కెయిర్న్ ఇండియా లాభం 15 రెట్లు
ఆదాయం 5 శాతం అప్
న్యూఢిల్లీ: కెయిర్న్ ఇండియా నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్– డిసెంబర్ క్వార్టర్‌లో 15 రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో రూ.41 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో 1,376 శాతం వృద్ధితో రూ.604 కోట్లకు పెరిగిందని కెయిర్న్ ఇండియా తెలిపింది. ఒక్కో షేర్ పరంగా చూస్తే ఈ వృద్ధి 22 పైసల నుంచి రూ.3.21కు పెరిగిందని కెయిర్న్ ఇండియా తాత్కాలిక సీఈఓ సుధీర్ మాధుర్ పేర్కొన్నారు.
ముడి చమురు ధరలు అధికంగా ఉండడమే నికర లాభంలో ఈ జోరుకు కారణమని వివరించారు. ఉత్పత్తి చేసిన ఒక్కో బ్యారెల్ ముడి చమురుకు రియలైజేషన్ 35 డాలర్ల నుంచి 32 శాతం వృద్ధి చెంది 46.2 డాలర్లకు చేరిందని తెలిపారు. ఆదాయం 5 శాతం పెరిగి రూ.2,149 కోట్లకు చేరిందని వివరించారు. మాతృ కంపెనీ వేదాంతతో విలీనానికి అన్ని వర్గాల వాటాదారుల ఆమోదం గత ఏడాది సెప్టెంబర్‌లోనే పొందామని, ఈ విలీనం ఈ ఏడాది మార్చికల్లా పూర్తవగలదని మాథుర్ పేర్కొన్నారు.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కెయిర్న్ ఇండియా షేర్ 0.3% క్షీణించి రూ.275 వద్ద ముగిసింది.