చమురు మంత్రితో కెయిర్న్ సీఈవో భేటీ
న్యూఢిల్లీ: కెయిర్న్ ఇండియా, వేదాంత సంస్థల విలీనం అంశం క్రమంగా ముందుకు కదులుతోంది. ఇందుకు సంబంధించి కెయిర్న్ సీఈవో అషర్, సీఎఫ్‌వో సుధీర్ మాథుర్.. చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. ప్రతిపాదిత రివర్స్ మెర్జర్ గురించి వివరించారు. వేదాం త రుణభారాన్ని తగ్గించే ఉద్దేశంతో కెయిర్న్ ఇండియాలో దాన్ని విలీనం చేసే ప్రతిపాదనను రివర్స్ మెర్జర్‌గా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా వేదాంతలో కెయిర్న్ ఇండియాను విలీనం చేయాలంటే పలు అనుమతులు పొందాల్సి ఉంటుంది.
అదే వేదాంతను కెయిర్న్‌లో విలీనం చేస్తే(రివర్స్ మెర్జర్) పలు అనుమతుల సమస్య తగ్గనుంది. ఇదే అంశంపై చర్చిం చేందుకు ఇరు సంస్థల బోర్డులు ఈ ఆదివారం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వేదాంతకు ఉన్న రూ.37,636 కోట్ల మేర రుణభారాన్ని తగ్గించడమన్నది ఈ విలీనం ప్రధానోద్దేశం. ఇందుకోసం కెయిర్న్ వద్దనున్న రూ. 16,870 కోట్ల నగదు నిల్వలతో పాటు కంపెనీకి ఏటా వచ్చే రూ. 1,320 కోట్ల లాభాలను వినియోగించుకోవచ్చన్నది ప్రతిపాదన.