వేదాంతాకు కెయిర్న్ ఇండియా భారీ రుణం
న్యూఢిల్లీ: మాతృ సంస్థ వేదాంతా గ్రూప్‌నకు 1.25 బిలియన్ డాలర్లను(రూ. 7,500 కోట్లు) కెయిర్న్ ఇండియా రుణంగా మంజూరు చేసింది. దీనిలో 80 కోట్ల డాలర్లను ఇప్పటికే విడుదల చేసింది. గతంలో సైతం తమదగ్గరున్న నగదు నిల్వలను మాతృ సంస్థ వాటా పెంచుకునేందుకు వినియోగించిన నేపథ్యంలో తాజా చర్య విమర్శలకు తెరలేపింది. దీంతో స్టాక్ మార్కెట్లో కెయిర్న్ ఇండియా షేరు గత ఐదేళ్లలోలేని విధంగా 7% పతనమైంది.
బీఎస్‌ఈలో రూ. 323 వద్ద ముగిసింది. కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వల వినియోగంపై పలువురు విశ్లేషకులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కంపెనీ ప్రతినిధి వివరణ ఇస్తూ 3%పైగా ఫ్లోటింగ్ రేటుకి రుణాన్ని రెండేళ్లకు పొడిగించిన ట్లు చెప్పారు. ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్‌కంటే అధికమని పేర్కొన్నారు. అయితే రుణ విషయంపై బోర్డు ఎప్పుడు నిర్ణయం తీసుకుందన్న అంశంతోపాటు, ఇందుకు వాటాదారుల అనుమతిని తీసుకోవలసి ఉన్నదా అన్న సందేహంపై స్పందించేందుకు కంపెనీ నిరాకరించింది. కెయిర్న్ ఇండియాలో వేదాంతాకు 59.90% వాటా ఉంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్‌గా 64% క్షీణించడం కూడా షేరు పతనానికి కారణమని నిపుణులు చెప్పారు.
అనుమతి తీసుకోవాలి: ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వచ్చిన కంపెనీల కొత్త చట్టం ప్రకారం ఇలాంటి లావాదేవీలకు వాటాదారుల అనుమతి తీసుకోవలసి ఉంది. కెయిర్న్ ఇండియా బుధవారం వాటాదారుల సమావేశాన్ని నిర్వహించినప్పటికీ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. మిగులు నిధుల వినియోగంలో కంపెనీలు చేపట్టే ఇలాంటి లావాదేవీలు సందేహాలకు తావిస్తాయని గోల్డ్‌మన్ శాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ వ్యాఖ్యానించింది. కాగా, జూన్ చివరికి తమవద్ద దాదాపు 3 బిలియన్ డాలర్ల(సుమారు రూ.18 వేల కోట్లు)నగదు నిల్వలున్నట్లు కెయిర్న్ ఇండియా బుధవారం తెలిపింది.