ద్రవ్యోల్బణం, ఐఐపీ డేటా కీలకం
వీటిపై ఇన్వెస్టర్ల దృష్టి
జీఎస్‌టీ, భూసేకరణ బిల్లులు...
ఏప్రిల్ రిటైల్, టోకు ద్రవ్యోల్బణం
మార్చి పారిశ్రామికోత్పత్తి సూచి
కార్పొరేట్ల క్యూ4 ఫలితాలు...
న్యూఢిల్లీ: పార్లమెంటు ముందున్న కీలక సంస్కరణల బిల్లులతో పాటు ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేశారు. జీఎస్‌టీ బిల్లు రాజ్యసభ ఆమోదం కోసం వేచిచూస్తున్న సంగతి తెలిసిందే. మరో కీలకమైన భూసేకరణ బిల్లును ఈ వారం లోక్‌సభలో ప్రవేశపెడతారని భావిస్తున్నారు. మరో మూడు రోజులు మాత్రమే పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ కీలక బిల్లులపై వచ్చే ఫలితం ఆధారంగా మార్కెట్ ట్రెండ్ వుండవచ్చని నిపుణులు చెప్పారు.
అలాగే ఈ మంగళవారం వెలువడే రిటైల్ ద్రవ్యోల్బణం (ఏప్రిల్ నెల), పారిశ్రామికోత్పత్తి సూచీ (మార్చి నెల)ల హెచ్చుతగ్గులు మార్కెట్ కద లికల్ని ప్రభావితం చేస్తాయని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ అంచనావేశారు. ఏప్రిల్ నెలకు టోకు ద్రవ్యోల్బణం డేటా గురువారం విడుదల కానున్నది. గత శుక్రవారం మార్కెట్ జోరుగా పెరిగినప్పటికీ, గరిష్టస్థాయిలో సూచీలు స్థిరపడటం కష్టసాధ్యమని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు.
వివిధ దేశీయ, అంతర్జాతీయ అంశాల కారణంగా ఇన్వెస్టర్లలో విశ్వాసం సన్నగిల్లడం ఇందుకు కారణమన్నారు. అయితే విదేశీ ఇన్వెస్టర్లపై మ్యాట్ విధింపునకు సంబంధించి ఒక ఉన్నతస్థాయి కమిటీని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏర్పాటుచేయడం శుక్రవారం అమెరికాలో వెలువడిన జాబ్స్ డేటా ఫలితంగా అక్కడి మార్కెట్లు పెద్ద ర్యాలీ జరిపిన ప్రభావం తొలుత ఈ సోమవారం కన్పిస్తుందని మాంగ్లిక్ అన్నారు. అటుతర్వాత దేశీయ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి మళ్లిస్తారన్నారు. అంతేకాకుండా మార్చితో ముగిసిన క్యూ4 ఫలితాలకు అనుగుణంగా ఆయా షేర్లు సర్దుబాటుకు లోనవుతాయని, ఈ ఫలితాలు కూడా మార్కెట్ ట్రెండ్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు చెప్పారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, లుపిన్, కేడిలా హెల్త్‌కేర్, అశోక్ లేలాండ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలు ఈ వారం క్యూ4 ఫలితాల్ని ప్రకటించనున్నాయి.
రూ. 12 వేల కోట్లు వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు
కొద్ది నెలల నుంచి దేశీయ మార్కెట్లో అదేపనిగా పెట్టుబడులు పెడుతూ వస్తున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) మే నెలలో ఇప్పటివరకూ రూ. 12,000 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్యకాలంలో ఎఫ్‌ఐఐలు రూ. 94,241 కోట్లు పెట్టుబడి చేసినప్పటికీ, ఏ నెలకు ఆ నెల వారి పెట్టుబడులు తగ్గుతూ వస్తున్నాయి. 2015 జనవరిలో రూ. 33,688 కోట్ల నిధుల్ని ఇక్కడి మార్కెట్లో వారు కుమ్మరించగా, ఫిబ్రవరిలో అవి రూ. 24,564 కోట్లకు, మార్చిలో రూ. 20,723 కోట్లకు, ఏప్రిల్‌లో రూ. 15,266 కోట్లకు తగ్గాయి. మే నెలలో మాత్రం ఇప్పటివరకూ రూ. 12,256 కోట్ల నికర విక్రయాలు జరిపినట్లు డిపాజిటరీల డేటా వెల్లడిస్తున్నది. విదేశీ ఇన్వెస్టర్లు సంపాదించిన లాభాలపై 20 శాతం కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) విధించడం ఈ అమ్మకాలకు కారణమని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ చెప్పారు.