వేదాంత నష్టాలు రూ.11,181 కోట్లు
ఆదాయం 10 శాతం డౌన్
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం వేదాంత కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.11,181.26 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. కెయిర్న్ ఇండియా సంబంధిత రూ.12,304 కోట్ల నగదేతర ఇంపెయిర్‌మెంట్ చార్జ్ (చమురు ధరలు పడిపోయినందున కెయిర్న్ ఆస్తి విలువను బ్యాలెన్స్ షీట్‌లో భారీగా తగ్గించడం ద్వారా వచ్చిన నష్టం) కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వేదాంత తెలిపింది. అయితే అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వచ్చిన నష్టాలతో పోల్చితే ఈ నష్టాలు తక్కువగానే ఉన్నాయని వేదాంత సీఈఓ టామ్ అల్బనీజ్ పేర్కొన్నారు.
2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.19,228 కోట్ల నష్టాలు వచ్చాయని చెప్పారు. మొత్తం ఆదాయం రూ.17,804 కోట్ల నుంచి 10 శాతం తగ్గి రూ.15,979 కోట్లకు పడిపోయిందని పేర్కొన్నారు. ఇతర ఆదాయం 47 శాతం పెరిగి రూ.3,482 కోట్లకు ఎగసిందని తెలిపారు. ఆయిల్, లోహ ధరలు తగ్గడం వల్ల ఆదాయం పడిపోయిందని, . అయితే అమ్మకాలు అధికంగా ఉండడం వల్ల కొంత మేరకు గట్టెక్కామని పేర్కొన్నారు. అసాధారణ అంశాలను పరిగణనలోకి తీసుకోకుంటే, తమ నికర లాభం 89 శాతం వృద్ధితో రూ.955 కోట్లుగా ఉందని, వ్యయ నియంత్రణ పద్ధతులు, ఇతర ఆదాయాలు దీనికి కారణమని వివరించారు.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో వేదాంత షేర్ 4.6 శాతం క్షీణించి రూ. 100 వద్ద ముగిసింది.