Oil Minister Dharmendra Pradhan
-
ఆల్‌టైం గరిష్టానికి పెట్రో ధరలు
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఈ వారంలో వరుసగా నాలుగోసారి మునుపెన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరాయి. శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌పై 25 పైసల చొప్పున ఎగబాకాయి. చమురు సంస్థల నోటిఫికేషన్ ప్రకారం..లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.85.70 కాగా, ముంబైలో 92.28కి చేరింది. అదేవిధంగా, లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ.75.88, ముంబైలో రూ.82.66గా ఉంది. ధరలు ఇలా పైకి ఎగబాకటం వరుసగా నాలుగో వారంలో రెండో రోజు. ఈ వారంలో పెట్రో ధరలు లీటర్‌కు రూ.1 చొప్పున పెరిగాయి. విదేశీ మారక ద్రవ్యం రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధర ఆధారంగా ప్రభుత్వ రంగ ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ జనవరి 6 నుంచి పెట్రో ధరలను ఏరోజుకారోజు సవరిస్తున్నాయి. అప్పటి నుంచి లీటర్‌కు పెట్రోల్ ధర రూ.1.99, డీజిల్ ధర రూ.2.01 మేర పెరిగాయి. సేల్స్ ట్యాక్స్, వ్యాట్ల కారణంగా ఇంధన ధరలు రాష్ట్రానికో విధంగా ఉంటున్నాయి. సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిలో విధించడమే ధరల్లో పెరుగుదలకు కారణమని ఆరోపిస్తున్న చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..పన్నుల్లో కోత విషయమై ఎలాంటి భరోసా ఇవ్వకపోవడం గమనార్హం. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమయ్యాక డిమాండ్ తిరిగి పుంజుకోవడంతో భారత్‌తోపాటు అంతర్జాతీయంగా చమురు ధరలు ఎగబాకుతున్నాయి. -
గ్యాస్ ఇన్ఫ్రాపై 60 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీయంగా గ్యాస్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు 2024 నాటికి 60 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. 2030 నాటికి మొత్తం ఇంధనాల వినియోగంలో గ్యాస్ వాటాను 15 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇది 6 శాతంగా ఉంది. ‘పైప్లైన్లు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) టెర్మినల్స్, సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) నెట్‌వర్క్‌లు మొదలైన గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై 2024 నాటికి 60 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయాలని నిర్దేశించుకున్నాం. గ్యాస్ ఆధారిత ఎకానమీగా భారత్‌ను తీర్చిదిద్దే దిశగా లక్ష్యాలు పెట్టుకున్నాం‘ అని అసోచాం ఫౌండేషన్ డే వీక్ 2020 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. సీజీడీ ప్రాజెక్టులను 400 జిల్లాల్లోని 232 ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు ఆయన వివరించారు. దీంతో భౌగోళికంగా 53 శాతం ప్రాంతాల్లో, దేశ జనాభాలో 70 శాతం మందికి సీజీడీ అందుబాటులోకి రాగలదని ప్రధాన్ పేర్కొన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా 1,000 ఎల్ఎన్జీ ఫ్యూయల్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గత నెలలలోనే తొలిసారిగా 50 ఎల్ఎన్జీ ఇంధన స్టేషన్లకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో చండికోల్, పాదూర్‌లలో మరో 6.5 మిలియన్ టన్నుల వాణిజ్య–వ్యూహాత్మక పెట్రోలియం స్టోరేజ్ కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. -
పెట్రోల్ ధర రూ.6 పెరిగినా...
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు రెండు నెలల కాలంలో రూ.6.6 మేర పెరిగినప్పటికీ, రోజువారీ ధరల సమీక్ష విధానాన్నే కొనసాగిస్తామని చమురు శాఖామంత్రి ధర్మేంద ప్రధాన్ అన్నారు. రోజువారీ విధానంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు తగ్గితే వెనువెంటనే ఆ ప్రయోజనాలను వాహనాదారులకు చేరవేయవచ్చని చెప్పారు. నిన్న జరిగిన కేబినెట్ పునర్వ్యస్థీకరణలో పెట్రోల్, నేచుర్ గ్యాస్‌కు సహాయమంత్రిగా ఉన్న ప్రధాన్ కేబినెట్ మంత్రి హోదాను దక్కించుకున్నారు. అంతేకాక అదనంగా స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రీన్యూర్షిప్కు కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. '' ఇది వినియోగదారుల ఆసక్తి మేరకు తీసుకున్న నిర్ణయం. దీనిలో మార్పులు చేయాల్సినవసరం లేదనుకుంటున్నా'' అని తెలిపారు. 15 ఏళ్ల విధానానికి స్వస్తి చెప్పిన ప్రభుత్వ రంగ ఇంధన కంపెనీలు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించడం ప్రారంభించాయి. అంతర్జాతీయ ధరలకనుగుణంగా ఈ మార్పులు చేపడుతున్నాయి. రోజువారీ ధరల విధానం వచ్చినప్పటి నుంచి ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.6.6 మేర పెరిగింది. 2014 ఆగస్టు నుంచి ఇదే అత్యధిక స్థాయి. డీజిల్ ధర కూడా రూ.4.02మేర ఎగిసింది. రోజువారీ ధరలు సమీక్షించడం మంచి పద్ధతి అని, అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు తగ్గితే 15 రోజుల పాటు ఆగకుండా వెనువెంటనే ఆ ప్రయోజనాలను వినియోగదారులకు చేరవేయవచ్చని మంత్రి తెలిపారు. ఇటీవల గ్లోబల్‌గా ధరలు పెరగడంతోనే, ఇక్కడ కూడా ధరలు పెరుగుతున్నాయన్నారు. ఒకేసారి రూ.2.50 లేదా రూ.3 మేర పెట్రోల్ ధరలు పెంచడం కంటే, ఇలా చిన్నచిన్న మొత్తాల్లో ధరలు పెంచడమే మేలని పేర్కొన్నారు. -
చమురు మంత్రితో కెయిర్న్ సీఈవో భేటీ
న్యూఢిల్లీ: కెయిర్న్ ఇండియా, వేదాంత సంస్థల విలీనం అంశం క్రమంగా ముందుకు కదులుతోంది. ఇందుకు సంబంధించి కెయిర్న్ సీఈవో అషర్, సీఎఫ్‌వో సుధీర్ మాథుర్.. చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. ప్రతిపాదిత రివర్స్ మెర్జర్ గురించి వివరించారు. వేదాం త రుణభారాన్ని తగ్గించే ఉద్దేశంతో కెయిర్న్ ఇండియాలో దాన్ని విలీనం చేసే ప్రతిపాదనను రివర్స్ మెర్జర్గా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా వేదాంతలో కెయిర్న్ ఇండియాను విలీనం చేయాలంటే పలు అనుమతులు పొందాల్సి ఉంటుంది. అదే వేదాంతను కెయిర్న్లో విలీనం చేస్తే(రివర్స్ మెర్జర్) పలు అనుమతుల సమస్య తగ్గనుంది. ఇదే అంశంపై చర్చిం చేందుకు ఇరు సంస్థల బోర్డులు ఈ ఆదివారం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వేదాంతకు ఉన్న రూ.37,636 కోట్ల మేర రుణభారాన్ని తగ్గించడమన్నది ఈ విలీనం ప్రధానోద్దేశం. ఇందుకోసం కెయిర్న్ వద్దనున్న రూ. 16,870 కోట్ల నగదు నిల్వలతో పాటు కంపెనీకి ఏటా వచ్చే రూ. 1,320 కోట్ల లాభాలను వినియోగించుకోవచ్చన్నది ప్రతిపాదన. -
సరైన సమయంలో తగిన నిర్ణయం
సహజ వాయువు ధర పెంపుపై చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటాం... సంస్కరణలకూ తగిన ప్రాధాన్యం... న్యూఢిల్లీ: సహజ వాయువు ధర పెంపు విషయంలో పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పెదవి విప్పారు. సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ధర నిర్ణయంలో పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడంతోపాటు, సంస్కరణలను తక్షణం ముందుకు తీసుకెళ్లే అంశానికీ ప్రాధాన్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ రెండింటిమధ్య సమతూకం పాటిస్తామని ప్రధాన్ తెలిపారు. ఎప్పటికల్లా దీనిపై నిర్ణయం ఉండొచ్చనేది చెప్పేందుకు నిరాకరించారు. పేదలకు అనుకూల ఆర్థిక సంస్కరణలు చేపడతామని చెప్పారు. మోడీ నిర్ణయమే కీలకం...: దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న సహజ వాయువు ధరను 4.2 డాలర్ల(యూనిట్‌కు) నుంచి రెట్టింపు స్థాయిలో 8.3 డాలర్లకు పెంచేలా (రంగారాజన్ కమిటీ ఫార్ములా ప్రకా రం) గత యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ పెంపు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, సార్వత్రిక ఎన్నికల కోడ్ కారణంగా అమలు వాయిదా పడింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ధర పెంపుపై నిర్ణయం కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు ఓఎన్జీసీ ఇతర ప్రభుత్వ రంగ చమురు-గ్యాస్ కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. కాగా, జూలై ఒకటి నుంచి కొత్త ధరలు అమలయ్యే అవకాశం ఉందని, దీనికి సంబంధించి త్వరలో నిర్ణయం వెలువడనున్నట్లు పెట్రోలియం శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు గతవారంలో పేర్కొన్న విషయం తెలిసిందే.