ఫోర్త్‌సిటీ ఏర్పాటులో మీ విజన్‌ అద్భుతం | Foxconn keen to invest in Hyderabad: Chairman Young Liu meets CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

ఫోర్త్‌సిటీ ఏర్పాటులో మీ విజన్‌ అద్భుతం

Published Sat, Aug 17 2024 4:57 AM | Last Updated on Sat, Aug 17 2024 4:57 AM

Foxconn keen to invest in Hyderabad:  Chairman Young Liu meets CM Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అభినందించిన ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యంగ్‌ లియూ 

త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తానని హామీ.. పెట్టుబడులకు సానుకూలత

సాక్షి, న్యూఢిల్లీ: ఇండస్ట్రీ, సర్వీస్‌ సెక్టార్లతోపాటు అన్నిరంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్‌కు ఉందని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యంగ్‌లియూ అన్నారు. త్వరలోనే తన బృందంతో కలిసి నగరాన్ని సందర్శిస్తానని తెలిపారు. యంగ్‌లియూ నేతృత్వంలోని ఫాక్స్‌కాన్‌ ప్రతినిధి బృందం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆయన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం సమావేశమైంది. నగరానికి ఉన్న చరిత్ర.. పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను సీఎం రేవంత్‌  ఫాక్స్‌కాన్‌ బృందానికి వివరించారు.

430 ఏళ్ల కింద పునాదిరాయి పడిన హైదరాబాద్‌లో అభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకే తాము ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్టు ఫ్యూచర్‌ సిటీ పేరుతో నాలుగోనగరానికి (ఫోర్త్‌ సిటీ) రూపకల్పన చేస్తున్నామని సీఎం రేవంత్‌ వివరించారు. ఫోర్త్‌ సిటీలో విద్య. వైద్యం, క్రీడా, ఎలక్ట్రానిక్స్‌–ఎలక్ట్రికల్, స్కిల్స్‌..ఇలా బహుముఖంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఫోర్త్‌ సిటీలో ఫాక్స్‌కాన్‌ సంస్థ పరిశ్రమలు పెట్టేందుకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వడంతోపాటు అవసరమైన మద్దతు అందజేస్తామని సీఎం ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌కు హామీ ఇచ్చారు. ఫోర్త్‌ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు, ఇటీవల సీఎం రేవంత్‌ నేతృత్వంలో తమ బృందం అమెరికా, దక్షిణకొరియాలో పర్యటించి దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో జరిపిన చర్చలు, చేసుకున్న ఒప్పందాలను  మంత్రి శ్రీధర్‌ బాబు యంగ్‌లియూకి వివరించారు.ఫోర్త్‌ సిటీ రూపకల్పనలో ముఖ్యమంత్రి దార్శనికత, పారిశ్రామిక అనుకూల విధానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని యంగ్‌లియూ రేవంత్‌ను అభినందించారు. తాను సాధ్యమైనంత త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తానని.. అంతకుముందే తమ చీఫ్‌ క్యాంపస్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ క్యాథీ యాంగ్, సంస్థ భారత దేశ ప్రతినిధి వీలీ నేతృత్వంలోని బృందం హైదరాబాద్‌ వస్తుందని చెప్పారు.

ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన స్కిల్స్‌ను యువతకు అందించేందుకు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌కు వివరించారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు జయేశ్‌ రంజన్, డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి , ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డిలతో పాటు డాక్టర్‌ ఎస్‌.కే. శర్మ, బాబ్‌చెన్, జొవూ, సూషొకూ, సైమన్‌సంగ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement