న్యూఢిల్లీ: లోహ దిగ్గజం వేదాంత కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 43 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.1,424 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.2,036 కోట్లకు చేరుకుంది. ఆయిల్, గ్యాస్ విభాగ సేల్స్ తక్కువగా ఉండటంతో పాటు కరెన్సీ ఒడిదుడుకులూ ఉన్నాయని, అయినా ఈ స్థాయి నికర లాభం సాధించామని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుల్దీప్ కౌరా చెప్పారు.
అనుబంధ సంస్థలు కాపర్ ఇండియా, జింక్ ఇండియా, జింక్ ఇంటర్నేషనల్ అమ్మకాలు అధికంగా ఉండడం, అల్యూమినియమ్ వ్యాపారం పునర్వ్యస్థీకరణ, కమోడిటీల ధరలు పెరగడం నిర్వహణ ఆదాయం అధికంగా ఉండడం.. నికర లాభం పెరగడానికి ప్రధాన కారణాలని వివరించారు. మొత్తం ఆదాయం రూ.18,154 కోట్ల నుంచి 24 శాతం వృద్ధితో రూ.22,466 కోట్లకు చేరుకుంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఇంట్రాడేలో తాజా ఏడాది గరిష్ట స్థాయి, రూ.345ను తాకిన వేదాంతా షేర్... చివరకు 0.8 శాతం నష్టపోయి రూ.340 వద్ద ముగిసింది. ఈ షేర్ ఏడాది కనిష్ట స్థాయి రూ.192.
Comments
Please login to add a commentAdd a comment