సరైన సమయంలో తగిన నిర్ణయం
సహజ వాయువు ధర పెంపుపై చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు
- పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటాం...
- సంస్కరణలకూ తగిన ప్రాధాన్యం...
న్యూఢిల్లీ: సహజ వాయువు ధర పెంపు విషయంలో పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పెదవి విప్పారు. సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ధర నిర్ణయంలో పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడంతోపాటు, సంస్కరణలను తక్షణం ముందుకు తీసుకెళ్లే అంశానికీ ప్రాధాన్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ రెండింటిమధ్య సమతూకం పాటిస్తామని ప్రధాన్ తెలిపారు. ఎప్పటికల్లా దీనిపై నిర్ణయం ఉండొచ్చనేది చెప్పేందుకు నిరాకరించారు. పేదలకు అనుకూల ఆర్థిక సంస్కరణలు చేపడతామని చెప్పారు.
మోడీ నిర్ణయమే కీలకం...: దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న సహజ వాయువు ధరను 4.2 డాలర్ల(యూనిట్‌కు) నుంచి రెట్టింపు స్థాయిలో 8.3 డాలర్లకు పెంచేలా (రంగారాజన్ కమిటీ ఫార్ములా ప్రకా రం) గత యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ పెంపు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, సార్వత్రిక ఎన్నికల కోడ్ కారణంగా అమలు వాయిదా పడింది.
ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ధర పెంపుపై నిర్ణయం కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు ఓఎన్‌జీసీ ఇతర ప్రభుత్వ రంగ చమురు-గ్యాస్ కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. కాగా, జూలై ఒకటి నుంచి కొత్త ధరలు అమలయ్యే అవకాశం ఉందని, దీనికి సంబంధించి త్వరలో నిర్ణయం వెలువడనున్నట్లు పెట్రోలియం శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు గతవారంలో పేర్కొన్న విషయం తెలిసిందే.