
మర్చంట్ బ్యాంకర్లకు దీపమ్ ఆహ్వానం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, లిస్టెడ్ ఫైనాన్షియల్ సంస్థలలో వాటా విక్రయంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా పెట్టుబడులు, పబ్లిక్ ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్) మర్చంట్ బ్యాంకర్లు, న్యాయసలహా సంస్థలకు ఆహ్వానం పలికింది. రెండు రకాల ప్రతిపాదనల(రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్–ఆర్‌ఎఫ్‌పీ)కు తెరతీసింది. దీనిలో భాగంగా మర్చంట్ బ్యాంకర్లు, న్యాయసలహా సంస్థలను మూడేళ్ల కాలానికి దీపమ్ ఎంపిక చేయనుంది.
గడువును మరో ఏడాది పొడిగించేందుకు వీలుంటుంది. ఎంపికైన సంస్థలు వాటాల విక్రయం విషయంలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించవలసి ఉంటుంది. ఎంపిక చేసిన బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలలో వాటాల విక్రయంలో ప్రభుత్వానికి తగిన విధంగా సహకారం అందించవలసి ఉంటుంది. ఇందుకుగాను మర్చంట్ బ్యాంకర్లు బిడ్స్ దాఖలు చేసేందుకు మార్చి 27వరకూ దీపమ్ గడువు ప్రకటించింది. అయితే రెండు కేటగిరీలలో మర్చంట్ బ్యాంకర్లు దరఖాస్తు చేయవలసి ఉంటుంది.
ఏప్లస్ విభాగంకింద రూ. 2,500 కోట్లు లేదా అంతకుమించిన పరిమాణంగల లావాదేవీల నిర్వహణ ఉంటుంది. ఏ కేటగిరీలో రూ. 2,500 కోట్ల విలువలోపు వాటాల విక్రయంలో ప్రభుత్వానికి మద్దతివ్వవలసి ఉంటుందని దీపమ్ తెలియజేసింది. ఆర్థిక శాఖ నిర్వహణలోని దీపమ్ ప్రభుత్వ రంగ సంస్థలలో వాటా విక్రయ వ్యవహారాలను పర్యవేక్షించే సంగతి తెలిసిందే. ప్రస్తుతం పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటా నిబంధనను పలు ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అమలు చేయవలసి ఉంది. ఇందుకు ప్రభుత్వం 2026 ఆగస్ట్ 1వరకూ గడువునిచ్చింది. తద్వారా ప్రభుత్వ వాటాను తగ్గించడంతోపాటు.. పబ్లిక్ వాటా పెంచవలసి ఉంది.
ఐదు బ్యాంకులు
ప్రధానంగా ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటాను అమలు చేయవలసి ఉంది. ప్రస్తుతం పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా 98.3 శాతంకాగా.. ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌లో 96.4 శాతం, యుకో బ్యాంక్‌లో 95.4 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 93.1 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 86.5 శాతం చొప్పున వాటా కలిగి ఉంది. ఇదే విధంగా ఐఆర్‌ఎఫ్‌సీలో 86.36 శాతం, న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌లో 85.44 శాతం, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో 82.4 శాతం చొప్పున ప్రభుత్వానికి వాటా ఉంది. వెరసి ఈ సంస్థలలో పబ్లిక్‌కు కనీస వాటా నిబంధనను అమలు చేయవలసి ఉంది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం విదితమే.