కెయిర్న్ ఇండియా లాభం 28 శాతం క్షీణత
న్యూఢిల్లీ : చమురు ధరలు తగ్గడం కెయిర్న్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటిత్రైమాసిక ఆర్థిక ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపింది. వ్యయ నియంత్రణ పద్ధతులు ద్వారా కంపెనీ పొందిన లాభాలను తగ్గిన చమురు ధరలు హరించాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.501 కోట్లుగా ఉన్న కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 28 శాతం క్షీణించి రూ.360 కోట్లకు పతనమైంది. ఆదాయం రూ.2,627 కోట్ల నుంచి రూ.1,885 కోట్లకు పడిపోయింది. అయితే సీక్వెన్షియల్ ప్రాతిపదికన నికర లాభం 88 శాతం పెరిగిందని కంపెనీ సీఎఫ్‌ఓ, తాత్కాలిక సీఈఓ సుధీర్ మాధుర్ చెప్పారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కెయిర్న్ ఇండియా షేర్ స్వల్పంగా పెరిగి రూ. 177 వద్ద ముగిసింది.