గణాంకాలు కీలకం | Weak US dollar to guide rupee's movements | Sakshi
Sakshi News home page

గణాంకాలు కీలకం

Published Mon, May 9 2016 2:01 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

గణాంకాలు కీలకం - Sakshi

గణాంకాలు కీలకం

* ఈ నెల 12న ఐఐపీ, రిటైల్ గణాంకాలు
* హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్ ఫలితాలు
* ఇవే ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపే అంశాలు...

న్యూఢిల్లీ: మార్చి నెల పారిశ్రామికోత్పత్తి, ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బోణ గణాంకాలు,  కొన్ని కంపెనీల క్యూ4 ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకం కానున్నాయని విశ్లేషకులంటున్నారు. వీటితో పాటు అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడ, రూపాయి కదలికలు, ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి...ఇవన్నీ స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు.
 
భవిష్యత్ అంచనాల ప్రభావం...
మార్చి నెల పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు ఈ గురువారం (ఈ నెల 12న) వెలువడతాయి. అదే రోజు ఏప్రిల్ నెలవినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బోణం(సీపీఐ) గణాంకాలను ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇక పలు ప్రధాన కంపెనీలు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఈ వారంలోనే వెల్లడిస్తున్నాయి. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యునిలివర్ సోమవారం(ఈ నెల9న), కోటక్ మహీంద్ర బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ కంపెనీలు బుధవారం( ఈ నెల 11న), డాక్టర్ రెడ్డీస్ గురువారం(ఈ నెల 12న), తమ క్యూ4 ఫలితాలను వెల్లడిస్తాయి.

ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ యాజమాన్యం భవిష్యత్ అంచనాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. మొత్తం మీద మార్కెట్ ఓవర్‌సోల్డ్ (అధిక అమ్మకాల)జోన్‌లోనే కొనసాగుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిఫ్టీ మళ్లీ 8,000 పాయింట్లకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.
 
పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలకు అనుగుణంగా మార్కెట్ కదలికలు ఉంటాయని మనీపామ్ సీఈఓ, ఎండీ నిర్దోశ్ గౌర్ చెప్పారు. నెస్లే, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్‌లతో పాటు ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల ఫలితాలను మార్కెట్ గమనిస్తుందని పేర్కొన్నారు.  కంపెనీలు వెల్లడించనున్న ఆర్థిక ఫలితాలు, వర్షపాతంపై తదుపరి అంచనాలు, అంతర్జాతీయ సంకేతాలు... స్టాక్ మార్కెట్ స్వల్పకాలిక ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా తెలిపారు. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తడి కారణంగా వరుసగా రెండో వారమూ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 378 పాయింట్లు (1.48 శాతం) నష్టపోయి 25,229 పాయింట్ల వద్ద ముగిసింది.
 
విదేశీ జోరుకు బ్రేక్‌లు: విదేశీ ఇన్వెస్టర్ల రెండు నెలల కొనుగోళ్ల జోరుకు గత వారంలో బ్రేక్ పడింది. ఈ నెల మొదటివారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.774 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళన. యూరోజోన్ జీడీపీ అంచనాల్లో తగ్గింపు, చైనా తయారీ రంగ కార్యకలాపాల్లో మందగమనం,  ముడి చమురు ధరల్లో అస్థిరత్వం  కారణంగా ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు.

విదేశీ ఇన్వెస్టర్లు ఇదే వారంలో డెట్ మార్కెట్లో రూ.769 కోట్లు పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, ఈ నెల 6 వరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.774 కోట్ల నికర పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అంతకు ముందటి రెండు నెలల్లో(మార్చి-ఏప్రిల్)రూ.29,558 కోట్లు పెట్టుబడులు పెట్టారు. కాగా విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.12,137 కోట్లు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, రూ.170 కోట్లు డెట్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. మొత్తం భారత క్యాపిటల్ మార్కెట్లో నికరంగారూ.11,967 కోట్లు పెట్టుబడులు పెట్టారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement