కెయిర్న్ ఇండియాలో వాటా విక్రయానికి సిద్ధం: కెయిర్న్ ఎనర్జీ
న్యూఢిల్లీ: చమురు ఉత్పాదక కంపెనీ కెయిర్న్ ఇండియాలో వున్న 9.82 శాతం వాటాను విక్రయించడానికి బ్రిటన్ ఆయిల్ కంపెనీ కెయిర్న్ ఎనర్జీ సిద్ధమయ్యింది. ఈ విక్రయం కోసం షేర్‌హోల్డర్ల అనుమతి కోరడంతో పాటు ఇతర అంశాలు చర్చించేందుకు మే 12వ తేదీన కెయిర్న్ ఎనర్జీ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) ఏర్పాటుచేసింది. ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ. 29,000 కోట్ల రెట్రోస్పెక్టివ్ టాక్స్ డిమాండ్ నోటీసును అందుకున్న నేపథ్యంలో ఈ వాటా విక్రయ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. టాక్స్ డిమాండ్ నోటీసుతో పాటు మరో రూ. 10,200 కోట్ల అపరాధ రుసుం చెల్లించాలన్న నోటీసు కూడా ఐటీ శాఖ నుంచి వచ్చినట్లు కెయిర్న్ ఎనర్జీ క్రితంరోజే ప్రకటించిన సంగతి తెలిసిందే.
కెయిర్న్ ఇండియాలో మెజారిటీ వాటాను మైనింగ్ దిగ్గజం వేదాంతకు 2011లో కెయిర్న్ 8.67 బిలియన్ డాలర్లకు విక్రయించింది. ఇంకా ఇండియా కంపెనీలో కెయిర్న్ ఎనర్జీకి 9.82 శాతం వాటా వుంది. రెట్రోస్పెక్టివ్ టాక్స్ చెల్లింపునకు సంబంధించిన వివాదం కారణంగా ఈ వాటా విక్రయాన్ని భారత్ ఆదాయపు పన్ను శాఖ నిషేధించిందంటూ ఏజీఎం నోటీసులో షేర్‌హోల్డర్లకు కెయిర్న్ తెలిపింది. వాటా విక్రయంపై ఐటీ శాఖ నుంచి భవిష్యత్తులో కంపెనీకి స్వేచ్ఛ లభిస్తే, షేర్‌హోల్డర్లకు విలువను అందిస్తామన్న విశ్వాసాన్ని కెయిర్న్ ఈ నోటీసులో వ్యక్తంచేసింది.