సం'పన్ను'ల సంగ్రామం | Hold Cairn India; target of Rs 216: KRChoksey | Sakshi
Sakshi News home page

సం'పన్ను'ల సంగ్రామం

Published Fri, May 1 2015 1:13 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

సం'పన్ను'ల సంగ్రామం - Sakshi

సం'పన్ను'ల సంగ్రామం

ప్రభుత్వ పన్ను నోటీసులపై కంపెనీల్లో కలకలం
మొన్నటికి మొన్న కెయిర్న్ ఉదంతంపై బ్రిటన్ సీరియస్
కోర్టు పోరాటంగా క్యాడ్‌బరీ వివాదం...  ‘మ్యాట్’ నోటీసులపై ఎఫ్‌ఐఐల గరం గరం
‘రెట్రాస్పెక్టివ్’ అంటూ పాత వ్యవహారాల్ని తోడటంపై కంపెనీల గుర్రు
స్టాక్‌మార్కెట్లో ఎఫ్‌ఐఐల విక్రయాలతో సెన్సెక్స్ 3వేల పాయింట్ల పతనం
దిగొచ్చిన ప్రభుత్వం; డీటీఏటీ దేశాలకు మినహాయింపు!

 
సాక్షి, బిజినెస్ విభాగం: దీన్నొక రకంగా సంపన్నుల సంగ్రామమనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నది కంపెనీల్ని. అడుగుతున్నది వేల కోట్ల బకాయిల్ని. ఒకవైపు ‘పన్నుల ఉగ్రవాదం’ లేదంటూనే వరస నోటీసులివ్వటంతో తీవ్ర  కలకలం రేగుతోంది. క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఎక్సయిజ్, మ్యాట్ వంటి పన్నులపై ప్రభుత్వమిస్తున్న నోటీసులు కొన్ని కంపెనీల్లో అసహనాన్ని రేపాయి. ఎఫ్‌ఐఐల విషయంలో ఇచ్చిన నోటీసులు స్టాక్ మార్కెట్ పతనానికీ దారితీశాయి. అసలు ఈ గొడవలేంటి? ఎందుకొస్తున్నాయి? కంపెనీలు చెల్లించాల్సిన పన్నులేంటి? అనే అంశాలపై వివరణాత్మక కథనమిది...
 
క్యాపిటల్ గెయిన్స్ కింద రూ.20,495 కోట్లు చెల్లించాలంటూ కెయిర్న్ ఇండియాకు నోటీసులిచ్చిన వెంటనే... ఎప్పుడో తొమ్మిదేళ్ల కిందటి ఘటనకు వర్తింపజేసినందుకు నరేంద్రమోదీ ప్రభుత్వంపై కంపెనీలు విమర్శలు సంధిం చాయి. చివరికి బ్రిటన్ అధికారికంగా దీన్ని వ్యతిరేకించింది. ఇక క్యాడ్‌బరీ వ్యవహారమూ కోర్టుకెక్కింది. తాము 2010 కన్నా ముందే ప్లాంటు ఆరంభించాం కనక పన్ను మినహాయింపులన్నీ వర్తిస్తాయని క్యాడ్‌బరీ... అలా చేయలేదు కాబట్టే నోటీసులు ఇచ్చామంటూ ప్రభుత్వం కోర్టుకెక్కాయి.

వీటన్నిటినీ మించి... ఎఫ్‌ఐఐల వ్యవహారం స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. వచ్చే ఏడాది నుంచి ‘మ్యాట్’ తొలగిస్తామని చెప్పి.. పాత సంవత్సరాలకంటూ రూ.40వేల కోట్లు కట్టమనటాన్ని వ్యతిరేకిస్తూ... స్టాక్ మార్కెట్లలో అమ్మకాలకు దిగారు. గడిచిన 12 రోజుల్లో రూ.7000 కోట్ల మేర నికర అమ్మకాలు జరపటంతో నిఫ్టీ 9000 పాయింట్ల నుంచి ఏకంగా 8180 పాయింట్లకు పడిపోయింది. సెన్సెక్స్ కూడా 3,000 పాయింట్ల మేర నష్టపోయింది. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం.. మారిషస్, సింగపూర్ వంటి ద్వంద పన్ను నివారణ ఒప్పందాలున్న దేశాల్ని మినహాయిస్తున్నట్లు సంకేతాలిచ్చింది కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
 
‘రెట్రాస్పెక్టివ్’తోనే సమస్య...
నిజానికి ‘మేకిన్ ఇండియా’ నినాదంతో విదేశాల్ని చుట్టివస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇటీవలి వరకు విదే శీ ఇన్వెస్టర్లు బాగానే విశ్వసించారు. అయితే ‘రెట్రాస్పెక్టివ్’ విధానంలో పాత వ్యవహారాలకు పన్నులు చెల్లించాలంటూ ఇప్పుడు నోటీసులిస్తుండటంతో ఈ విశ్వాసం సడలుతోందనే చెప్పాలి. అసలు రెట్రాస్పెక్టివ్ పన్నుల జోలికి వెళ్లబోమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినా అది చేతల్లో కనపడకపోవటంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి.

ఇదే విషయమై కొందరు విశ్లేషకులు, సంస్థల ప్రతినిధుల్ని సంప్రదించినపుడు... ‘పన్నులకు మేమెవ్వరమూ వ్యతిరేకం కాదు. అయితే ముందే ఆ విషయంపై స్పష్టత ఉండాలి. తీరా రోజులు గడిచిపోయాక అప్పుడెప్పుడో పన్ను కట్టలేదంటూ నోటీసులివ్వటం ఉండకూడదు’ అని అభిప్రాయపడ్డారు. నిజానికి అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడి కారణంగా వొడాఫోన్ (రూ.12,000 కోట్లు), షెల్ (రూ.6,000 కోట్లు) కంపెనీల పన్ను వివాదాలకు ఒక దశలో ఫుల్‌స్టాప్ పెట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 2 కేసుల్లో బాంబే హైకోర్టు ఆయా కంపెనీలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం కూడా దీనికి కారణం కావచ్చు. మ్యాట్ నోటీసులపై కొంత వెనక్కి తగ్గటంతో పాటు... త్వరలోనే దేశీ పన్నుల విధానంపై హై లెవెల్ ప్యానల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
 
క్యాడ్‌బరీ.. ఎక్సైజూ ఎగ్గొడతారా?
ఈ ఏడాది ఏప్రిల్ 6న చాక్లెట్ దిగ్గజం క్యాడ్‌బరీకి డీజీసీఈఐ నోటీసులిచ్చింది. ఐదేళ్ళ క్రితం  ఎక్సైజ్ డ్యూటీ ఎగ్గొట్టారని, దానికి సంబంధించి రూ. 574 కోట్లు చెల్లించాలని కోరింది. నిజానికి ఎక్సయిజ్ సుంకమంటే ఉత్పాదనపై లేక అమ్మకాలపై విధించేది. దాన్ని ఎగ్గొట్టే అవకాశం ఉండదు. మరి ఇదెలా జరిగిందంటే... హిమాచల్ ప్రదేశ్‌లో 2010 మార్చి 31 కన్నా ముందు ఏర్పాటు చేసిన కంపెనీలకు పదేళ్లపాటు ఎక్సయిజ్ సహా పలు సుంకాల మినహాయింపు ఉంది. దీంతో హిమాచల్‌లోని బడ్డీలో ఏర్పాటు చేసిన ప్లాంటుకు ఎక్సయిజ్ పన్ను మినహాయింపుల్ని క్యాడ్‌బరీ తీసుకుంది.

అయితే ఈ సంస్థ ప్లాంటు 2010 మార్చి 31 తరవాతే ఆరంభమైందని, అందుకే ఈ మూడేళ్లపాటు క్లెయిమ్ చేసిన సుంకాన్ని పెనాల్టీతో సహా చెల్లించాలని నోటీసులిచ్చామని డీజీసీఈఐ పేర్కొంది. 2012లోనే డీజీసీఐ నోటీసులు ఇవ్వగా... చండీగఢ్ పన్ను అధికారుల ఎదుట క్యాడ్‌బరీ సవాలు చేసింది. తాజాగా ఏప్రిల్ 6న చండీగఢ్ పన్ను అధికారులు కూడా డీజీసీఈ ఉత్తర్వుల్ని సమర్థించింది. అయితే  నిబంధనల ప్రకారమే మినహాయింపులు కోరామన్న క్యాడ్‌బరీ... దీనిపై కోర్టునూ ఆశ్రయించింది.
 
కంపెనీలు చెల్లించే ప్రధాన పన్నులివీ..
 
కార్పొరేట్ ట్యాక్స్: కంపెనీలు తమ నికర ఆదాయంపై చెల్లిస్తాయి. దేశీ కంపెనీలకిది 30 శాతంగా, విదేశీ కంపెనీలకు 40 శాతంగా ఉంది.
 
క్యాపిటల్ గెయిన్స్: కంపెనీలు తమ ఆస్తుల్ని, షేర్లను విక్రయించినపుడు వచ్చే లాభాలపై చెల్లించాల్సిన పన్ను ఇది. ప్రస్తుతం 10 శాతంగా ఉంది. షేర్లపై అయితే ఏడాదిలోగా విక్రయిస్తే... స్థిరాస్తులనైతే మూడేళ్లలోగా విక్రయిస్తే అది స్వల్పకాలంలో విక్రయించినట్లు కనక ఈ పన్ను వర్తిస్తుంది. ఆ సమయం దాటితే లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవుతాయి కనక మినహాయింపు వర్తిస్తుంది.
 
సేల్స్ ట్యాక్స్: విక్రయించే వస్తువులపై ఈ పన్ను చెల్లించాలి. రాష్ట్రంలో జరిగే అమ్మకాలపై రాష్ట్రాలకు వ్యాట్‌ను, ఇరు రాష్ట్రాల మధ్య జరిగే అమ్మకాలపై కేంద్రానికి సెంట్రల్ సేల్స్ ట్యాక్స్‌ను చెల్లించాలి. సీఎస్‌టీ 2% కాగా.. వ్యాట్ వస్తువుల్ని బట్టి ఉంటుంది.
 
కస్టమ్స్ డ్యూటీ: దేశంలోకి దిగుమతి చేసుకునే వస్తువులపై వ్యక్తులుగానీ, సంస్థలుగానీ చెల్లించాల్సిన పన్ను ఇది.
 
ఎక్సయిజ్ డ్యూటీ: దేశంలో ఉత్పత్తి చేసే వస్తువులకోసం చెల్లించాల్సిన పన్ను ఇది.
 
డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్: కంపెనీలు తమ షేర్ హోల్డర్లకు చెల్లించే డివిడెండ్ మొత్తంపై... 15 శాతం ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది.
 
కెయిర్న్... తొమ్మిదేళ్ల తరవాత?

ఈ ఏడాది మార్చి 10న... చమురు బావుల అన్వేషణ రంగంలో ఉన్న కెయిర్న్ ఇండియాకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులిచ్చింది. 20,495 కోట్లు పన్ను రూపంలో చెల్లించాలనేది ఆ నోటీసుల సారాంశం. ఈ కెయిర్న్ ఇండియా తొలుత బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీకి అనుబంధంగా ఉండేది. తదనంతరం మెజారిటీ వాటాను లండన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న వేదాంతా రిసోర్సెస్ కొనుగోలు చేయటంతో కంపెనీ చేతులు మారింది. ఇప్పటికీ దీంట్లో కెయిర్న్ ఎనర్జీకి మైనారిటీ వాటా ఉంది.  

అయితే 2006-07లో కెయిర్న్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు రావటంతో... దీంట్లో తనకున్న వాటాను కెయిర్న్ యూకే హోల్డిం గ్స్ సంస్థ కెయిర్న్ ఇండియా హోల్డింగ్స్‌కు బదలాయించింది. ఇలా బదలాయిం చినపుడు వచ్చిన లాభం (క్యాపిటల్ గెయిన్స్)పై రూ.10,248 కోట్ల పన్ను చెల్లించాలని, దానిపై వడ్డీ రూ.10,247 కోట్లు కలిపితే మొత్తం 20,495 కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వేదాంత గ్రూపు బ్రిటన్‌లో ఆర్బిట్రేటర్‌ను ఆశ్రయించటంతో ఇండియాలోనూ ఐటీ విభాగం ఎదుట కేసు దాఖలు చేసింది. ఈ పన్నును తప్పుడు పద్ధతుల్లో లెక్కించారని పేర్కొంటూ... చివరికి 20వేల కోట్లలో రూ.5000 కోట్లయితే కరెక్టేనని, దీన్లో 4,200 కోట్లకు ఇప్పటికే సెక్యూరిటీ ఇచ్చాం కనక మిగిలిన మొత్తం గురించే అడగాలని చెబుతోంది
 
చట్టాల్లోని అస్పష్టత వల్లే...
ఎంత కట్టాలన్నదాని కంటే దేశీయ చట్టాల్లో ఉన్న అస్పష్టతే ప్రధాన సమస్య. ఇంత పన్ను చెల్లించాలని స్పష్టంగా ఉంటే దానికి ఇష్టమైన వారే ఇన్వెస్ట్ చేస్తారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో పన్నులు తక్కువగానే ఉన్నప్పటికీ ఎంత చెల్లించాలన్న దానిపై చట్టాల్లో స్పష్టత లేకపోవడం విదేశీ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుత స్టాక్ మార్కెట్ పతనానికి మ్యాట్ ఒక్కటే కారణం అనుకోవడం లేదు. ఏడాదిన్నర కాలంలో నిఫ్టీ 100 శాతానికిపైగా పెరగడంతో లాభాల స్వీకరణ, అమెరికా వడ్డీరేట్లు పెంచుతుందన్న వార్తలు తదితర అంశాలు మార్కెట్‌ను ఒత్తిడికి గురి చేస్తున్నాయి.
- జగన్నాథం తూనుగుంట్ల, ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్, కార్వీ స్టాక్ బ్రోకింగ్
 
మ్యాట్... ఇదీ పాత బకాయిల కథే
ఎఫ్‌ఐఐ. ఒకరకంగా విదేశాలకు చెందిన మ్యూచ్‌వల్ ఫండ్లన్న మాట. భారత్‌తో ద్వంద్వపన్ను నివారణ ఒప్పందం (డీటీఏటీ) లేని దేశాలకు చెంది... ఇక్కడ కార్యాలయాలు పెట్టి కొనసాగుతున్న ఎఫ్‌ఐఐలకు గతనెలలో ఆదాయపు పన్ను శాఖ నోటీసులిచ్చింది. 100కు పైగా ఎఫ్‌ఐఐలు కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) రూపేణా రూ.40,000 కోట్లు చెల్లించాలనేది ఆ నోటీసుల సారాంశం. నిజానికి 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి మ్యాట్ ఉండదని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన కొద్దిరోజులకే... 2014 మార్చి 31 వరకూ ఈ బకాయిలు చెల్లించాలని నోటీసులివ్వటం గమనార్హం.

విదేశీ కంపెనీల్లో 1. భారత్‌తో ద్వంద్వపన్ను రహిత ఒప్పందం (డీటీఏటీ) ఉన్న దేశాలకు చెందిన కంపెనీలు... 2. డీటీఏటీ లేని దేశాలకు చెంది... భారత్‌లో ఆఫీసులు పెట్టుకున్న కంపెనీలు... 3. ఒప్పందం లేని దే శాలకు చెంది... భారత్‌లో  ఆఫీసులు లేకుండానే సాగుతున్న కంపెనీలు. వీటిలో రెండో కేటగిరీకి ఈ నోటీసులిచ్చారు. ఈ కంపెనీలు స్టాక్ మార్కెట్లలో కార్యకలాపాలు సాగిస్తాయి కనక వాటికి వచ్చిన పుస్తక లాభాలపై (బుక్ ప్రాఫిట్స్) 18.5 శాతం మ్యాట్ చెల్లించాలి. సెస్సు కూడా కలిపితే 19.44 శాతమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement