‘కెయిర్న్’కు భారీ నష్టం
రూ.4 తుది డివిడెండ్
న్యూఢిల్లీ: కెయిర్న్ ఇండియాకు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.241 కోట్ల నికర నష్టం వచ్చింది. చమురు ధరలు తక్కువ స్థాయిలో ఉండడం, విదేశీ మారక ద్రవ్య నష్టాలు, శ్రీలంక కార్యకలాపాల్లో భారీ నష్టం వంటి అంశాల కారణంగా ఇంత భారీ స్థాయిలో నష్టం వచ్చిందని కంపెనీ పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.3,035 కోట్ల నికర లాభం ఆర్జించామని వివరించింది.
ఇక ఆదాయం 47 శాతం క్షీణించి రూ.2,677 కోట్లకు తగ్గిందని తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.4 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. 2014-15 పూర్తి ఆర్ధిక సంవత్సరానికి నికర లాభం 64 శాతం తగ్గి రూ.4,480 కోట్లకు, టర్నోవర్ 22 శాతం క్షీణించి రూ.14,646 కోట్లకు పడిపోయింది. గురువారం కంపెనీ షేర్ 2 శాతం క్షీణించి రూ.213.6 వద్ద ముగిసింది.