రెట్రాస్పెక్టివ్ పన్ను (గత వ్యాపార లావాదేవీలకు వర్తించే విధంగా అమలు చేసే పన్ను) చెల్లించాలంటూ కెయిర్న్‌కు డిమాండ్ నోటీసులిచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ, కెయిర్న్ ఎనర్జీ ఈ అంతర్జాతీయ ఆర్బ్రిట్రేషన్ను ఆశ్రయించింది. రెట్రాస్పెక్టివ్ పన్ను విధానం కింద ఏకంగా రూ.10,247 కోట్ల పన్ను వేయడం సరికాదంటూ కెయిర్న్ వ్యాజ్యం దాఖలు చేసింది. అయితే దీనిపై స్టే ఇవ్వటంతో పాటు అసలు ఈ పన్ను విధింపు భారత్– బ్రిటన్ ద్వైపాక్షిక పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందం కిందికి వస్తుందా? రాదా? అన్న విషయాన్ని కూడా ఆర్బ్రిట్రేషన్ ప్రక్రియలో విచారించాలనిభారత్ చేసుకున్న అభ్యర్థనను త్రిసభ్య ధర్మాసనం మార్చి 27న తోసిపుచ్చింది. కొత్తగా ఏర్పాటయిన కెయిర్న్ ఇండియాకు భారత్‌లోని తన అసెట్స్‌ను బదలాయించటం, స్టాక్ ఎక్సే్ఛంజింగ్లో లిస్ట్ కావటం ద్వారా కెయిర్న్ ఎనర్జీ క్యాపిటల్ గెయిన్స్ పొందిందని పేర్కొంటూ, 2014 జనవరిలో భారత్ ఆదాయపు పన్ను శాఖ ఆ సంస్థకు రెట్రాస్పెక్టివ్ పన్ను డిమాండ్ నోటీసు పంపింది. క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను మినహాయించలేదని పేర్కొంటూ, 2014 ఏప్రిల్‌లో కెయిర్ ఇండియాకు సైతం ఆదాయపు పన్ను శాఖ రూ.20,495 కోట్ల పన్ను డిమాండ్ ఇచ్చింది. అయితే ఈ రెట్రాస్పెక్టివ్ పన్ను విధింపు ఎంతమాత్రం తగదని కెయిర్న్ ఎనర్జీ గత ఏడాది మే నెలలో అంతర్జాతీయ ఆర్ర్బిట్రేషన్ను ఆశ్రయించింది. భారత్ ప్రభుత్వం నుంచి 5.6 బిలియన్ల పరిహారాన్ని కూడా సంస్థ డిమాండ్ చేస్తోంది. -
కెయిర్న్ ఇండియా లాభం 15 రెట్లు
ఆదాయం 5 శాతం అప్ న్యూఢిల్లీ: కెయిర్న్ ఇండియా నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్– డిసెంబర్ క్వార్టర్లో 15 రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో రూ.41 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో 1,376 శాతం వృద్ధితో రూ.604 కోట్లకు పెరిగిందని కెయిర్న్ ఇండియా తెలిపింది. ఒక్కో షేర్ పరంగా చూస్తే ఈ వృద్ధి 22 పైసల నుంచి రూ.3.21కు పెరిగిందని కెయిర్న్ ఇండియా తాత్కాలిక సీఈఓ సుధీర్ మాధుర్ పేర్కొన్నారు. ముడి చమురు ధరలు అధికంగా ఉండడమే నికర లాభంలో ఈ జోరుకు కారణమని వివరించారు. ఉత్పత్తి చేసిన ఒక్కో బ్యారెల్ ముడి చమురుకు రియలైజేషన్ 35 డాలర్ల నుంచి 32 శాతం వృద్ధి చెంది 46.2 డాలర్లకు చేరిందని తెలిపారు. ఆదాయం 5 శాతం పెరిగి రూ.2,149 కోట్లకు చేరిందని వివరించారు. మాతృ కంపెనీ వేదాంతతో విలీనానికి అన్ని వర్గాల వాటాదారుల ఆమోదం గత ఏడాది సెప్టెంబర్‌లోనే పొందామని, ఈ విలీనం ఈ ఏడాది మార్చికల్లా పూర్తవగలదని మాథుర్ పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కెయిర్న్ ఇండియా షేర్ 0.3% క్షీణించి రూ.275 వద్ద ముగిసింది. -
కెయిర్న్ విలీనానికి లైన్ క్లియర్
వేదాంత వాటాదారుల ఆమోదం న్యూఢిల్లీ: వేదాంతలో కెయిర్న్ ఇండియా విలీనానికి మరో అడుగు ముందుకు పడింది. కెయిర్న్ ఇండియా విలీనానికి వేదాంత లిమిటెడ్ వాటాదారులు, రుణదాతలు ఆమోదం తెలిపారు. ఈ వారం మొదట్లో వేదాంత లిమిటెడ్ మాతృ సంస్థ వేదాంత రీసోర్సెస్ వాటాదారులు సైతం ఈ విలీనానికి ఆమోదం తెలిపారు. కానీ, వచ్చే వారం సెప్టెంబర్ 12న జరిగే కెయిర్న్ ఇండియా వాటాదారుల సమావేశం కీలకం కానుంది. ఎందుకంటే సవరించిన షేర్ల మార్పిడి నిష్పత్తి ప్రకారం వేదాంత టేకోవర్‌కు కెయిర్న్ ఇండియా వాటాదారులు అంగీకారం తెలపాల్సి ఉంది. సవరించిన డీల్ ప్రకారం కెయిర్న్ వాటాదారులకు రూ.10 ముఖ విలువ గలిగిన ఒక షేరుకు గాను రూ.1 ముఖ విలువ కలిగిన వేదాంత షేరుతోపాటు నాలుగు ప్రిఫరెన్స్ షేర్లను 18 నెలల కాలానికి 7.5% వడ్డీ రేటుతో జారీ చేస్తుంది. కెయిర్న్ ఇండియాలో ఎల్ఐసీకి 9.06%, మాజీ ప్రమోటర్ కెయిర్న్ ఎనర్జీకి 9.82% వాటాలు ఉన్నాయి. కాగా, నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న కెయిర్న్ విలీనం, భారీ రుణ భారాన్ని మోస్తున్న వేదాంతకు లభించనుంది. వేదాంతకు రూ.77,952 కోట్ల రుణాలు ఉండగా, కెయిర్న్ ఇండియా రిజర్వ్ నిధులు రూ.23,290 కోట్లను రుణాలను తీర్చివేసేందుకు ఉపయోగించాలని అనుకుంటున్నట్టు వేదాంత ఇప్పటికే తెలిపింది. -
వేదాంత, కెయిర్న్ మెర్జర్ కు షేర్ హోల్డర్స్ గ్రీన్ సిగ్నల్
ప్రముఖ మైనింగ్ సంస్థ వేదాంత లిమిటెడ్..కెయిర్న్ ఇండియా విలీనానికి షేర్ హోల్డర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విలీన ప్రతిపాదనకు మదుపర్లు, సెక్యూర్డు, అన్సెక్యూర్డ్ రుణదాతలు అంగీకారం తెలిపారు. ఈ విషయాన్నివేదాంత రెగ్యులేటరీ ఫైలింగ్‌లో శుక్రవారం తెలిపింది. గోవాలో గురువారం జరిగిన ప్రతిపాదన ఓటింగ్‌కు వేదాంత లిమిటెడ్ మదుపర్లు అనుమతినిచ్చారని తెలిపింది. ఈ మెర్జర్ ద్వారా దేశంలో అతిపెద్ద విభిన్నమైన సహజ వనరులను సంస్థగా అవతరించాలనేది అగర్వాల్ ప్రణాళిక. సవరించిన ఆఫర్ ప్రకారం10 రూపాయల ముఖ విలువ గల షేర్ కు నాలుగు ప్రిఫరెన్షియల్ షేర్లను మైనారిటీ వాటాదారులకు అందించనుంది. అయితే వేదాంత అసలు పరీక్షను సెప్టెంబర్ 12న ఎదుర్కోనుంది. విలీన ఒప్పందంపై స్టేక్ హోల్డర్ల అభిప్రాయం తెలుసుకునేందుకు కెయిర్న్ ఇండియా ఆరోజునే సమావేశం నిర్వహించనుంది. అక్కడ అంగీకారం లభిస్తేనే ప్రక్రియ ముందుకు సాగుతుంది. కోటీశ్వరుడు అనిల్ అగర్వాల్ నేతృత్వంలో ముందుకు సాగుతున్న ఈ వ్యవహారంలో ఇటీవల వేదాంత రిసోర్సెస్, వేదాంత లిమిటెడ్ మాతృ సంస్థ యొక్క వాటాదారులు మెర్జర్ ను అనుమతించిన విషయం తెలిసిందే. -
కెయిర్న్ ఇండియా లాభం 28 శాతం క్షీణత
న్యూఢిల్లీ : చమురు ధరలు తగ్గడం కెయిర్న్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటిత్రైమాసిక ఆర్థిక ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపింది. వ్యయ నియంత్రణ పద్ధతులు ద్వారా కంపెనీ పొందిన లాభాలను తగ్గిన చమురు ధరలు హరించాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.501 కోట్లుగా ఉన్న కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 28 శాతం క్షీణించి రూ.360 కోట్లకు పతనమైంది. ఆదాయం రూ.2,627 కోట్ల నుంచి రూ.1,885 కోట్లకు పడిపోయింది. అయితే సీక్వెన్షియల్ ప్రాతిపదికన నికర లాభం 88 శాతం పెరిగిందని కంపెనీ సీఎఫ్ఓ, తాత్కాలిక సీఈఓ సుధీర్ మాధుర్ చెప్పారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కెయిర్న్ ఇండియా షేర్ స్వల్పంగా పెరిగి రూ. 177 వద్ద ముగిసింది. -
వేదాంత, కెయిర్న్ ఇండియాల విలీనానికి ఆమోదం తెలపలేదు
హైదరాబాద్: వేదాంత కంపెనీలో కెయిర్న్ ఇండియా విలీనానికి ఎల్ఐసీ ఆమోదం తెలిపిందన్న వార్త వాస్తవం కాదని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తెలిపింది. కెయిర్న్ ఇండియా విలీనానికి ఎల్ఐసీ పచ్చజెండా ఊపిందని మీడియాలో ప్రచారమైందని, ఇది సత్యదూరమని ఎల్ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విలీన ప్రతిపాదనకు ఎలాంటి ఆమోదం ఇవ్వలేదని ఎల్ఐసీ స్పష్టం చేసింది. కాగా ఈ విలీన ప్రతిపాదనకు ఎల్ఐసీ ఆమోదం తెలిపిందని, ఆగస్టు నుంచి విలీన కార్యక్రమాలు మొదలవుతాయని వార్తలు రావడంతో వేదాంత, కెయిర్న్ ఇండియాలు జోరుగా పెరిగాయి. బీఎస్ఈలో వేదాంత షేర్ 7% లాభంతో రూ.159.5 వద్ద, కెయిర్న్ ఇండియా 8.3 శాతం లాభంతో రూ.162.55 వద్ద ముగి శాయి. ఇంట్రాడేలో వేదాంత షేర్ ఏడాది గరిష్ట స్థాయి(రూ.162.50)ను తాకింది. -
కెయిర్న్ ఇండియాలో వాటా విక్రయానికి సిద్ధం: కెయిర్న్ ఎనర్జీ
న్యూఢిల్లీ: చమురు ఉత్పాదక కంపెనీ కెయిర్న్ ఇండియాలో వున్న 9.82 శాతం వాటాను విక్రయించడానికి బ్రిటన్ ఆయిల్ కంపెనీ కెయిర్న్ ఎనర్జీ సిద్ధమయ్యింది. ఈ విక్రయం కోసం షేర్‌హోల్డర్ల అనుమతి కోరడంతో పాటు ఇతర అంశాలు చర్చించేందుకు మే 12వ తేదీన కెయిర్న్ ఎనర్జీ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) ఏర్పాటుచేసింది. ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ. 29,000 కోట్ల రెట్రోస్పెక్టివ్ టాక్స్ డిమాండ్ నోటీసును అందుకున్న నేపథ్యంలో ఈ వాటా విక్రయ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. టాక్స్ డిమాండ్ నోటీసుతో పాటు మరో రూ. 10,200 కోట్ల అపరాధ రుసుం చెల్లించాలన్న నోటీసు కూడా ఐటీ శాఖ నుంచి వచ్చినట్లు కెయిర్న్ ఎనర్జీ క్రితంరోజే ప్రకటించిన సంగతి తెలిసిందే. కెయిర్న్ ఇండియాలో మెజారిటీ వాటాను మైనింగ్ దిగ్గజం వేదాంతకు 2011లో కెయిర్న్ 8.67 బిలియన్ డాలర్లకు విక్రయించింది. ఇంకా ఇండియా కంపెనీలో కెయిర్న్ ఎనర్జీకి 9.82 శాతం వాటా వుంది. రెట్రోస్పెక్టివ్ టాక్స్ చెల్లింపునకు సంబంధించిన వివాదం కారణంగా ఈ వాటా విక్రయాన్ని భారత్ ఆదాయపు పన్ను శాఖ నిషేధించిందంటూ ఏజీఎం నోటీసులో షేర్హోల్డర్లకు కెయిర్న్ తెలిపింది. వాటా విక్రయంపై ఐటీ శాఖ నుంచి భవిష్యత్తులో కంపెనీకి స్వేచ్ఛ లభిస్తే, షేర్హోల్డర్లకు విలువను అందిస్తామన్న విశ్వాసాన్ని కెయిర్న్ ఈ నోటీసులో వ్యక్తంచేసింది. -
99 శాతం తగ్గిన కెయిర్న్ ఇండియా లాభం
► చమురు ధరల పతనం, ► అధిక పన్నుల ప్రభావం న్యూఢిల్లీ: కెయిర్న్ ఇండియా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 99 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.1,350 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.9 కోట్లకు తగ్గిందని కెయిర్న్ ఇండియా తెలిపింది. ముడి చమురు ధరలు తగ్గడం, అధిక పన్నులు కారణంగా నికర లాభం భారీగా తగ్గిపోయిందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మయాంక్ అషర్ చెప్పారు. రాజస్తాన్ చమురు క్షేత్రాల్లో తాము ఉత్పత్తి చేస్తున్న ముడి చమురు ధర బ్యారెల్‌కు గత క్యూ3లో 68 డాలర్లుందని, ఈ క్యూ3లో 34.5 డాలర్లకు తగ్గిందని పేర్కొన్నారు. ఒక్కో బ్యారెల్‌కు 10 డాలర్ల చమురు సుంకం చెల్లిస్తున్నామని, రాయల్టీ, ఇతర లెవీలు కూడా ఉన్నాయని వివరించారు. ఆదాయం 42 శాతం క్షీణించి రూ.2,039 కోట్లకు తగ్గిందని పేర్కొంది. మంచి ఫలితాలనిస్తున్న ఈఓఆర్ ముడి చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో సెస్ చార్జీలను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వం యోచి స్తోందని, ఇది ప్రోత్సాహకర పరిణామమని మయాంక్ పేర్కొన్నారు. రాజస్తాన్ బ్లాక్‌లో తమ అన్వేషణ, ఉత్పత్తి లెసైన్స్ 2019లో ముగుస్తుందని, పదేళ్ల పొడిగింపును కోరుతున్నామని, ప్రభుత్వం సానుకూలంగా ఉందని వివరించారు. ఆర్థిక ఫలి తాలు నిరాశగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రికవరీ కావడంతో కెయిర్న్ ఇండియా షేర్ బీఎస్ఈలో 2.6 శాతం వృద్ధి చెంది రూ.113కు పెరిగింది. -
కెయిర్న్ ఇండియాకు చమురు దెబ్బ
70 శాతం తగ్గిన నికర లాభం న్యూఢిల్లీ: మైనింగ్ కుబేరుడు అనిల్ అగర్వాల్‌కు చెందిన కెయిర్న్ ఇండియా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 70 శాతం క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడం దీనికి ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. గత క్యూ2లో రూ.2,278 కోట్లుగా(ఒక్కో షేర్‌కు రూ.13.77) ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.673(ఒక్కో షేర్‌కు రూ.5.54)కు పడిపోయిందని తెలిపింది. గత క్యూ2లో బ్యారెల్ చమురును సగటున 92.1 డాలర్లకు అమ్మామని, ఈ క్యూ2లో బ్యారెల్ చమురు సగటు విక్రయ ధర 43.7 డాలర్లుగా ఉందని, 53 శాతం క్షీణత నమోదైందని వివరించింది. చమురు ధరలు బాగా తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూలధన వ్యయాలను సగానికి (50 కోట్ల డాలర్లకు) తగ్గించుకున్నామని తెలిపింది. చమురు సరఫరాలు అధికం కావడం కూడా ధరలపై ప్రభావం చూపించిందని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి రూ.17,943 కోట్ల నగదు నిల్వలున్నాయని వివరించింది. -
వేదాంతలో కెయిర్న్ ఇండియా విలీనం
పూర్తిగా షేర్లరూపంలోనే డీల్; విలువ 2.3 బిలియన్ డాలర్లు - కెయిర్న్ వాటాదారులకు 1:1 నిష్పత్తిలో వేదాంత షేర్ల కేటాయింపు - రూ.10 ముఖవిలువగల వేదాంత ప్రిఫరెన్షియల్ షేరు కూడా - విలీనానికి ఇరు కంపెనీల బోర్డులు ఓకే... - దేశంలో అతిపెద్ద సహజ వనరుల - కంపెనీగా నిలవనున్న వేదాంత! ముంబై: దేశీ ప్రైవేటు మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్‌లో కెయిర్న్ ఇండియా విలీనం ఖరారైంది. ఈ రెండు కంపెనీల మాతృ సంస్థ అయిన అనిల్ అగర్వాల్ వేదాంత గ్రూప్ తన రుణ భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఈ ఒప్పందానికి తెరతీసింది. పూర్తిగా షేర్ల మార్పిడి రూపంలో జరగనున్న ఈ డీల్ విలువ 2.3 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.15,000 కోట్లు). ఒప్పందానికి ఇరు కంపెనీల డెరైక్టర్ల బోర్డులు ఆదివారం ఆమోదముద్ర వేశాయి. డీల్ ప్రకారం.. కెయిర్న్ ఇండియా వాటాదారులకు ఒక్కో షేరుకి ప్రతిగా ఒక వేదాంత షేరు లభించనుంది. అంతేకాకుండా రూ.10 ముఖ విలువ గల ఒక రిడీమబుల్ ప్రిఫరెన్షియల్ షేరు(7.5 శాతం వడ్డీ ప్రకారం) దక్కుతుంది. మొత్తంమీద చూస్తే.. కెయిర్న్ ఇండియా గత శుక్రవారం నాటి షేరు ముగింపు ధర(రూ.180)తో పోలిస్తే కంపెనీ షేర్హోల్డర్లకు 7.3 శాతం మేర అధిక ధర(ప్రీమియం) లభిస్తున్నట్లు లెక్క. ఈ డీల్ ద్వారా భారత్‌లో అతిపెద్ద సహజవనరుల(విభిన్న విభాగాల్లో) కంపెనీగా వేదాంత అవతరించనుంది. లండన్ స్టాక్ఎక్స్ఛేంజీలో లిస్టయిన మాతృ సంస్థ వేదాంత రిసోస్సెస్ పీఎల్‌సీకి వేదాంతలో ప్రస్తుతం 62.9 శాతం వాటా ఉంది. ఇప్పుడు ఈ విలీన డీల్ పూర్తయితే ఈ వాటా 50.1 శాతానికి తగ్గనుంది. 2011లో కెయిర్న్ ఇండియాలో మెజారిటీ వాటాను దాదాపు 8.67 బిలియన్ డాలర్ల మొత్తానికి వేదాంత రిసోర్సెస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తమ కార్పొరేట్ స్వరూపాన్ని సరళీకరించే దిశగా 2013లో ప్రారంభించిన చర్యల్లో ఇది రెండో కీలక విలీన చర్యగా వేదాంత లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ అల్బనీస్ పేర్కొన్నారు. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2013లో సెసాగోవాను స్టెరిలైట్ ఇండస్ట్రీస్‌లో విలీనం చేసిన విషయం విదితమే. ఈ డీల్ తర్వాత సెసాస్టెరిలైట్గా మారిన విలీనకంపెనీ పేరు తదనంతరం వేదాంత లిమిటెడ్‌గా మార్పు చెందింది. కాగా, తాజా విలీన ఒప్పందం దీర్ఘకాలంలో వేదాంత వాటాదార్లకు మేలుచేకూర్చనుందని.. మరోపక్క, కెయిర్న్ ఇండియా షేర్హోల్డర్లకు కూడా ఇది మంచి డీల్‌గా అల్బనీస్ చెప్పారు. చమురు-గ్యాస్ రంగంలో కెయిర్న్ ఇండియాకు చాలా పటిష్టమైన బ్రాండ్ విలువ ఉందని.. విలీనం తర్వాత కూడా ఈ బ్రాండ్‌ను యథాతథంగా కొనసాగించనున్నట్లు అల్బనీస్ వెల్లడించారు. అంతేకాకుండా కంపెనీలో ఎలాంటి ఉద్యోగాల కోతలూ ఉండబోవని కూడా స్పష్టం చేశారు. కెయిర్న్ నగదు నిల్వలే లక్ష్యం... వేదాంత లిమిటెడ్‌కు దాదాపు 77,752 కోట్ల భారీ రుణ భారం ఉంది. దీంతోపాటు కెయిర్న్ ఇండియా నుంచి వేదాంత 1.25 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.8,000 కోట్లు) అంతర్గత రుణం కూడా తీసుకుంది. అయితే, దీనిపై అప్పట్లో ఇన్వెస్టర్ల నుంచి కొంత ప్రతికూలత కూడా ఎదురైంది. కాగా, ఇప్పుడు కెయిర్న్ ఇండియాను విలీనం చేసుకోవడం ద్వారా దానిదగ్గరున్న దాదాపు రూ.17,000 కోట్ల నగదు నిల్వలను రుణభారాన్ని కొంత మేర తగ్గించుకోవడానికి వేదాంత ఉపయోగించుకోనుంది. కెయిర్న్ ఇండియాకు ఇప్పుడు ఎలాంటి రుణాలు లేవు. అల్యూమినియం, కాపర్ ఉత్పత్తిలో దేశంలో నంబర్ వన్ కంపెనీగా వేదాంత లిమిటెడ్ నిలుస్తోంది. దేశీయంగా ఉన్న ఏడు బ్లాకుల్లో మూడింట్లో కెయిర్న్ ఇండియా చమురు-గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇదిలాఉండగా.. భారీగా నగదు నిల్వలున్న(దాదాపు రూ.31,000 కోట్లు) మరో సబ్సిడరీ హిందుస్థాన్ జింక్‌ను కూడా విలీనం చేసుకోవడానికి వేదాంత రిసోర్సెస్ సిద్ధంగా ఉంది. అయితే, దీనిలో ప్రభుత్వానికి 29.5 శాతం వాటా ఉండటంతో ఈ ప్రతిపాదన జాప్యమవుతూ వస్తోంది. అనుమతులే కీలకం... వేదాంతలో కెయిర్న్ ఇండియా విలీనానికి ఇప్పుడు వివిధ భాగస్వామ్య పక్షాలు, నియంత్రణపరమైన అనుమతులు కీల కంగా మారనున్నాయి. అయితే, వచ్చే ఏడాది మార్చి 31కల్లా డీల్‌ను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అల్బనీస్ తెలిపారు. కాగా, కెయిర్న్ ఇండియాలో 50 శాతం వాటా మైనారిటీ వాటాదారుల వద్ద ఉంది. ఇందులో దీని పూర్వపు మాతృ సంస్థ బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ(9.8 శాతం) ప్రధానమైనది. దీంతోపాటు మరో 9 శాతం వాటా ప్రభుత్వ రంగ బీమా అగ్రగామి ఎల్ఐసీకి చెందనుంది. డీల్ పూర్తవ్వాలంటే ఈ సంస్థల ఆమోదం తప్పనిసరి. విలీన ఒప్పందం ప్రతిపాదనను పూర్తిగా పరిశీలించిన తర్వాత తమ సంస్థ వాటాదారుల ప్రయోజనాల మేరకు నిర్ణయం తీసుకుంటామని కెయిర్న్ ఎనర్జీ ప్రతినిధి ఈ డీల్‌పై వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. విలీనానికి స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ.. నియంత్రణ సంస్థ సెబీతో పాటు హైకోర్టు అనుమతి కూడా అవసరమే. మరోపక్క, రాజస్థాన్‌లోని బామర్ ఆయిల్ బేసిన్, కేజీ బేసిన్లో రవ్వ చమురు-గ్యాస్ క్షేత్రంలోని కెయిర్న్ ఇండియా హక్కులను వేదాంతకు బదలాయించాలంటే కేంద్ర పెట్రోలియం శాఖ ఆమోదించాలి ఉంటుంది. ఇదిలాఉండగా.. గతం లో కెయిర్న్ ఎనర్జీ నుంచి వాటా కొనుగోలు డీల్‌లో కెయిర్న్ ఇండియా రూ.20,495 కోట్ల మేర పన్ను చెల్లించాలంటూ ఇప్పటికే ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాత లావాదేవీలను తిరగదోడి(రెట్రాస్పెక్టివ్) ఇలా పన్నులు వేయ డం పట్ల తాము చాలా విసుగు చెందామని.. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ప్రతిష్టకు నష్టం కలిగిస్తాయని వేదాంత చీఫ్ ఎగ్జిక్యూటివ్ అల్బనీస్ వ్యాఖ్యానించారు. -
వేదాంతలో కెయిర్న్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న కెయిర్న్ ఇండియా... వేదాంత ఇండియాలో విలీనం కానుంది. విలీనానికి ఇరు కంపెనీల బోర్డులు ఆమోదముద్ర వేశాయి. వచ్చే ఏడాది మార్చి నాటికల్లా డీల్ పూర్తి కావొచ్చని భావిస్తున్నారు. విలీనానికి సంబంధించి డీల్ పూర్తిగా షేర్ల రూపంలో ఉండనుంది. కెయిర్న్‌ఇండియా షేర్హోల్డర్లకు వేదాంత (గతంలో సెసా స్టెరిలైట్) షేర్లు లభించనున్నాయి. విలీనానికి శ్రీకారం చుట్టే దిశగా వేదాంత ఇటీవలే.. గ్రూప్‌లో భాగమైన ట్విన్ స్టార్ మారిషస్ హోల్డింగ్స్ నుంచి సుమారు 5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. 2011లో వేదాంత 8.67 బిలియన్ డాలర్లు వెచ్చించి కెయిర్న్ ఇండియాలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. ఈ ఏడాది మార్చి 31 దాకా గణాంకాల ప్రకారం వివిధ వ్యాపార విభాగాల ద్వారా కెయిర్న్ ఇండియాలో వేదాంతకు 59.9 శాతం వాటాలు ఉన్నాయి. -
చమురు మంత్రితో కెయిర్న్ సీఈవో భేటీ
న్యూఢిల్లీ: కెయిర్న్ ఇండియా, వేదాంత సంస్థల విలీనం అంశం క్రమంగా ముందుకు కదులుతోంది. ఇందుకు సంబంధించి కెయిర్న్ సీఈవో అషర్, సీఎఫ్‌వో సుధీర్ మాథుర్.. చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. ప్రతిపాదిత రివర్స్ మెర్జర్ గురించి వివరించారు. వేదాం త రుణభారాన్ని తగ్గించే ఉద్దేశంతో కెయిర్న్ ఇండియాలో దాన్ని విలీనం చేసే ప్రతిపాదనను రివర్స్ మెర్జర్గా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా వేదాంతలో కెయిర్న్ ఇండియాను విలీనం చేయాలంటే పలు అనుమతులు పొందాల్సి ఉంటుంది. అదే వేదాంతను కెయిర్న్లో విలీనం చేస్తే(రివర్స్ మెర్జర్) పలు అనుమతుల సమస్య తగ్గనుంది. ఇదే అంశంపై చర్చిం చేందుకు ఇరు సంస్థల బోర్డులు ఈ ఆదివారం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వేదాంతకు ఉన్న రూ.37,636 కోట్ల మేర రుణభారాన్ని తగ్గించడమన్నది ఈ విలీనం ప్రధానోద్దేశం. ఇందుకోసం కెయిర్న్ వద్దనున్న రూ. 16,870 కోట్ల నగదు నిల్వలతో పాటు కంపెనీకి ఏటా వచ్చే రూ. 1,320 కోట్ల లాభాలను వినియోగించుకోవచ్చన్నది ప్రతిపాదన. -
వేదాంతలో కెయిర్న్ ఇండియా విలీనం!
న్యూఢిల్లీ: నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న కెయిర్న్ ఇండియాను విలీనం చేసుకోవాలని వేదాంత ఇండియా యోచిస్తోంది. తద్వారా భారీ రుణ భారాన్ని తగ్గించుకోవచ్చని భావిస్తోంది. ఈ డీల్‌తో వేదాంత స్థూల రుణ భారం సుమారు రూ. 37,636 కోట్ల మేర తగ్గవచ్చని అంచనా. కెయిర్న్ వద్ద ఉన్న రూ. 16,870 కోట్లు, దాంతో పాటు ఏటా కంపెనీకి వచ్చే రూ. 14,000 కోట్ల మేర నిధులు దీనికి తోడ్పడగలవని వేదాంత యోచిస్తోంది. విలీనానికి సంబంధించి డీల్ పూర్తిగా షేర్ల రూపంలో ఉండనుంది. కెయిర్న్‌ఇండియా షేర్హోల్డర్లకు వేదాంత (గతంలో సెసా స్టెరిలైట్) షేర్లు లభించనున్నాయి. ఇరు కంపెనీల బోర్డులు విలీన ప్రతిపాదనను త్వరలో పరిశీలించనున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికల్లా డీల్ పూర్తి కావొచ్చని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2011లో వేదాంత 8.67 బిలియన్ డాలర్లు వెచ్చించి కెయిర్న్ ఇండియాలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. ఈ ఏడాది మార్చి 31 దాకా గణాంకాల ప్రకారం వివిధ వ్యాపార విభాగాల ద్వారా కెయిర్న్ ఇండియాలో వేదాంతకు 59.9 శాతం వాటాలు ఉన్నాయి. విలీనానికి శ్రీకారం చుట్టే దిశగా వేదాంత ఇటీవలే.. గ్రూప్‌లో భాగమైన ట్విన్ స్టార్ మారిషస్ హోల్డింగ్స్ నుంచి సుమారు 5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. విలీన ప్రతిపాదనపై స్పందించేందుకు నిరాకరించిన వేదాంత వర్గాలు.. కార్పొరేట్ స్వరూపాన్ని సరళతరం చేసే యోచనలో కంపెనీ ఉన్నట్లు వివరించాయి. -
సం'పన్ను'ల సంగ్రామం
⇒ ప్రభుత్వ పన్ను నోటీసులపై కంపెనీల్లో కలకలం ⇒ మొన్నటికి మొన్న కెయిర్న్ ఉదంతంపై బ్రిటన్ సీరియస్ ⇒ కోర్టు పోరాటంగా క్యాడ్బరీ వివాదం... ‘మ్యాట్’ నోటీసులపై ఎఫ్ఐఐల గరం గరం ⇒ ‘రెట్రాస్పెక్టివ్’ అంటూ పాత వ్యవహారాల్ని తోడటంపై కంపెనీల గుర్రు ⇒ స్టాక్మార్కెట్లో ఎఫ్ఐఐల విక్రయాలతో సెన్సెక్స్ 3వేల పాయింట్ల పతనం ⇒ దిగొచ్చిన ప్రభుత్వం; డీటీఏటీ దేశాలకు మినహాయింపు! సాక్షి, బిజినెస్ విభాగం: దీన్నొక రకంగా సంపన్నుల సంగ్రామమనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నది కంపెనీల్ని. అడుగుతున్నది వేల కోట్ల బకాయిల్ని. ఒకవైపు ‘పన్నుల ఉగ్రవాదం’ లేదంటూనే వరస నోటీసులివ్వటంతో తీవ్ర కలకలం రేగుతోంది. క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఎక్సయిజ్, మ్యాట్ వంటి పన్నులపై ప్రభుత్వమిస్తున్న నోటీసులు కొన్ని కంపెనీల్లో అసహనాన్ని రేపాయి. ఎఫ్ఐఐల విషయంలో ఇచ్చిన నోటీసులు స్టాక్ మార్కెట్ పతనానికీ దారితీశాయి. అసలు ఈ గొడవలేంటి? ఎందుకొస్తున్నాయి? కంపెనీలు చెల్లించాల్సిన పన్నులేంటి? అనే అంశాలపై వివరణాత్మక కథనమిది... క్యాపిటల్ గెయిన్స్ కింద రూ.20,495 కోట్లు చెల్లించాలంటూ కెయిర్న్ ఇండియాకు నోటీసులిచ్చిన వెంటనే... ఎప్పుడో తొమ్మిదేళ్ల కిందటి ఘటనకు వర్తింపజేసినందుకు నరేంద్రమోదీ ప్రభుత్వంపై కంపెనీలు విమర్శలు సంధిం చాయి. చివరికి బ్రిటన్ అధికారికంగా దీన్ని వ్యతిరేకించింది. ఇక క్యాడ్బరీ వ్యవహారమూ కోర్టుకెక్కింది. తాము 2010 కన్నా ముందే ప్లాంటు ఆరంభించాం కనక పన్ను మినహాయింపులన్నీ వర్తిస్తాయని క్యాడ్బరీ... అలా చేయలేదు కాబట్టే నోటీసులు ఇచ్చామంటూ ప్రభుత్వం కోర్టుకెక్కాయి. వీటన్నిటినీ మించి... ఎఫ్ఐఐల వ్యవహారం స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. వచ్చే ఏడాది నుంచి ‘మ్యాట్’ తొలగిస్తామని చెప్పి.. పాత సంవత్సరాలకంటూ రూ.40వేల కోట్లు కట్టమనటాన్ని వ్యతిరేకిస్తూ... స్టాక్ మార్కెట్లలో అమ్మకాలకు దిగారు. గడిచిన 12 రోజుల్లో రూ.7000 కోట్ల మేర నికర అమ్మకాలు జరపటంతో నిఫ్టీ 9000 పాయింట్ల నుంచి ఏకంగా 8180 పాయింట్లకు పడిపోయింది. సెన్సెక్స్ కూడా 3,000 పాయింట్ల మేర నష్టపోయింది. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం.. మారిషస్, సింగపూర్ వంటి ద్వంద పన్ను నివారణ ఒప్పందాలున్న దేశాల్ని మినహాయిస్తున్నట్లు సంకేతాలిచ్చింది కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ‘రెట్రాస్పెక్టివ్’తోనే సమస్య... నిజానికి ‘మేకిన్ ఇండియా’ నినాదంతో విదేశాల్ని చుట్టివస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇటీవలి వరకు విదే శీ ఇన్వెస్టర్లు బాగానే విశ్వసించారు. అయితే ‘రెట్రాస్పెక్టివ్’ విధానంలో పాత వ్యవహారాలకు పన్నులు చెల్లించాలంటూ ఇప్పుడు నోటీసులిస్తుండటంతో ఈ విశ్వాసం సడలుతోందనే చెప్పాలి. అసలు రెట్రాస్పెక్టివ్ పన్నుల జోలికి వెళ్లబోమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినా అది చేతల్లో కనపడకపోవటంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదే విషయమై కొందరు విశ్లేషకులు, సంస్థల ప్రతినిధుల్ని సంప్రదించినపుడు... ‘పన్నులకు మేమెవ్వరమూ వ్యతిరేకం కాదు. అయితే ముందే ఆ విషయంపై స్పష్టత ఉండాలి. తీరా రోజులు గడిచిపోయాక అప్పుడెప్పుడో పన్ను కట్టలేదంటూ నోటీసులివ్వటం ఉండకూడదు’ అని అభిప్రాయపడ్డారు. నిజానికి అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడి కారణంగా వొడాఫోన్ (రూ.12,000 కోట్లు), షెల్ (రూ.6,000 కోట్లు) కంపెనీల పన్ను వివాదాలకు ఒక దశలో ఫుల్స్టాప్ పెట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 2 కేసుల్లో బాంబే హైకోర్టు ఆయా కంపెనీలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం కూడా దీనికి కారణం కావచ్చు. మ్యాట్ నోటీసులపై కొంత వెనక్కి తగ్గటంతో పాటు... త్వరలోనే దేశీ పన్నుల విధానంపై హై లెవెల్ ప్యానల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. క్యాడ్బరీ.. ఎక్సైజూ ఎగ్గొడతారా? ఈ ఏడాది ఏప్రిల్ 6న చాక్లెట్ దిగ్గజం క్యాడ్‌బరీకి డీజీసీఈఐ నోటీసులిచ్చింది. ఐదేళ్ళ క్రితం ఎక్సైజ్ డ్యూటీ ఎగ్గొట్టారని, దానికి సంబంధించి రూ. 574 కోట్లు చెల్లించాలని కోరింది. నిజానికి ఎక్సయిజ్ సుంకమంటే ఉత్పాదనపై లేక అమ్మకాలపై విధించేది. దాన్ని ఎగ్గొట్టే అవకాశం ఉండదు. మరి ఇదెలా జరిగిందంటే... హిమాచల్ ప్రదేశ్‌లో 2010 మార్చి 31 కన్నా ముందు ఏర్పాటు చేసిన కంపెనీలకు పదేళ్లపాటు ఎక్సయిజ్ సహా పలు సుంకాల మినహాయింపు ఉంది. దీంతో హిమాచల్‌లోని బడ్డీలో ఏర్పాటు చేసిన ప్లాంటుకు ఎక్సయిజ్ పన్ను మినహాయింపుల్ని క్యాడ్బరీ తీసుకుంది. అయితే ఈ సంస్థ ప్లాంటు 2010 మార్చి 31 తరవాతే ఆరంభమైందని, అందుకే ఈ మూడేళ్లపాటు క్లెయిమ్ చేసిన సుంకాన్ని పెనాల్టీతో సహా చెల్లించాలని నోటీసులిచ్చామని డీజీసీఈఐ పేర్కొంది. 2012లోనే డీజీసీఐ నోటీసులు ఇవ్వగా... చండీగఢ్ పన్ను అధికారుల ఎదుట క్యాడ్బరీ సవాలు చేసింది. తాజాగా ఏప్రిల్ 6న చండీగఢ్ పన్ను అధికారులు కూడా డీజీసీఈ ఉత్తర్వుల్ని సమర్థించింది. అయితే నిబంధనల ప్రకారమే మినహాయింపులు కోరామన్న క్యాడ్బరీ... దీనిపై కోర్టునూ ఆశ్రయించింది. కంపెనీలు చెల్లించే ప్రధాన పన్నులివీ.. కార్పొరేట్ ట్యాక్స్: కంపెనీలు తమ నికర ఆదాయంపై చెల్లిస్తాయి. దేశీ కంపెనీలకిది 30 శాతంగా, విదేశీ కంపెనీలకు 40 శాతంగా ఉంది. క్యాపిటల్ గెయిన్స్: కంపెనీలు తమ ఆస్తుల్ని, షేర్లను విక్రయించినపుడు వచ్చే లాభాలపై చెల్లించాల్సిన పన్ను ఇది. ప్రస్తుతం 10 శాతంగా ఉంది. షేర్లపై అయితే ఏడాదిలోగా విక్రయిస్తే... స్థిరాస్తులనైతే మూడేళ్లలోగా విక్రయిస్తే అది స్వల్పకాలంలో విక్రయించినట్లు కనక ఈ పన్ను వర్తిస్తుంది. ఆ సమయం దాటితే లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవుతాయి కనక మినహాయింపు వర్తిస్తుంది. సేల్స్ ట్యాక్స్: విక్రయించే వస్తువులపై ఈ పన్ను చెల్లించాలి. రాష్ట్రంలో జరిగే అమ్మకాలపై రాష్ట్రాలకు వ్యాట్‌ను, ఇరు రాష్ట్రాల మధ్య జరిగే అమ్మకాలపై కేంద్రానికి సెంట్రల్ సేల్స్ ట్యాక్స్‌ను చెల్లించాలి. సీఎస్టీ 2% కాగా.. వ్యాట్ వస్తువుల్ని బట్టి ఉంటుంది. కస్టమ్స్ డ్యూటీ: దేశంలోకి దిగుమతి చేసుకునే వస్తువులపై వ్యక్తులుగానీ, సంస్థలుగానీ చెల్లించాల్సిన పన్ను ఇది. ఎక్సయిజ్ డ్యూటీ: దేశంలో ఉత్పత్తి చేసే వస్తువులకోసం చెల్లించాల్సిన పన్ను ఇది. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్: కంపెనీలు తమ షేర్ హోల్డర్లకు చెల్లించే డివిడెండ్ మొత్తంపై... 15 శాతం ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. కెయిర్న్... తొమ్మిదేళ్ల తరవాత? ఈ ఏడాది మార్చి 10న... చమురు బావుల అన్వేషణ రంగంలో ఉన్న కెయిర్న్ ఇండియాకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులిచ్చింది. 20,495 కోట్లు పన్ను రూపంలో చెల్లించాలనేది ఆ నోటీసుల సారాంశం. ఈ కెయిర్న్ ఇండియా తొలుత బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీకి అనుబంధంగా ఉండేది. తదనంతరం మెజారిటీ వాటాను లండన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న వేదాంతా రిసోర్సెస్ కొనుగోలు చేయటంతో కంపెనీ చేతులు మారింది. ఇప్పటికీ దీంట్లో కెయిర్న్ ఎనర్జీకి మైనారిటీ వాటా ఉంది. అయితే 2006-07లో కెయిర్న్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు రావటంతో... దీంట్లో తనకున్న వాటాను కెయిర్న్ యూకే హోల్డిం గ్స్ సంస్థ కెయిర్న్ ఇండియా హోల్డింగ్స్‌కు బదలాయించింది. ఇలా బదలాయిం చినపుడు వచ్చిన లాభం (క్యాపిటల్ గెయిన్స్)పై రూ.10,248 కోట్ల పన్ను చెల్లించాలని, దానిపై వడ్డీ రూ.10,247 కోట్లు కలిపితే మొత్తం 20,495 కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వేదాంత గ్రూపు బ్రిటన్‌లో ఆర్బిట్రేటర్‌ను ఆశ్రయించటంతో ఇండియాలోనూ ఐటీ విభాగం ఎదుట కేసు దాఖలు చేసింది. ఈ పన్నును తప్పుడు పద్ధతుల్లో లెక్కించారని పేర్కొంటూ... చివరికి 20వేల కోట్లలో రూ.5000 కోట్లయితే కరెక్టేనని, దీన్లో 4,200 కోట్లకు ఇప్పటికే సెక్యూరిటీ ఇచ్చాం కనక మిగిలిన మొత్తం గురించే అడగాలని చెబుతోంది చట్టాల్లోని అస్పష్టత వల్లే... ఎంత కట్టాలన్నదాని కంటే దేశీయ చట్టాల్లో ఉన్న అస్పష్టతే ప్రధాన సమస్య. ఇంత పన్ను చెల్లించాలని స్పష్టంగా ఉంటే దానికి ఇష్టమైన వారే ఇన్వెస్ట్ చేస్తారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో పన్నులు తక్కువగానే ఉన్నప్పటికీ ఎంత చెల్లించాలన్న దానిపై చట్టాల్లో స్పష్టత లేకపోవడం విదేశీ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుత స్టాక్ మార్కెట్ పతనానికి మ్యాట్ ఒక్కటే కారణం అనుకోవడం లేదు. ఏడాదిన్నర కాలంలో నిఫ్టీ 100 శాతానికిపైగా పెరగడంతో లాభాల స్వీకరణ, అమెరికా వడ్డీరేట్లు పెంచుతుందన్న వార్తలు తదితర అంశాలు మార్కెట్‌ను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. - జగన్నాథం తూనుగుంట్ల, ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్, కార్వీ స్టాక్ బ్రోకింగ్ మ్యాట్... ఇదీ పాత బకాయిల కథే ఎఫ్ఐఐ. ఒకరకంగా విదేశాలకు చెందిన మ్యూచ్‌వల్ ఫండ్లన్న మాట. భారత్‌తో ద్వంద్వపన్ను నివారణ ఒప్పందం (డీటీఏటీ) లేని దేశాలకు చెంది... ఇక్కడ కార్యాలయాలు పెట్టి కొనసాగుతున్న ఎఫ్ఐఐలకు గతనెలలో ఆదాయపు పన్ను శాఖ నోటీసులిచ్చింది. 100కు పైగా ఎఫ్ఐఐలు కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) రూపేణా రూ.40,000 కోట్లు చెల్లించాలనేది ఆ నోటీసుల సారాంశం. నిజానికి 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి మ్యాట్ ఉండదని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన కొద్దిరోజులకే... 2014 మార్చి 31 వరకూ ఈ బకాయిలు చెల్లించాలని నోటీసులివ్వటం గమనార్హం. విదేశీ కంపెనీల్లో 1. భారత్‌తో ద్వంద్వపన్ను రహిత ఒప్పందం (డీటీఏటీ) ఉన్న దేశాలకు చెందిన కంపెనీలు... 2. డీటీఏటీ లేని దేశాలకు చెంది... భారత్‌లో ఆఫీసులు పెట్టుకున్న కంపెనీలు... 3. ఒప్పందం లేని దే శాలకు చెంది... భారత్‌లో ఆఫీసులు లేకుండానే సాగుతున్న కంపెనీలు. వీటిలో రెండో కేటగిరీకి ఈ నోటీసులిచ్చారు. ఈ కంపెనీలు స్టాక్ మార్కెట్లలో కార్యకలాపాలు సాగిస్తాయి కనక వాటికి వచ్చిన పుస్తక లాభాలపై (బుక్ ప్రాఫిట్స్) 18.5 శాతం మ్యాట్ చెల్లించాలి. సెస్సు కూడా కలిపితే 19.44 శాతమవుతుంది. -
‘కెయిర్న్’కు భారీ నష్టం
రూ.4 తుది డివిడెండ్ న్యూఢిల్లీ: కెయిర్న్ ఇండియాకు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.241 కోట్ల నికర నష్టం వచ్చింది. చమురు ధరలు తక్కువ స్థాయిలో ఉండడం, విదేశీ మారక ద్రవ్య నష్టాలు, శ్రీలంక కార్యకలాపాల్లో భారీ నష్టం వంటి అంశాల కారణంగా ఇంత భారీ స్థాయిలో నష్టం వచ్చిందని కంపెనీ పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.3,035 కోట్ల నికర లాభం ఆర్జించామని వివరించింది. ఇక ఆదాయం 47 శాతం క్షీణించి రూ.2,677 కోట్లకు తగ్గిందని తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.4 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. 2014-15 పూర్తి ఆర్ధిక సంవత్సరానికి నికర లాభం 64 శాతం తగ్గి రూ.4,480 కోట్లకు, టర్నోవర్ 22 శాతం క్షీణించి రూ.14,646 కోట్లకు పడిపోయింది. గురువారం కంపెనీ షేర్ 2 శాతం క్షీణించి రూ.213.6 వద్ద ముగిసింది. -
కెయిర్న్ ఇండియూకు భద్రతా అవార్డు
ఉప్పలగుప్తం : కెయిర్న్ ఇండియాకు భారత ప్రభుత్వం నుంచి భద్రతా అవార్డు లభించిందని జనరల్ మేనేజర్ జాకబ్ మేథ్యూ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ద్వారా గనుల విభాగంలో 2011-12 ఏడాదికి లభించిన జాతీయ భద్రతా అవార్డును న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రదానం చేశారని వెల్లడించారు. వ్యాపార దృక్పథమే కాక కార్మిక సంక్షేమం కోసం కెయిర్న్ చేస్తున్న కృషిని, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను రాష్ట్రపతి ప్రశంసించారని తెలిపారు. కేజీ బేసిన్ రవ్వ క్షేత్రంలో కెయిర్న్ ఇండియా చమురు సహజవాయు నిక్షేపాలు వెలికితీస్తోంది. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ ప్లాంట్లలో అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటిస్తోందని జాకబ్ పేర్కొన్నారు. -
కెయిర్న్ ఇండియా 20,495 కోట్లు కట్టాల్సిందే
ఐటీ శాఖ తాజా నోటీసులు న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ తాజాగా ఇంధన రంగ సంస్థ కెయిర్న్ ఇండియాకు దాదాపు రూ. 20,495 కోట్ల పన్ను నోటీసులు జారీ చేసింది. ఎనిమిదేళ్ల క్రితం షేర్ల బదలాయింపు లావాదేవీలపై కంపెనీ గత ప్రమోటరు కెయిర్న్ ఎనర్జీ అప్పట్లో పన్నులు చెల్లించని కారణంగా అసలు, వడ్డీ కలిపి ఇప్పుడు కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ ఆదేశించింది. డిమాండ్ నోటీస్‌లో రూ. 10,248 కోట్లు పన్నులు కాగా, మిగతా రూ. 10,247 కోట్లు వడ్డీ రూపంలో ఉంది. 2006లో భార త్‌లోని అసెట్స్‌ను కెయిర్న్ ఇండియాకు బదలాయించడం ద్వారా వచ్చిన రూ. 24,500 కోట్ల మేర క్యాపిటల్ గెయిన్స్‌పై పన్నులు కట్టలేదంటూ ఇటీవలే కెయిర్న్ ఎనర్జీకి రూ. 10,247 కోట్ల ట్యాక్స్ నోటీసులు ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, పన్ను నోటీసులను తాము వ్యతిరేకిస్తున్నామని, తమ ప్రయోజనాలు పరిరక్షించుకునేందుకు అన్ని మార్గాలు పరిశీలిస్తామని కెయిర్న్ ఇండియా పేర్కొంది. రెట్రాస్పెక్టివ్ ట్యాక్సులు (గత కాలపు డీల్స్‌ను తిరగదోడి పన్నులు విధించడం) బాధిత వొడాఫోన్ గ్రూప్, రాయల్ డచ్ షెల్ తదితర సంస్థల సరసన కొత్తగా కెయిర్న్ ఇండియా కూడా నిల్చినట్లయింది. ట్యాక్స్ నోటీసుల వార్తలతో శుక్రవారం బీఎస్ఈలో కెయిర్న్ ఇండియా షేరు 3 శాతం క్షీణించి రూ. 226 వద్ద ముగిసింది. -
కేజీ బేసిన్లో కెయిర్న్ రూ.13 వేల కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్: చమురు, సహజవాయువు ఉత్పత్తిలో ఉన్న కెయిర్న్ ఇండియా కృష్ణ-గోదావరి బేసిన్లో ఆయిల్, గ్యాస్ బ్లాక్ అభివృద్ధికి సుమారు రూ.13,000 కోట్లు వెచ్చించనుంది. కేజీ-ఓఎస్ఎన్-2009/3 బ్లాక్‌లో 64 బావుల్లో తవ్వకాలు చేపట్టేందుకై ప్రాజెక్టు ప్రణాళిక సిద్ధం చేసేందుకు కంపెనీ కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది. ఈ బ్లాక్ ప్రకాశం, గుంటూరు తీరం వెలుపల బంగాళాఖాతంలో నిక్షిప్తమై ఉంది. తీరం వెలుపల క్షేత్రం ఉన్నందున ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదని పర్యావరణ శాఖకు చెందిన ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. కేజీ-ఓఎస్ఎన్-2009/3 బ్లాక్‌ను కెయిర్న్ ఇండియా 2010లో దక్కించుకుంది. -
కెయిర్న్ ఇండియాకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: అదనపు చమురు వెలికితీసేందుకు కెయిర్న్ ఇండియాకు పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది. రాజస్థాన్ బ్లాక్ లో అదనంగా 50 శాతం చమురు వెలికితీసేందుకు అనుమతినిచ్చింది. కెయిర్న్ ఇండియా రోజుకు 3 లక్షల బారెల్స్ ముడి చమురు బయటకు తీయనుంది. గ్యాస్ వెలికి తీసేందుకు కూడా కెయిర్న్ ఇండియాకు పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది. దీంతో రాజస్థాన్ బ్లాక్ లో రోజుకు 165 మిలియన్ క్యూబిక్ ఘనపుటడుగుల గ్యాస్ ఉత్పత్తి చేయనుంది. వివిధ రకాల ప్రాజెక్టులకు వేగంగా అనుమతలు మంజూరు చేయడం ద్వారా దేశాభివృద్ధికి బాటలు వేయాలన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగానే కెయిర్న్ ఇండియాకు పచ్చ జెండా ఊపింది. -
వేదాంతాకు కెయిర్న్ ఇండియా భారీ రుణం
న్యూఢిల్లీ: మాతృ సంస్థ వేదాంతా గ్రూప్‌నకు 1.25 బిలియన్ డాలర్లను(రూ. 7,500 కోట్లు) కెయిర్న్ ఇండియా రుణంగా మంజూరు చేసింది. దీనిలో 80 కోట్ల డాలర్లను ఇప్పటికే విడుదల చేసింది. గతంలో సైతం తమదగ్గరున్న నగదు నిల్వలను మాతృ సంస్థ వాటా పెంచుకునేందుకు వినియోగించిన నేపథ్యంలో తాజా చర్య విమర్శలకు తెరలేపింది. దీంతో స్టాక్ మార్కెట్లో కెయిర్న్ ఇండియా షేరు గత ఐదేళ్లలోలేని విధంగా 7% పతనమైంది. బీఎస్ఈలో రూ. 323 వద్ద ముగిసింది. కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వల వినియోగంపై పలువురు విశ్లేషకులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కంపెనీ ప్రతినిధి వివరణ ఇస్తూ 3%పైగా ఫ్లోటింగ్ రేటుకి రుణాన్ని రెండేళ్లకు పొడిగించిన ట్లు చెప్పారు. ఇది ఫిక్స్డ్ డిపాజిట్కంటే అధికమని పేర్కొన్నారు. అయితే రుణ విషయంపై బోర్డు ఎప్పుడు నిర్ణయం తీసుకుందన్న అంశంతోపాటు, ఇందుకు వాటాదారుల అనుమతిని తీసుకోవలసి ఉన్నదా అన్న సందేహంపై స్పందించేందుకు కంపెనీ నిరాకరించింది. కెయిర్న్ ఇండియాలో వేదాంతాకు 59.90% వాటా ఉంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్లో కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్‌గా 64% క్షీణించడం కూడా షేరు పతనానికి కారణమని నిపుణులు చెప్పారు. అనుమతి తీసుకోవాలి: ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వచ్చిన కంపెనీల కొత్త చట్టం ప్రకారం ఇలాంటి లావాదేవీలకు వాటాదారుల అనుమతి తీసుకోవలసి ఉంది. కెయిర్న్ ఇండియా బుధవారం వాటాదారుల సమావేశాన్ని నిర్వహించినప్పటికీ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. మిగులు నిధుల వినియోగంలో కంపెనీలు చేపట్టే ఇలాంటి లావాదేవీలు సందేహాలకు తావిస్తాయని గోల్డ్‌మన్ శాక్స్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ వ్యాఖ్యానించింది. కాగా, జూన్ చివరికి తమవద్ద దాదాపు 3 బిలియన్ డాలర్ల(సుమారు రూ.18 వేల కోట్లు)నగదు నిల్వలున్నట్లు కెయిర్న్ ఇండియా బుధవారం తెలిపింది. -
కెయిర్న్ ఇండియా లాభం 18% వృద్ధి
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి-మార్చి(క్యూ4) కాలానికి కెయిర్న్ ఇండియా రూ. 3,035 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 2,564 కోట్లతో పోలిస్తే ఇది 18% వృద్ధి. ఇదే కాలానికి అమ్మకాలు కూడా 16% పెరిగి రూ. 5,049 కోట్లకు చేరాయి. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 6.50 తుది డివిడెండ్‌ను చెల్లించనుంది. ఈ కాలంలో రాజస్తాన్‌తోపాటు మరో రెండు ఇతర ఆయిల్ క్షేత్రాల నుంచి సగటున రోజుకి 2,24,429 బ్యారళ్లను ఉత్పత్తి చేసింది. ఇది 11% అధికం. విడిగా రాజస్తాన్ క్షేత్రాల నుంచి ఉత్పత్తి 12% పుంజుకుని రోజుకి 1,89,304 బ్యారళ్లకు చేరింది. అదనపు నిల్వలు జత నాలుగేళ్ల విరామం తరువాత గతేడాది బార్మర్ బేసిన్లో వెలికితీత కార్యక్రమాలను మొదలుపెట్టడంతో ఈ ఏడాది 1 బిలియన్ బ్యారళ్ల చమురు నిల్వలను సమకూర్చుకోగలిగినట్లు కంపెనీ సీఈవో ఎలాంగో.పి చెప్పారు. ఇవి ప్రస్తుత 4.2 బ్యారళ్లకు అదనంకాగా, కంపెనీ వద్ద నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 13,707 కోట్లకు చేరింది. నిధులను షేర్ల బైబ్యాక్, డివిడెండ్ చెల్లింపు తదితరాలకు వినియోగించే అవకాశముంది. మార్చి నెలలో సగటున రోజుకి 2,00,000 బ్యారళ్ల ఉత్పత్తిని సాధించడమేకాకుండా, క్యూ4లో 20 కోట్ల బ్యారళ్ల ఆయిల్‌ను ఉత్పత్తి చేయగలిగినట్లు వివరించారు. ఇక పూర్తి ఏడాదికి(2013-14) కంపెనీ నికర లాభం 4%పైగా పెరిగి రూ. 12,432 కోట్లకు చేరగా, అమ్మకాలు రూ. 17,524 కోట్ల నుంచి రూ. 18,762 కోట్లకు ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కెయిర్న్ షేరు 3.3% తగ్గి రూ. 352 వద్ద ముగిసింది. -
కెయిర్న్ ఇండియా
బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.324 టార్గెట్ ధర: రూ. 400 ఎందుకంటే: రోజువారీ సగటు ఉత్పత్తి పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఇబిటా 10 శాతం వృద్ధితో రూ.3,590 కోట్లకు, నికర లాభం 14 శాతం వృద్ధితో రూ.2,880 కోట్లకు పెరిగాయి. అమ్మకాల పరిమాణం 10 శాతం పెరగడం, రూపాయి 15 శాతం పతనం కావడంతో అమ్మకాల వృద్ధి పెరిగింది. దీంతో ఆదాయం 17 శాతం వృద్ధి సాధించింది. బామర్ హిల్ ప్లాంట్‌లో ఉత్పత్తి త్వరలో ప్రారంభం కానున్నది. రాజస్థాన్, రవ్వ, కేజీ బేసిన్లలో అదనపు నిక్షేపాలు అందుబాటులోకి వస్తాయని కంపెనీ అంచనా వేస్తోంది. రూపాయి బలహీనంగా ఉండడంతో ఆదాయం మరింతగా పెరగవచ్చని భావిస్తున్నాం. గతేడాది డిసెంబర్ చివరి నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.22,000 కోట్లుగా ఉన్నాయి. ఉత్పత్తి పెంపు, నిక్షేపాల అన్వేషణ విజయవంతం కావడం.. ఈ రెండు అంశాలు షేర్ పనితీరుపై ప్రభావం చూపుతాయి. సమ్ ఆఫ్ ద పార్ట్స్ ప్రాతిపదికన టార్గెట్ ధరను నిర్ణయించాం. -
రాష్ట్రంలో కెయిర్న్ రూ. 4,500 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్: కృష్ణా జిల్లా నాగాయలంక ప్రాంతంలో కెయిర్న్ ఇండియా కనుగొన్న బావులు వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి డెరైక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని, అనుమతులు లభించగానే వచ్చే ఐదేళ్లలో రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కెయిర్న్, ఓఎన్జీసీ సంయుక్తంగా కనుగొన్న కేజీ బేసిన్‌లోని ఈ బ్లాక్‌లో అధికస్థాయిలో చమురు, సహజవాయువు నిల్వలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి అనుమతుల కోసం ఇప్పటికే డీజీహెచ్‌కు దరఖాస్తు దాఖలు చేశామని, ఇవి రాగానే వెలికితీత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. -
కెయిర్న్ ఇండియా షేర్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ ఆయిల్ దిగ్గజం కెయిర్న్ ఇండియా రూ. 5,725 కోట్లతో సొంత షేర్లను కొనుగోలు(బైబ్యాక్) చేయనున్నట్లు ప్రకటించింది. తద్వారా ఎలాంటి నిధులూ ఖర్చుపెట్టకుండానే కెయిర్న్ ఇండియాలో ప్రమోటర్ కంపెనీ వేదాంతా గ్రూప్ వాటా పెరగనుంది. కెయిర్న్ ఇండియా వద్ద 300 కోట్ల డాలర్ల నగదు నిల్వలున్నాయి. దీంతో ఓపెన్ మార్కెట్ నుంచి 8.9% వాటాకు సమానమైన 17.09 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రణాళిక వేసింది. షేరుకి రూ. 335 గరిష్ట ధర షేరుకి గరిష్టంగా రూ. 335 ధరను చెల్లించనున్న బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గత రెండు వారాల సగటు ధరతో పోలిస్తే బైబ్యాక్‌కు నిర్ణయించిన ధర 4% అధికమని కంపెనీ తెలిపింది. వాటాదారుల అనుమతి పొందాక జనవరిలో బైబ్యాక్‌ను చేపట్టే అవకాశముంది. కాగా, బైబ్యాక్‌లో భాగంగా 10.27% వాటాను కలిగిఉన్న యూకే సంస్థ కెయిర్న్ ఎనర్జీ కొంతమేర వాటాను విక్రయించే అవకాశముంది. ఇది జరిగితే వే దాంతా గ్రూప్ వాటా ప్రస్తుతం 58.76% నుంచి 64.53%కు పెరుగుతుంది. ఇప్పటికే వేదాంతా గ్రూప్‌నకు మెజారిటీ వాటాను విక్రయించిన కెయిర్న్ ఎనర్జీ ప్రస్తుతం కెయిర్న్ ఇండియాలో 10.27% వాటాను కలిగి ఉంది. ఫలితంగా బైబ్యాక్‌లో మిగిలిన వాటాను విక్రయించడం ద్వారా కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగే అవకాశముంది. కెయిర్న్ ఇండియాలో కెయిర్న్ ఎనర్జీ వాటాను వేదాంతా షేరుకి రూ. 355 ధరలో కొనుగోలు చేసింది. కాగా, మంగళవారం బీఎస్ఈలో కెయిర్న్ ఇండియా షేరు 2.1% క్షీణించి రూ. 324 వద్ద ముగిసింది. బైబ్యాక్ వల్ల ఏమిటి లాభం? సాధారణంగా కంపెనీలు తమ వద్ద నగదు నిల్వలను విస్తరణ ప్రణాళికలు, లేదా ఇతర కంపెనీల కొనుగోళ్లు వంటి కార్యకలాపాలకు వినియోగించే ఆలోచన లేనప్పుడు వాటాదారులకు లబ్ది చేకూర్చేందుకు వీలుగా బైబ్యాక్‌ను చేపడతాయి. తద్వారా మార్కెట్ ధర కంటే అధిక ధరలో వాటాదారుల వద్ద నుంచి సొంత షేర్లను కొనడం ద్వారా నగదును వాటాదారులకు బదిలీ చేస్తాయి. అంతేకాకుండా బైబ్యాక్ వల్ల కంపెనీ ఈక్విటీ తగ్గి వార్షిక ఆర్జన(ఈపీఎస్) మెరుగుపడుతుంది. తద్వారా కంపెనీలో మిగిలిన వాటాదారులకు కూడా లబ్ది చేకూరుతుంది. అయితే పూర్తిస్థాయిలో షేర్ల బైబ్యాక్‌ను చేపట్టాలనే నిబంధన లేకపోవడం గమనార్హం.