స్థూల గణాంకాల వెల్లడి ఈ వారంలో సూచీల దిశానిర్దేశం చేయనున్నట్లు మార్కెట్ పండితులు భావిస్తున్నారు. పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడి, అమెరికా–చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ పరిణామాలు సూచీలకు కీలకం కానున్నాయని డెల్టా గ్లోబల్ పాట్నర్స్ ప్రిన్సిపల్ పాట్నర్ దేవేంద్ర నెవ్గి వివరించారు. ఈ సమాచారం ఆధారంగానే అక్టోబరులో సమావేశంకానున్న ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) పాలసీ సమీక్షను వెల్లడించనుందన్నారు. వడ్డీ రేట్ల ప్రకటనకు కీలకంగా ఉన్న ద్రవ్యోల్బణ సమాచారం ఈవారంలోనే సూచీలకు ఒక దిశను ఇవ్వనుందని విశ్లేషించారు. ఇక గురువారం (సెప్టెంబరు 13న) వినాయక చవితి సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఈ వారంలో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది.
గణాంకాలే కీలకం: ఎపిక్ రీసెర్చ్
ఆగస్టు నెలకు సంబంధించిన వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) బుధవారం వెల్లడికానుంది. ఇదే రోజున జూలై పారిశ్రామికోత్పత్తి డేటా వెలువడనుంది. వీటితోపాటు ఆగస్టు టోకు ధరల(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం శుక్రవారం వెల్లడికానుండగా.. మార్కెట్‌కు ఈ గణాంకాలు కీలకమని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. సెప్టెంబరు 7 నాటికి విదేశీ మారక నిల్వలు.. ఆగస్టు 31 వారాంతానికి డిపాజిట్లు, బ్యాంకు రుణాల వృద్ధి రేటు గణాంకాలను శుక్రవారం ఆర్‌బీఐ వెల్లడించనుంది.
రూపాయి కదలికల ప్రభావం
‘ముడిచమురు ధర మరోసారి 80 డాలర్ల దిశగా ప్రయాణం చేస్తూ రూపాయి మారకం విలువను కుంగదీస్తోంది. 80% దిగుమతిపైనే ఆధారపడుతున్న భారత్‌కు క్రూడ్ ధరలో ర్యాలీ ప్రతికూల ప్రభావమే చూపనుంది. మరోవైపు అమెరికా జాబ్ డేటా సానుకూలంగా ఉన్నందున డాలరు విలువ మరింత బలపడి రూపాయి విలువ క్షీణతకు దారి తీస్తోంది.’ అని కొటక్ సెక్యూరిటీస్ కరెన్సీ విభాగం డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ అనింద్య బెనర్జీ వెల్లడించారు.
డాలర్ మారకంలో రూపాయి విలువ గతవారం ఒకదశలో 72.11 జీవిత కాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. వారాంతానికి 71.73 వద్ద నిలిచింది. ఏడాదిలో 13 శాతం క్షీణతను నమోదుచేసింది. వాణిజ్య యుద్ధంలో భాగంగా చైనా ఉత్పత్తులపై మరోసారి తాజా ట్యారిఫ్ ప్రకటన ఉండనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో రూపాయి స్పాట్ స్థాయిని 71.60–72.60 మధ్య అంచనావేస్తున్నట్లు తెలిపారు. ‘10– ఏళ్ల బాండ్ ఈల్డ్ గతవారంలో 8 శాతానికి చేరుకోవడం, ద్రవ్య లోటు భయాల ఆధారంగా చూస్తే త్వరలోనే ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచేందుకు అవకాశం ఉంది.’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు.
అంతర్జాతీయ గణాంకాలు ఏం చెబుతాయి?
అమెరికా ఆగస్టు కోర్ సీపీఐ గురువారం, రిటైల్ అమ్మకాల డేటా శుక్రవారం వెల్లడికానున్నాయి. ఫెడ్ తదుపరి సమావేశానికి కీలకం కానున్న ఈ డేటాపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. మరోవైపు సోమవారం చైనా ఆగస్టు వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం, శుక్రవారం పారిశ్రామికోత్పత్తి డేటాలను వెల్లడించనుంది. ఈ చైనా గణాంకాలు సైతం మార్కెట్‌పై ప్రభావం చూపను న్నాయి. గురువారం జరగనున్న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) సమావేశం సైతం వడ్డీరేట్ల నిర్ణయానికి కీలకంగా ఉంది.
11,760 వద్ద తక్షణ నిరోధం
‘టెక్నికల్‌గా గతవారం నిఫ్టీ దిద్దుబాటును నమోదుచేసింది. చార్టుల ఆధారంగా అప్‌ట్రెండ్ కనిపిస్తోంది. నిఫ్టీకి అత్యంత కీలక నిరోధం 11,760 పాయింట్ల వద్ద ఉంది. దిగువస్థాయిలో 11,393–11,340 శ్రేణిలో మద్దతు ఉంది.’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు.
నిరాశపరిచిన విదేశీ నిధుల ప్రవాహం
ముడిచమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ క్షీణత కారణంగా గడిచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.5,600 కోట్లను వెనక్కు తీసుకున్నారు. డిపాజిటరీ డేటా ప్రకారం సెప్టెంబరు 3–7 మ ధ్యకాలంలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.1,021 కోట్లు.. డెట్ మార్కెట్ నుంచి రూ.4,628 కోట్లు ఎఫ్‌పీఐలు వెనక్కు తీసుకున్నారు. ఏప్రిల్–జూన్ కాలంలో రూ.61,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్న వి దేశీ ఇన్వెస్టర్లు ఆ తరువాత నికర కొనుగోలుదారులుగా నిలిచినప్పటికీ.. తాజాగా మరోసారి నికర అమ్మకందారులుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment