సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పారిశ్రామికరంగ అభివృద్ధిలో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు సులభంగా లభించేలా చూస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌కు చెందిన హాన్‌హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి వీ లీ నేతృత్వంలోని బృందం మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్‌ను కలిసింది.
ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ చేపట్టిన ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా రేవంత్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేస్తామని, అన్ని రంగాలను ప్రోత్సహించేందుకు స్నేహపూర్వక విధానాలు అవలంబిస్తామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ ఉత్పాదక కేంద్రం నిర్వహణకు, ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో చేపట్టే భవిష్యత్తు ప్రాజెక్టులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.
రెండేళ్లలో 25 వేల ఉద్యోగాలు...
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థగా పేరొందిన ఫాక్స్‌కాన్‌కు యాపిల్ ఐఫోన్‌తోపాటు గూగుల్, షియోమీ, అమెజాన్, హ్యూలెట్ పాకర్డ్, అలీబాబా, సిస్కో, ఫేస్‌బుక్, సోనీ, మైక్రోసాఫ్ట్, నోకియా వంటి దిగ్గజ కంపెనీలు కస్టమర్లుగా ఉన్నాయి. చైనా, వియత్నాం, థాయ్‌లాండ్, మలేసియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాల్లో ఫాక్స్‌కాన్ కార్యకలాపాలు సాగిస్తోంది.
భారత్‌లో శ్రీసిటీ (ఏపీ), శ్రీపెరంబదూర్ (తమిళనాడు), బెంగళూరు (కర్ణాటక)తోపాటు తెలంగాణ (కొంగరకలాన్)లో ఉత్పాదక కేంద్రాలు ఉన్నాయి. యాపిల్ ఐఫోన్లకు ఇయర్‌పాడ్స్ తయారీకి సంబంధించి తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వంతో ఫాక్స్‌కాన్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాంటు నిర్మాణం కోసం ఈ ఏడాది మే 15న శంకుస్థాపన చేసింది. కొంగరకలాన్ ప్లాంటు ద్వారా దశలవారీగా లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే రెండేళ్లలో ఫాక్స్‌కాన్ కొంగరకలాన్ యూనిట్ ద్వారా 25 వేల ఉద్యోగాల కల్పన జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment