ఫోర్త్‌సిటీలో భాగస్వాములు కండి
సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఫ్యాక్టరీ సందర్శన
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపార విస్తరణ చేపట్టాలని ప్రముఖ సెల్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, లిథియం బ్యాటరీల తయారీకి సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. హైటెక్నాలజీ ఉత్పత్తుల తయారీ, ఆవిష్కరణలకు రాష్ట్రంలో అత్యంత అనుకూల వాతావరణం ఉందని వివరించారు. ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫోర్త్‌సిటీలో భాగస్వాములు కావాలని కోరారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలిసి సోమవారం కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ పరిశ్రమను ఆయన సందర్శించారు.
గంటకు పైగా అక్కడ గడిపిన ఆయన ఫ్యాక్టరీ ఏర్పాటులో పురోగతిని పరిశీలించారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కంపెనీ ఉత్పత్తులు, నిరుద్యోగ యువతకు కల్పించనున్న ఉపాధి అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కంపెనీ ప్రస్తుత, భవిష్యత్తు కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తోడ్పాటునందిస్తుందన్నారు. ఫాక్స్‌కాన్ కంపెనీ సీఈఓ, చైర్మన్ సిడ్నీ లూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్టు పురోగతిని సీఎంకు వివరించారు.
కంపెనీ నిర్వహణకు సంబంధించిన కొన్ని సమస్యలను ఆయన ప్రస్తావించగా, వాటి సత్వర పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. గ్లోబల్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులకు సరైన గమ్యస్థానంగా రాష్ట్రాన్ని బలోపేతం చేయడంలో భాగంగా సీఎం రేవంత్ ఈ పర్యటనను చేపట్టారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment