గణాంకాలు, ఫలితాలు కీలకం..
బక్రీద్ సందర్భంగా మంగళవారం సెలవు
* ట్రేడింగ్ నాలుగు రోజులే
* ఐఐపీ, ద్రవ్యోల్బణం గణాంకాల ప్రభావం
న్యూఢిల్లీ: ఈ వారంలో వెలువడే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ఈ గణాంకాలతో పాటు రుతుపవనాల గమనం, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు తదితర అంశాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. కాగా బక్రీద్ సందర్భంగా ఈ నెల 13న(మంగళవారం) సెలవు కారణంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది.
లాభాల స్వీకరణ
ఇటీవల స్టాక్ సూచీలు బాగా పెరిగాయని, అందుకని పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవచ్చని సింఘానియా అంచనా వేస్తున్నారు. స్టాక్ మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు కొంత స్తబ్ధత లేదా క్షీణత సాధారణమేనన్నారు. రానున్న సెషన్లలో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ తప్పదని, మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని ట్రేడ్‌బుల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధ్రువ్ దేశాయ్ పేర్కొన్నారు. పటిష్టమైన ఫండమెంటల్స్ కారణంగా వాహన, ఫార్మా షేర్లు పెరగవచ్చనేది ఆయన అంచనా.
నేడు టాటా స్టీల్ ఫలితాలు
సోమవారం టాటా స్టీల్ క్యూ1 ఫలితాలు వెలువడనున్నాయి. ఇక మంగళవారం కోల్ ఇండియా క్యూ1 ఫలితాలను ప్రకటిస్తుంది. ఈ కంపెనీలతో పాటు రిలయన్స్ కమ్యూనికేషన్స్, నాల్కో, రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, సీఈఎస్‌సీ, ఎన్‌బీసీసీ, ఎంఎంటీసీ, రోల్టా, యూనిటెక్ కంపెనీలు కూడా ఈ వారంలోనే క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి.
ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తన ద్రవ్య విధానాన్ని ఈ గురువారం(ఈ నెల 15న) వెల్లడించనున్నది. అదే రోజు ఆగస్టు నెలకు సంబంధించిన అమెరికా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, రిటైల్ అమ్మకాల గణాంకాలు వెలువడుతాయి. భారత క్యాపిటల్ మార్కెట్లో(స్టాక్స్,బాండ్‌లలో) ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు వంద కోట్ల డాలర్ల (రూ.6,800 కోట్లు)వరకూ పెట్టుబడులు పెట్టారు.
ఈ వారం ఈవెంట్స్...
12 సోమవారం
రిటైల్ ద్రవ్యోల్బణం(ఆగస్టు) గణాంకాలు
జూలై పారిశ్రామికోత్పత్తి గణాంకాలు
టాటా స్టీల్ క్యూ1 ఫలితాలు
1
3 మంగళవారం
బక్రీద్.. మార్కెట్‌కు సెలవు
కోల్ ఇండియా క్యూ1 ఫలితాలు
14 బుధవారం
టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు
15 గురువారం
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పాలసీ
అమెరికా ఐఐపీ, రిటైల్ అమ్మకాల గణాంకాలు