ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్‌లో తన రిటైల్ స్టోర్‌లను విస్తరించాలని యోచిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబయిలో రిటైల్ స్టోర్‌లను ప్రారంభించిన యాపిల్ మరో నాలుగు అవుట్‌లెట్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. అందుకు అనుగుణంగా ఉత్పాదకతను పెంచేలా కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. దేశీయంగా యాపిల్ ఉత్పత్తుల తయారీ కోసం ఫాక్స్‌కాన్, టాటా వంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబర్ 20న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో దేశంలోని ముంబయి, ఢిల్లీ స్టోర్‌ల్లో భారీగా వినియోగదారుల రద్దీ నెలకొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థను ఆసరాగా చేసుకుని కంపెనీ రెవెన్యూ పెంచుకోవాలని ఆశిస్తుంది. దేశంలో కొత్తగా బెంగళూరు, పుణె, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబయిలో రిటైల్ స్టోర్‌లు ప్రారంభించాలని యోచిస్తోంది. దాంతోపాటు ‘మేడ్ ఇన్ ఇండియా’లో భాగంగా ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను స్థానికంగా తయారు చేయాలనే ప్రతిపాదనలున్నట్లు కంపెనీ అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కేంద్రం కొత్త పథకాలు ప్రారంభం.. ఎవరికంటే..
ఆపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెయిడ్రే ఓబ్రియన్ మాట్లాడుతూ..‘భారత్‌లో సంస్థ రిటైల్ స్టోర్‌లు విస్తరించాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా మెరుగైన టీమ్‌ను సిద్ధం చేస్తున్నాం. మా కస్టమర్ల సృజనాత్మకత, అభిరుచికి అధిక ప్రాధాన్యం ఇస్తాం. వారి ఇష్టాలకు అనువుగా సరైన ఉత్పత్తులను అందించడం సంస్థ బాధ్యత. స్థానికంగా స్టోర్లను పెంచడం ద్వారా మరింత ఎక్కువ మంది వినియోగదారులకు సేవలందించే అవకాశం ఉంటుంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment