Vedanta company
-
‘సెమీ’ ఆశలకు సడన్ బ్రేకులు!
ఆశించిన పురోగతికి అర్ధంతరంగా బ్రేకులు పడినప్పుడు నిరాశ సహజమే! అందులోనూ అది సాక్షాత్తూ ప్రధాని గొప్పగా చెప్పిన ఆత్మనిర్భర ఆశయాలకు భంగకరమని అనిపించినప్పుడు నిరుత్సాహం మరీ ఎక్కువే! భారత దేశ సెమీ కండక్టర్ల (చిప్‌ల) తయారీ ఆకాంక్షలకు ఇప్పుడు అలాంటి అవరోధాలే వచ్చాయి. సెమీ కండక్టర్ల తయారీకి కలసి కృషి చేసేందుకు ఒక్కటైన తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ‘ఫాక్స్‌కాన్’, భారత సంస్థ ‘వేదాంత’ ఇప్పుడు దేని దారి అది చూసుకోవడం అలాంటి పరిణామమే. దీనివల్ల భారత చిప్ లక్ష్యాలకు ఇబ్బంది ఏమీ ఉండదని కేంద్రం చెబుతున్నప్పటికీ అది సంపూర్ణ సత్యమేమీ కాదు. చిప్‌ల తయారీ నిమిత్తం వేదాంత– ఫాక్స్‌కాన్‌లు గత ఏడాది ఉమ్మడి భాగస్వామ్యానికి దిగి, గుజరాత్ ప్రభుత్వంతో 19.5 బిలియన్ డాలర్ల విలువైన సెమీ కండర్ల కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాయి. తీరా పట్టుమని పది నెలలకే ఆ గ్రూపు నుంచి వైదొలగుతున్నట్టు ఫాక్స్‌కాన్ ప్రకటించడం ఒక విధంగా ఆకస్మిక బ్రేకనే చెప్పాలి. ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజైన్ రంగంలో ప్రపంచ కేంద్రంగా మన దేశం ఆవిర్భవించేందుకు తగిన వాతావరణ పరికల్పనే లక్ష్యంగా పెట్టుకున్న భారత సెమీ కండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)కు ఇది శుభవార్త కానే కాదు. ‘సెమీ కండక్టర్ల ఆలోచనను నిజం చేయడానికి’ వేదాంత సంస్థతో కలసి ఏడాది పైగా కృషి చేసిన ఫాక్స్‌కాన్ పరస్పర అంగీకారంతో, ఈ ఉమ్మడి భాగస్వామ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సోమవారం ప్రకటించింది. అంటే ఇక ఆ బృహత్ ప్రయత్నంలో ఫాక్స్‌కాన్ పేరు ఉండదు. ప్రాజెక్ట్ పూర్తిగా వేదాంత సంస్థకే సొంతమన్నమాట. తొలి ప్రకటన వచ్చిన 24 గంటలలోపే ఇటు ఫాక్స్‌కాన్ సైతం విడిగా తగిన సాంకేతిక భాగస్వామిని చేర్చుకొని, తనదైన వ్యూహంతో ముందుకు నడుస్తుందన్న సంకేతాలొచ్చేశాయి. కలసి అడుగులేసిన సంస్థలు ఏడాదికే ఇలా వేరు కుం పట్లయిన పరిణామానికి కారణాలేమిటన్నది అవి చెప్పలేదు. గుజరాత్లో చిప్‌ల తయారీకి కావాల్సిన లైసెన్స్‌తో కూడిన సాంకేతిక పరిజ్ఞానంకోసం వేదాంత, ఫాక్స్‌కాన్‌లు ఎస్టీమైక్రోను ఆసరాగా బరిలోకి దింపాయి. కానీ, ప్రభుత్వం మాత్రం సదరు యూరోపియన్ చిప్ తయారీ సంస్థ కూడా నిష్పూచీగా మిగలక, ఒప్పందంలో భాగస్వామిగా ఉండాల్సిందే అనడంతో చిక్కొచ్చినట్టుంది. ప్రపంచంలో 37 శాతం చిప్‌లు తైవాన్వే! భారత ఎలక్ట్రానిక్ చిప్ అవసరాలన్నీ ప్రధానంగా దిగుమతి ద్వారానే తీరుతున్నాయి. కొన్నేళ్ళుగా ఏటా దాదాపు 1000 కోట్ల డాలర్ల విలువైన చిప్‌లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందులో సుమారు 70 శాతం చైనా నుంచి వస్తున్నవే. చిప్‌ల తయారీలోని ఈ అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఐఎస్ఎం ప్రారంభమైంది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, అనేక ఐరోపా దేశాలు చిప్‌ల తయారీ సత్తా పెంచుకుంటున్నాయి. తాజాగా భారత్ ఆ పరుగులో చేరింది. దేశంలో చిప్‌ల తయారీ కేంద్రాల్ని నెలకొల్పాలని వచ్చేవారికి పెట్టుబడి రూపంలో ప్రోత్సాహకాలిచ్చేందుకు సిద్ధపడింది. అమెరికా చిప్ తయారీ సంస్థ మైక్రాన్ ఇటీవలే భారత్‌లో చిప్ కేంద్రానికి ఆమోదం పొందింది. కేంద్ర, గుజరాత్ సర్కార్లు దానికి గణనీయంగా పెట్టుబడి సాయం చేస్తున్నాయి. ఆత్మ నిర్భరతకై ఇలాంటి యత్నాలు జరుగుతున్న వేళ భారీ ఒప్పందమైన వేదాంత – ఫాక్స్‌కాన్ చిక్కుల్లో పడడమే విచారకరం. కారణాలేమైనా గత ఏడాది ఫిబ్రవరి 14న ఫాక్స్‌కాన్– వేదాంతల మధ్య మొలకెత్తిన ప్రేమ మూణ్ణాళ్ళ ముచ్చటైంది. గుజరాత్లో చిప్‌ల తయారీ కేంద్రాల ఏర్పాటుకై గత సెప్టెంబర్‌లో చేసుకున్న రూ. 1.54 లక్ష కోట్ల మేర ఒప్పందాలు ఇరుకునపడ్డాయి. ఏ సంస్థకు ఆ సంస్థ విడివిడిగా ముందుకు పోయినా భారత సెమీ కండక్టర్ల మిషన్‌లో జాప్యం తప్పదనిపిస్తోంది. చిప్‌ల తయారీకి తగ్గ పునాది లేకున్నా చిప్ డిజైన్‌లో మాత్రం మన దేశం ముందంజలో ఉంది. దాన్ని ఆయుధంగా మలుచుకోవాలి. సొంత తయారీతో పదునుపెట్టుకోవాలి. పైగా, కరోనాతో సరఫరా వ్యవస్థలకు అంతరాయం, రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో వచ్చిపడ్డ అనివార్యతల రీత్యా రక్షణ, ఎలక్ట్రానిక్స్ తదితర కీలక రంగాల్లో భారత్ ఎంత త్వరగా సొంతకాళ్ళపై నిలబడగలిగితే వ్యూహాత్మకంగా అంత మంచిది. ఆ మాటకొస్తే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా పైచేయి సాధించగలిగిందీ ఈ చిప్‌ల వల్లేనంటారు విశ్లేషకులు. అమెరికా, చైనాల మధ్య ఇప్పుడు నడుస్తున్న భౌగోళిక రాజకీయాల తోపులాటలోకూ ఇవే కారణం. ఇవాళ దేశాలన్నీ తమ గడ్డపైనే అన్ని రకాల చిప్‌ల రూపకల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తోందీ, ప్రోత్సాహకాలిస్తున్నదీ అందుకే. కాబట్టి, మనకు అవసరమైన చిప్‌ల డిజైనింగ్ నుంచి తయారీ దాకా అన్నీ మన చేతుల్లోనే ఉండడం పోటీలో ముందు ఉండడానికో, ఆర్థిక ప్రయోజనాల రీత్యానో కాకున్నా... వ్యూహాత్మకంగా భారత్‌కు అత్యంత కీలకం. అందుకే, వేదాంత – ఫాక్స్‌కాన్‌ల బంధం విచ్ఛిన్నమైందన్న నిరాశను పక్కనపెట్టి, సెమీ కండక్టర్ల రంగాన్ని దృఢంగా నిర్మించేందుకు మరింతగా కృషి చేయాలి. చైనా లాంటివి పడనివ్వకుండా చేసినా పట్టుదలతో సాగాలి. వేదాంత – ఫాక్స్‌కాన్‌లకు ఇరుకున పెట్టిన ఆర్థిక, సాంకేతిక అంశాలనూ క్షుణ్ణంగా పరిశీలించాలి. భవిష్యత్తులో ఇలాంటి మరో ప్రయత్నానికి ఆ చిక్కులు రాకుండా నివారించాలి. సెమీ కండక్టర్ల రంగంలో సాంకేతిక విజ్ఞాన బదలీని ప్రోత్సహించాలి. పరిశోధన, అభివృద్ధిలో దేశ, విదేశీ సంస్థల మధ్య సహకారాన్నీ పెంచిపోషించడమూ అంతే ముఖ్యం. ఎందుకంటే, ఐఎస్ఎం కింద రూ. 76 వేల కోట్ల కేటాయింపుతో నాలుగు పథకాలు ప్రవేశపెట్టామంటున్న ప్రభుత్వం సంస్థలకు తగిన వాతావరణం కల్పిస్తేనే ఫలితం. మేకిన్ ఇండియాకు బ్రేకులు పడకూడదంటే అది అత్యంత కీలకం. -
మరింత తగ్గిన వేదాంత రుణ భారం
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం వేదాంత మాతృసంస్థ వేదాంత రిసోర్సెస్ (వీఆర్ఎల్) మరో 400 మిలియన్ డాలర్ల రుణాలను తిరిగి చెల్లించింది. మే, జూన్‌లో మెచ్యూర్ అయ్యే రుణాలు, బాండ్లను మొత్తం చెల్లించేసినట్లు కంపెనీ తెలిపింది. దీంతో స్థూల రుణభారం 6.4 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు వివరించింది. (ఇదీ చదవండి: సెయిల్ చైర్మన్‌గా ప్రకాష్ బాధ్యతలు స్వీకరణ) 2022 మార్చి నుంచి ఇప్పటివరకు 3.3 బిలియన్ డాలర్లు తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం మిగతా వ్యవధిలో మరిన్ని రుణాలను చెల్లిస్తామని, అంతిమంగా సున్నా స్థాయికి తగ్గించుకుంటామని ఒక ప్రకటనలో వేదాంత తెలిపింది. అయితే, ఇందుకోసం నిర్దిష్ట గడువేదీ వెల్లడించలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో 2.1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి రానుండగా.. నిధులు సమీకరించేందుకు షేర్లను తనఖా పెట్టడం సహా వీఆర్ఎల్కు పలు మార్గాలు ఉన్నాయని క్రెడిట్‌సైట్స్ సంస్థ తెలిపింది. -
వేదాంత డైరెక్టర్‌గా అనిల్ అగర్వాల్
న్యూఢిల్లీ: మైనింగ్ మ్యాగ్నెట్ అనిల్ అగర్వాల్.. వేదాంత కంపెనీలో తొలిసారిగా డైరెక్టర్‌గా నియమితులయ్యారు. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వేదాంత రిసోర్సెస్‌కు అధినేతగా అనిల్ అగర్వాల్ వ్యవహరిస్తున్నారు. అనిల్ అగర్వాల్(66)ను నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించామని వేదాంత లిమిటెడ్ తెలిపింది. ఇప్పటివరకూ ఈ బాధ్యతలను అనిల్ అగర్వాల్ సోదరుడు నవీన్ నిర్వర్తించారని, ఇప్పటి నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా నవీన్ వ్యవహరిస్తారని పేర్కొంది. కంపెనీ సీఈఓ ఎస్. వెంకటకృష్ణన్ రాజీనామా చేయడంతో ఈ మార్పులు జరిగాయని వివరించింది. మరోపక్క, హిందుస్తాన్ జింక్‌కు హెడ్‌గా ఉన్న సునీల్ దుగ్గల్‌ను వేదాంత సీఈఓగా నియమించామని తెలిపింది. -
ప్రజల నిరసనలతో దిగొచ్చిన ప్రభుత్వం
చెన్నై : స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తూత్తుకుడిలో సాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారిన అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. వేదంత లిమిటెడ్‌కు చెందిన స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం చెప్పారు. స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో, పోలీసుల కాల్పులకు గాయపడ్డ వారిని పన్నీర్‌సెల్వం పరామర్శించారు. ఈ నిరసనల్లో ఇప్పటికీ 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి నష్టపరిహారం చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతంలో పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. కస్టమర్ల కోసం దుకాణాలు తెరుచుకుంటున్నాయి. మే 23 నుంచి రద్దు చేసిన ఇంటర్నెట్ సేవలు కూడా, అక్కడ ఆదివారం అర్థరాత్రి నుంచి పునరుద్ధరించారు. ‘దుకాణాలు తెరుచుకున్నాయి. పరిస్థితి సద్దుమణిగింది. కానీ ఫ్యాక్టరీని మూసివేసే వరకు నగరంలో పూర్తి ప్రశాంతత ఏర్పడదు’ అని తూత్తుకుడి ట్రేడర్స్ అసోసియేషన్ ఎస్ రాజ చెప్పారు. అదేవిధంగా నిరసనకారులపై కాల్పులు జరిపిన పోలీసు అధికారులపై నేర కేసు నమోదు చేయాలని రాజ అన్నారు. 13 మృతదేహాల్లో ఏడుగురికి పోస్టుమార్టం పూర్తి అయిందని రాజ చెప్పారు. మరోవైపు స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ పనులను నిలిపేయాలని మద్రాస్ హైకోర్టు సైతం ఆదేశించింది. ఆందోళనల్లో 13 మంది మృతిచెందడంపై తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. రెండు వారాల్లో నివేదికలు సమర్పించాలని కోరింది. ఈ ఘటనలపై వేదంత రిసోర్సస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ తొలిసారి స్పందించారు. ప్రపంచంలో కేవలం 2 శాతం కాపర్‌ను మాత్రమే భారత్ ఉత్పత్తి చేస్తుందని, మిగతా అంతా కెనడా, మధ్యప్రాచ్య, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు తెలిపారు. ఇలాంటివన్నీ భారత్‌లోనే జరుగుతాయని, ప్రతీసారి, ప్రజాస్వామ్యాన్ని ప్రజలు చేతుల్లోకి తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మనం జీవితాంతం దిగుమతి చేసుకునే బతుకుదామా? అని ఆయన ప్రశ్నించారు. -
స్టెరిలైట్ విస్తరణ పనులను నిలిపేయండి
-
రణరంగంగా తూత్తుకుడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: వేదాంత కంపెనీ స్టెరిలైట్ కాపర్ యూనిట్‌కు వ్యతిరేకంగా తూత్తుకుడిలో వరుసగా రెండో రోజు ఆందోళనలు కొనసాగాయి. బుధవారం పోలీసులు జరిపిన కాల్పులకు 22 ఏళ్ల యువకుడు బలయ్యాడు. మంగళవారం నాటి కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి కూడా మృతిచెందాడు. దీంతో రెండ్రోజుల వ్యవధిలో ఇక్కడ మృతిచెందిన వారి సంఖ్య 13కు పెరిగింది. ఆందోళనకారులు అన్నానగర్‌లో బుధవారం కూడా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పోలీసులపైకి రాళ్లు, ఇటుకలు రువ్వడంతో వారు కాల్పులు జరిపారు. తూత్తుకుడి హింసాత్మక ఘటనలపై విచారణ జరిపేందుకు తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో కమిటీని నియమించింది. మరోవైపు, స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ పనులను నిలిపేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఆందోళనల్లో 13 మంది మృతిచెందడంపై తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. రెం డు వారాల్లో నివేదికలు సమర్పించాలని కోరింది. -
వేదాంత లాభం రూ.2,036 కోట్లు
న్యూఢిల్లీ: లోహ దిగ్గజం వేదాంత కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 43 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.1,424 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.2,036 కోట్లకు చేరుకుంది. ఆయిల్, గ్యాస్ విభాగ సేల్స్ తక్కువగా ఉండటంతో పాటు కరెన్సీ ఒడిదుడుకులూ ఉన్నాయని, అయినా ఈ స్థాయి నికర లాభం సాధించామని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుల్దీప్ కౌరా చెప్పారు. అనుబంధ సంస్థలు కాపర్ ఇండియా, జింక్ ఇండియా, జింక్ ఇంటర్నేషనల్ అమ్మకాలు అధికంగా ఉండడం, అల్యూమినియమ్ వ్యాపారం పునర్వ్యస్థీకరణ, కమోడిటీల ధరలు పెరగడం నిర్వహణ ఆదాయం అధికంగా ఉండడం.. నికర లాభం పెరగడానికి ప్రధాన కారణాలని వివరించారు. మొత్తం ఆదాయం రూ.18,154 కోట్ల నుంచి 24 శాతం వృద్ధితో రూ.22,466 కోట్లకు చేరుకుంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇంట్రాడేలో తాజా ఏడాది గరిష్ట స్థాయి, రూ.345ను తాకిన వేదాంతా షేర్... చివరకు 0.8 శాతం నష్టపోయి రూ.340 వద్ద ముగిసింది. ఈ షేర్ ఏడాది కనిష్ట స్థాయి రూ.192. -
వేదాంత నష్టాలు రూ.11,181 కోట్లు
ఆదాయం 10 శాతం డౌన్ న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం వేదాంత కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.11,181.26 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. కెయిర్న్ ఇండియా సంబంధిత రూ.12,304 కోట్ల నగదేతర ఇంపెయిర్మెంట్ చార్జ్ (చమురు ధరలు పడిపోయినందున కెయిర్న్ ఆస్తి విలువను బ్యాలెన్స్ షీట్లో భారీగా తగ్గించడం ద్వారా వచ్చిన నష్టం) కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వేదాంత తెలిపింది. అయితే అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వచ్చిన నష్టాలతో పోల్చితే ఈ నష్టాలు తక్కువగానే ఉన్నాయని వేదాంత సీఈఓ టామ్ అల్బనీజ్ పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.19,228 కోట్ల నష్టాలు వచ్చాయని చెప్పారు. మొత్తం ఆదాయం రూ.17,804 కోట్ల నుంచి 10 శాతం తగ్గి రూ.15,979 కోట్లకు పడిపోయిందని పేర్కొన్నారు. ఇతర ఆదాయం 47 శాతం పెరిగి రూ.3,482 కోట్లకు ఎగసిందని తెలిపారు. ఆయిల్, లోహ ధరలు తగ్గడం వల్ల ఆదాయం పడిపోయిందని, . అయితే అమ్మకాలు అధికంగా ఉండడం వల్ల కొంత మేరకు గట్టెక్కామని పేర్కొన్నారు. అసాధారణ అంశాలను పరిగణనలోకి తీసుకోకుంటే, తమ నికర లాభం 89 శాతం వృద్ధితో రూ.955 కోట్లుగా ఉందని, వ్యయ నియంత్రణ పద్ధతులు, ఇతర ఆదాయాలు దీనికి కారణమని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో వేదాంత షేర్ 4.6 శాతం క్షీణించి రూ. 100 వద్ద ముగిసింది. -
చమురు మంత్రితో కెయిర్న్ సీఈవో భేటీ
న్యూఢిల్లీ: కెయిర్న్ ఇండియా, వేదాంత సంస్థల విలీనం అంశం క్రమంగా ముందుకు కదులుతోంది. ఇందుకు సంబంధించి కెయిర్న్ సీఈవో అషర్, సీఎఫ్‌వో సుధీర్ మాథుర్.. చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. ప్రతిపాదిత రివర్స్ మెర్జర్ గురించి వివరించారు. వేదాం త రుణభారాన్ని తగ్గించే ఉద్దేశంతో కెయిర్న్ ఇండియాలో దాన్ని విలీనం చేసే ప్రతిపాదనను రివర్స్ మెర్జర్గా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా వేదాంతలో కెయిర్న్ ఇండియాను విలీనం చేయాలంటే పలు అనుమతులు పొందాల్సి ఉంటుంది. అదే వేదాంతను కెయిర్న్లో విలీనం చేస్తే(రివర్స్ మెర్జర్) పలు అనుమతుల సమస్య తగ్గనుంది. ఇదే అంశంపై చర్చిం చేందుకు ఇరు సంస్థల బోర్డులు ఈ ఆదివారం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వేదాంతకు ఉన్న రూ.37,636 కోట్ల మేర రుణభారాన్ని తగ్గించడమన్నది ఈ విలీనం ప్రధానోద్దేశం. ఇందుకోసం కెయిర్న్ వద్దనున్న రూ. 16,870 కోట్ల నగదు నిల్వలతో పాటు కంపెనీకి ఏటా వచ్చే రూ. 1,320 కోట్ల లాభాలను వినియోగించుకోవచ్చన్నది ప్రతిపాదన.