‘సెమీ’ ఆశలకు సడన్‌ బ్రేకులు! | Sakshi Editorial On Semiconductors aspirations | Sakshi
Sakshi News home page

‘సెమీ’ ఆశలకు సడన్‌ బ్రేకులు!

Published Thu, Jul 13 2023 12:06 AM | Last Updated on Thu, Jul 13 2023 12:06 AM

Sakshi Editorial On Semiconductors aspirations

ఆశించిన పురోగతికి అర్ధంతరంగా బ్రేకులు పడినప్పుడు నిరాశ సహజమే! అందులోనూ అది సాక్షాత్తూ ప్రధాని గొప్పగా చెప్పిన ఆత్మనిర్భర ఆశయాలకు భంగకరమని అనిపించినప్పుడు నిరుత్సాహం మరీ ఎక్కువే! భారత దేశ సెమీ కండక్టర్ల (చిప్‌ల) తయారీ ఆకాంక్షలకు ఇప్పుడు అలాంటి అవరోధాలే వచ్చాయి. సెమీ కండక్టర్ల తయారీకి కలసి కృషి చేసేందుకు ఒక్కటైన తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ సంస్థ ‘ఫాక్స్‌కాన్‌’, భారత సంస్థ ‘వేదాంత’ ఇప్పుడు దేని దారి అది చూసుకోవడం అలాంటి పరిణామమే. దీనివల్ల భారత చిప్‌ లక్ష్యాలకు ఇబ్బంది ఏమీ ఉండదని కేంద్రం చెబుతున్నప్పటికీ అది సంపూర్ణ సత్యమేమీ కాదు.

చిప్‌ల తయారీ నిమిత్తం వేదాంత– ఫాక్స్‌కాన్‌లు గత ఏడాది ఉమ్మడి భాగస్వామ్యానికి దిగి, గుజరాత్‌ ప్రభుత్వంతో 19.5 బిలియన్‌ డాలర్ల విలువైన సెమీ కండర్ల కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాయి. తీరా పట్టుమని పది నెలలకే ఆ గ్రూపు నుంచి వైదొలగుతున్నట్టు ఫాక్స్‌కాన్‌ ప్రకటించడం ఒక విధంగా ఆకస్మిక బ్రేకనే చెప్పాలి. ఎలక్ట్రానిక్స్‌ తయారీ, డిజైన్‌ రంగంలో ప్రపంచ కేంద్రంగా మన దేశం ఆవిర్భవించేందుకు తగిన వాతావరణ పరికల్పనే లక్ష్యంగా పెట్టుకున్న భారత సెమీ కండక్టర్‌ మిషన్‌ (ఐఎస్‌ఎం)కు ఇది శుభవార్త కానే కాదు. 

‘సెమీ కండక్టర్ల ఆలోచనను నిజం చేయడానికి’ వేదాంత సంస్థతో కలసి ఏడాది పైగా కృషి చేసిన ఫాక్స్‌కాన్‌ పరస్పర అంగీకారంతో, ఈ ఉమ్మడి భాగస్వామ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సోమవారం ప్రకటించింది. అంటే ఇక ఆ బృహత్‌ ప్రయత్నంలో ఫాక్స్‌కాన్‌ పేరు ఉండదు. ప్రాజెక్ట్‌ పూర్తిగా వేదాంత సంస్థకే సొంతమన్నమాట. తొలి ప్రకటన వచ్చిన 24 గంటలలోపే ఇటు ఫాక్స్‌కాన్‌ సైతం విడిగా తగిన సాంకేతిక భాగస్వామిని చేర్చుకొని, తనదైన వ్యూహంతో ముందుకు నడుస్తుందన్న సంకేతాలొచ్చేశాయి.

కలసి అడుగులేసిన సంస్థలు ఏడాదికే ఇలా వేరు కుం పట్లయిన పరిణామానికి కారణాలేమిటన్నది అవి చెప్పలేదు. గుజరాత్‌లో చిప్‌ల తయారీకి కావాల్సిన లైసెన్స్‌తో కూడిన సాంకేతిక పరిజ్ఞానంకోసం వేదాంత, ఫాక్స్‌కాన్‌లు ఎస్టీమైక్రోను ఆసరాగా బరిలోకి దింపాయి. కానీ, ప్రభుత్వం మాత్రం సదరు యూరోపియన్‌ చిప్‌ తయారీ సంస్థ కూడా నిష్పూచీగా మిగలక, ఒప్పందంలో భాగస్వామిగా ఉండాల్సిందే అనడంతో చిక్కొచ్చినట్టుంది.  

ప్రపంచంలో 37 శాతం చిప్‌లు తైవాన్‌వే! భారత ఎలక్ట్రానిక్‌ చిప్‌ అవసరాలన్నీ ప్రధానంగా దిగుమతి ద్వారానే తీరుతున్నాయి. కొన్నేళ్ళుగా ఏటా దాదాపు 1000 కోట్ల డాలర్ల విలువైన చిప్‌లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందులో సుమారు 70 శాతం చైనా నుంచి వస్తున్నవే. చిప్‌ల తయారీలోని ఈ అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఐఎస్‌ఎం ప్రారంభమైంది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, అనేక ఐరోపా దేశాలు చిప్‌ల తయారీ సత్తా పెంచుకుంటున్నాయి.

తాజాగా భారత్‌ ఆ పరుగులో చేరింది. దేశంలో చిప్‌ల తయారీ కేంద్రాల్ని నెలకొల్పాలని వచ్చేవారికి పెట్టుబడి రూపంలో ప్రోత్సాహకాలిచ్చేందుకు సిద్ధపడింది. అమెరికా చిప్‌ తయారీ సంస్థ మైక్రాన్‌ ఇటీవలే భారత్‌లో చిప్‌ కేంద్రానికి ఆమోదం పొందింది. కేంద్ర, గుజరాత్‌ సర్కార్లు దానికి గణనీయంగా పెట్టుబడి సాయం చేస్తున్నాయి. ఆత్మ నిర్భరతకై ఇలాంటి యత్నాలు జరుగుతున్న వేళ భారీ ఒప్పందమైన వేదాంత – ఫాక్స్‌కాన్‌ చిక్కుల్లో పడడమే విచారకరం.

కారణాలేమైనా గత ఏడాది ఫిబ్రవరి 14న ఫాక్స్‌కాన్‌– వేదాంతల మధ్య మొలకెత్తిన ప్రేమ మూణ్ణాళ్ళ ముచ్చటైంది. గుజరాత్‌లో చిప్‌ల తయారీ కేంద్రాల ఏర్పాటుకై గత సెప్టెంబర్‌లో చేసుకున్న రూ. 1.54 లక్ష కోట్ల మేర ఒప్పందాలు ఇరుకునపడ్డాయి. ఏ సంస్థకు ఆ సంస్థ విడివిడిగా ముందుకు పోయినా భారత సెమీ కండక్టర్ల మిషన్‌లో జాప్యం తప్పదనిపిస్తోంది.

చిప్‌ల తయారీకి తగ్గ పునాది లేకున్నా చిప్‌ డిజైన్‌లో మాత్రం మన దేశం ముందంజలో ఉంది. దాన్ని ఆయుధంగా మలుచుకోవాలి. సొంత తయారీతో పదునుపెట్టుకోవాలి. పైగా, కరోనాతో సరఫరా వ్యవస్థలకు అంతరాయం, రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధంతో వచ్చిపడ్డ అనివార్యతల రీత్యా రక్షణ, ఎలక్ట్రానిక్స్‌ తదితర కీలక రంగాల్లో భారత్‌ ఎంత త్వరగా సొంతకాళ్ళపై నిలబడగలిగితే వ్యూహాత్మకంగా అంత మంచిది.

ఆ మాటకొస్తే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా పైచేయి సాధించగలిగిందీ ఈ చిప్‌ల వల్లేనంటారు విశ్లేషకులు. అమెరికా, చైనాల మధ్య ఇప్పుడు నడుస్తున్న భౌగోళిక రాజకీయాల తోపులాటలోకూ ఇవే కారణం. ఇవాళ దేశాలన్నీ తమ గడ్డపైనే అన్ని రకాల చిప్‌ల రూపకల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తోందీ, ప్రోత్సాహకాలిస్తున్నదీ అందుకే.

కాబట్టి, మనకు అవసరమైన చిప్‌ల డిజైనింగ్‌ నుంచి తయారీ దాకా అన్నీ మన చేతుల్లోనే ఉండడం పోటీలో ముందు ఉండడానికో, ఆర్థిక ప్రయోజనాల రీత్యానో కాకున్నా... వ్యూహాత్మకంగా భారత్‌కు అత్యంత కీలకం. అందుకే, వేదాంత – ఫాక్స్‌కాన్‌ల బంధం విచ్ఛిన్నమైందన్న నిరాశను పక్కనపెట్టి, సెమీ కండక్టర్ల రంగాన్ని దృఢంగా నిర్మించేందుకు మరింతగా కృషి చేయాలి. చైనా లాంటివి పడనివ్వకుండా చేసినా పట్టుదలతో సాగాలి.

వేదాంత – ఫాక్స్‌కాన్‌లకు ఇరుకున పెట్టిన ఆర్థిక, సాంకేతిక అంశాలనూ క్షుణ్ణంగా పరిశీలించాలి. భవిష్యత్తులో ఇలాంటి మరో ప్రయత్నానికి ఆ చిక్కులు రాకుండా నివారించాలి. సెమీ కండక్టర్ల రంగంలో సాంకేతిక విజ్ఞాన బదలీని ప్రోత్సహించాలి. పరిశోధన, అభివృద్ధిలో దేశ, విదేశీ సంస్థల మధ్య సహకారాన్నీ పెంచిపోషించడమూ అంతే ముఖ్యం. ఎందుకంటే, ఐఎస్‌ఎం కింద రూ. 76 వేల కోట్ల కేటాయింపుతో నాలుగు పథకాలు ప్రవేశపెట్టామంటున్న ప్రభుత్వం సంస్థలకు తగిన వాతావరణం కల్పిస్తేనే ఫలితం. మేకిన్‌ ఇండియాకు బ్రేకులు పడకూడదంటే అది అత్యంత కీలకం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement