gas pricing
-
సహజవాయువు ధర పెంపు 50 శాతమే!
న్యూఢిల్లీ: గ్యాస్ ధరల కొత్త విధానంపై ఏర్పాటైన నలుగురు సభ్యుల కమిటీ రూపొందించిన నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందించినట్లు తెలుస్తోంది. నివేదికలో గ్యాస్ ధరను 50%మేర పెంచేందుకు వీలుగా సూచనలు చేసినట్లు అత్యున్నత అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, గత యూపీఏ ప్రభుత్వం గ్యాస్ ధరను రెట్టింపు చేసేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. గ్యాస్ ధరను ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ)కు 8.4 డాలర్లకు పెంచుతూ ఈ ఏడాది జనవరిలో వెలువడ్డ నోటిఫికేషన్‌ను సవరించేందుకు ప్రభుత్వం గత నెలలో ఒక కమిటీని నియమించింది. దీనిలో ఆయిల్ శాఖలోని అదనపు కార్యదర్శితోపాటు విద్యుత్, ఎరువులు, వ్యయ కార్యకలాపాల కార్యదర్శులుసభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను ఆయిల్ శాఖ సమీక్షించాక క్యాబినెట్‌కు పంపనున్నట్లు ప్రభుత్వాధికారి చెప్పారు. నివేదికలో విషయాలను గోప్యంగా ఉంచినప్పటికీ, గ్యాస్ ధరను రెట్టింపు చేయకుండా 50% వరకూ పెంచేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను ప్రస్తుతం ఒక ఎంబీటీయూకి 4.2 డాలర్లకు విక్రయిస్తున్నారు. అయితే డిమాండ్‌కు సరఫరాకు మధ్య సమతుల్యాన్ని సాధించేలా కార్యదర్శుల కమిటీ గ్యాస్ ధరపై విధానాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందుకు వివిధ రకాల క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌పై వ్యయాలనూ, విద్యుత్, ఎరువుల పరిశ్రమల డిమాండ్‌నూ కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ చివరికల్లా గ్యాస్ ధరను ప్రకటించే అవకాశమున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా, గ్యాస్ ధరను ఒక ఎంబీటీయూకి 2 డాలర్ల చొప్పున పెంచితే యూరియా, విద్యుత్, సీఎన్జీ ధరలకు రెక్కలొస్తాయి. ప్రభుత్వానికి మాత్రం పన్నులు, రాయల్టీ రూపంలో రూ.12,900 కోట్లు అదనంగా లభిస్తాయి. -
రిలయన్స్‌పై 57.9 కోట్ల డాలర్ల అదనపు జరిమానా
లక్ష్యానికి అనుగుణంగా గ్యాస్‌ను ఉత్పత్తి చేయకపోవడమే కారణం పెట్రోలియం శాఖ మంత్రి ప్రధాన్ వెల్లడి న్యూఢిల్లీ: కేజీ-డీ6 క్షేత్రాల్లో లక్ష్యాల కంటే తక్కువగా సహజవాయువును ఉత్పత్తి చేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)పై కేంద్రం 57.9 కోట్ల డాలర్ల అదనపు జరిమానాను విధించింది. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని సోమవారం లోక్‌సభకు తెలిపారు. ఏప్రిల్ 1, 2010 నుంచి నాలుగేళ్ల కాలంలో ఉత్పత్తి లక్ష్యాలను అందుకోవడంలో ఆర్ఐఎల్ విఫలమైందని.. తాజా జరిమానాతో కలిపితే ఈ మొత్తం 2.376 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.14,250 కోట్లు) చేరినట్లు ఆయన పేర్కొన్నారు. కంపెనీ వెనక్కితీసుకునే పెట్టుబడి వ్యయాల్లో కోత రూపంలో ఈ జరిమానా ఉంటుంది. గ్యాస్ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం నుంచి నిర్వహణ, పెట్టుబడి వ్యయాలన్నింటినీ ఆర్ఐఎల్, దాని భాగస్వామ్య సంస్థలైన బ్రిటిష్ పెట్రోలియం(బీపీ), నికో రిసోర్సెస్‌లు వెనక్కి తీసుకునేందుకు ఉత్పత్తి పంపకం కాంట్రాక్టు అనుమతిస్తోంది. ఆతర్వాతే ప్రభుత్వంతో లాభాలను పంచుకోవాలని నిర్దేశిస్తోం ది. గత, తాజా జరిమానాల విధింపు నేపథ్యంలో 2010-11 నుంచి 2013-14 మధ్య ప్రభుత్వానికి 19.5 కోట్ల డాలర్ల మేర అధికంగా లాభాల వాటా లభించనుందని ప్రధాన్ చెప్పారు. ఈ నెల 10న నోటీసు...: 2013-14 ఏడాదిలో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోనందుకు తాజా జరిమానా విధించినట్లు చమురు శాఖ మంత్రి వెల్లడించారు. ఆర్ఐఎల్ పెట్టుబడుల వ్యయంలో 57.9 కోట్ల డాలర్లు వెనక్కితీసుకునేందుకు నిరాకరిస్తూ ఈ నెల 10న నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక(ఎఫ్డీపీ) ప్రకారం కేజీ-డీ6లోని డీ1, డీ3 ప్రధాన క్షేత్రాల నుంచి ప్రస్తుతం గ్యాస్ ఉత్పత్తి రోజుకు 80 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లు(ఎంసీఎండీ)గా ఉండాలని.. అయితే, వాస్తవ ఉత్పత్తి 2011-12లో 35.88 ఎంసీఎండీ, 2012-13లో 20.88 ఎంసీఎండీ, 2013-14లో 9.77 ఎంసీఎండీలకు పరిమితమైనట్లు ప్రధాన్ లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఈ ఏడాది(2014-15)లో ఉత్పత్తి కేవలం 8.05 ఎంసీఎండీ స్థాయిలోనే ఉందని కూడా తెలిపారు. ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోవడం వైఫల్యానికిగాను గతంలో ప్రభుత్వం 1.797 బిలియన్ డాలర్ల మొత్తాన్ని(2010-11 నుంచి 2012-13 కాలానికి) జరిమానాగా విధించిందని.. ప్రస్తుతం ఈ అంశం మధ్యవర్తిత్వం(ఆర్బిట్రేషన్) ప్రక్రియలో ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. -
సరైన సమయంలో తగిన నిర్ణయం
సహజ వాయువు ధర పెంపుపై చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటాం... సంస్కరణలకూ తగిన ప్రాధాన్యం... న్యూఢిల్లీ: సహజ వాయువు ధర పెంపు విషయంలో పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పెదవి విప్పారు. సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ధర నిర్ణయంలో పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడంతోపాటు, సంస్కరణలను తక్షణం ముందుకు తీసుకెళ్లే అంశానికీ ప్రాధాన్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ రెండింటిమధ్య సమతూకం పాటిస్తామని ప్రధాన్ తెలిపారు. ఎప్పటికల్లా దీనిపై నిర్ణయం ఉండొచ్చనేది చెప్పేందుకు నిరాకరించారు. పేదలకు అనుకూల ఆర్థిక సంస్కరణలు చేపడతామని చెప్పారు. మోడీ నిర్ణయమే కీలకం...: దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న సహజ వాయువు ధరను 4.2 డాలర్ల(యూనిట్‌కు) నుంచి రెట్టింపు స్థాయిలో 8.3 డాలర్లకు పెంచేలా (రంగారాజన్ కమిటీ ఫార్ములా ప్రకా రం) గత యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ పెంపు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, సార్వత్రిక ఎన్నికల కోడ్ కారణంగా అమలు వాయిదా పడింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ధర పెంపుపై నిర్ణయం కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు ఓఎన్జీసీ ఇతర ప్రభుత్వ రంగ చమురు-గ్యాస్ కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. కాగా, జూలై ఒకటి నుంచి కొత్త ధరలు అమలయ్యే అవకాశం ఉందని, దీనికి సంబంధించి త్వరలో నిర్ణయం వెలువడనున్నట్లు పెట్రోలియం శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు గతవారంలో పేర్కొన్న విషయం తెలిసిందే.