రిలయన్స్‌పై 57.9 కోట్ల డాలర్ల అదనపు జరిమానా
లక్ష్యానికి అనుగుణంగా గ్యాస్‌ను
ఉత్పత్తి చేయకపోవడమే కారణం
పెట్రోలియం శాఖ మంత్రి ప్రధాన్ వెల్లడి
న్యూఢిల్లీ: కేజీ-డీ6 క్షేత్రాల్లో లక్ష్యాల కంటే తక్కువగా సహజవాయువును ఉత్పత్తి చేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)పై కేంద్రం 57.9 కోట్ల డాలర్ల అదనపు జరిమానాను విధించింది. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని సోమవారం లోక్‌సభకు తెలిపారు. ఏప్రిల్ 1, 2010 నుంచి నాలుగేళ్ల కాలంలో ఉత్పత్తి లక్ష్యాలను అందుకోవడంలో ఆర్‌ఐఎల్ విఫలమైందని.. తాజా జరిమానాతో కలిపితే ఈ మొత్తం 2.376 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.14,250 కోట్లు) చేరినట్లు ఆయన పేర్కొన్నారు.
కంపెనీ వెనక్కితీసుకునే పెట్టుబడి వ్యయాల్లో కోత రూపంలో ఈ జరిమానా ఉంటుంది. గ్యాస్ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం నుంచి నిర్వహణ, పెట్టుబడి వ్యయాలన్నింటినీ ఆర్‌ఐఎల్, దాని భాగస్వామ్య సంస్థలైన బ్రిటిష్ పెట్రోలియం(బీపీ), నికో రిసోర్సెస్‌లు వెనక్కి తీసుకునేందుకు ఉత్పత్తి పంపకం కాంట్రాక్టు అనుమతిస్తోంది. ఆతర్వాతే ప్రభుత్వంతో లాభాలను పంచుకోవాలని నిర్దేశిస్తోం ది. గత, తాజా జరిమానాల విధింపు నేపథ్యంలో 2010-11 నుంచి 2013-14 మధ్య ప్రభుత్వానికి 19.5 కోట్ల డాలర్ల మేర అధికంగా లాభాల వాటా లభించనుందని ప్రధాన్ చెప్పారు.
ఈ నెల 10న నోటీసు...: 2013-14 ఏడాదిలో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోనందుకు తాజా జరిమానా విధించినట్లు చమురు శాఖ మంత్రి వెల్లడించారు. ఆర్‌ఐఎల్ పెట్టుబడుల వ్యయంలో 57.9 కోట్ల డాలర్లు వెనక్కితీసుకునేందుకు నిరాకరిస్తూ ఈ నెల 10న నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక(ఎఫ్‌డీపీ) ప్రకారం కేజీ-డీ6లోని డీ1, డీ3 ప్రధాన క్షేత్రాల నుంచి ప్రస్తుతం గ్యాస్ ఉత్పత్తి రోజుకు 80 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లు(ఎంసీఎండీ)గా ఉండాలని.. అయితే, వాస్తవ ఉత్పత్తి 2011-12లో 35.88 ఎంసీఎండీ, 2012-13లో 20.88 ఎంసీఎండీ, 2013-14లో 9.77 ఎంసీఎండీలకు పరిమితమైనట్లు ప్రధాన్ లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
ఈ ఏడాది(2014-15)లో ఉత్పత్తి కేవలం 8.05 ఎంసీఎండీ స్థాయిలోనే ఉందని కూడా తెలిపారు. ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోవడం వైఫల్యానికిగాను గతంలో ప్రభుత్వం 1.797 బిలియన్ డాలర్ల మొత్తాన్ని(2010-11 నుంచి 2012-13 కాలానికి) జరిమానాగా విధించిందని.. ప్రస్తుతం ఈ అంశం మధ్యవర్తిత్వం(ఆర్బిట్రేషన్) ప్రక్రియలో ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.