మార్కెట్‌కు దేశీ ఇన్వెస్టర్ల దన్ను | rump's 'America First' Slogan May Hit Stock Markets, Weaken Rupee | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు దేశీ ఇన్వెస్టర్ల దన్ను

Published Tue, Jan 24 2017 1:25 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

మార్కెట్‌కు దేశీ ఇన్వెస్టర్ల దన్ను - Sakshi

మార్కెట్‌కు దేశీ ఇన్వెస్టర్ల దన్ను

విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలకు చెక్‌
l    పెద్ద నోట్ల రద్దు, ట్రంప్‌ గెలుపు తర్వాత కనిష్టస్థాయి నుంచి 6 శాతం ర్యాలీ
l    మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు
 

ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు దెబ్బకు భారత ఆర్థిక వ్యవస్థ కుదేలై, ఇప్పట్లో కోలుకోవడం కష్టమనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్లో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. విదేశీ పెట్టుబడులు వెనక్కి పోతే, మన మార్కెట్‌ నష్టపోవడం సాధారణమైన విషయం. కానీ గత కొన్ని రోజులుగా దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీలను ఏడాపెడా అమ్మేస్తున్నా మన స్టాక్‌మార్కెట్‌ నష్టపోవడం లేదు. స్వల్పంగానైనా లాభాల్లోనే నడుస్తోంది. దీనికి కారణాలేంటి, మార్కెట్‌ విశ్లేషకులు ఏమంటున్నారంటే..,

ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు దెబ్బకు కుదేలైన భారత క్యాపిటల్‌  మార్కెట్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా వినియోగం తగ్గి కంపెనీల ఆర్థిక ఫలితాలపై తీవ్రమైన ప్రభావమే ఉండగలదన్న అంచనాలున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్‌ ట్రంప్‌ అనూహ్యంగా గెలవడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాలు కూడా తోడవడంతో గత ఏడాది నవంబర్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్‌ మార్కెట్‌ నుంచి రూ.30వేల కోట్లకు పైగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.

విదేశీ పెట్టుబడులు వెళ్లిపోతే మన మార్కెట్‌ పడిపోవాలి. కానీ దీనికి భిన్నంగా జరుగుతోంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా వృద్ది కుంటుపడుతుందనే కారణంతో నవంబర్‌ 21న సెన్సెక్స్‌ 6 నెలల కనిష్టానికి పడిపోయింది. అప్పటి నుంచి చూస్తే  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 6% వరకూ లాభపడింది. విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు జరుపుతున్నా, దేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు పెరగడమే మార్కెట్‌ పటిష్టతకు కారణమని బ్రోకింగ్‌ సంస్థలు అంటున్నాయి.

జోరుగా మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు..
రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతుండటంతో గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా గత ఏడాది మ్యూచువల్‌ ఫండ్స్‌ అధిక వృద్ధిని సాధించాయి. నెలకు సగటున రూ.4,000 కోట్లు మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌  ప్లాన్‌(సిప్‌) ఇన్వెస్ట్‌ల ద్వారా వస్తున్నాయి. 2015లో  ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రూ.1,800–2,000రేంజ్‌లోనే ఉన్నాయి. 

సిస్టమాటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ప్లాన్‌ ద్వారా మరో రూ.1,000 కోట్లు వస్తున్నాయని అంచనా. నవంబర్‌ తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు రూ.30వేల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే, రిటైల్‌ ఇన్వెస్టర్లు నవంబర్‌–డిసెంబర్‌ నెలల్లో ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్స్‌లో రూ.34 వేల కోట్లు ఇన్వెస్ట్‌ చేశారని అంచనా. ఈ నిధులతో మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు రూ.27 వేల కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి

పెట్టుబడికి ఇదే మార్గం..: రియల్టీ కుదేలవడం, పుత్తడి ధరల్లో అనిశ్చితి తదితర కారణాల వల్ల వేరే పెట్టుబడి మార్గాల్లేక దేశీయ స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెరుగుతున్నాయని కొందరు నిపుణులంటున్నారు. కంపెనీల భవిష్యత్‌ పరిస్థితులు ఆశాజనకంగా ఉండడం, రాబడులు అధికంగా వస్తుండడం కూడా ఇన్వెస్టర్లను స్టాక్‌ మార్కెట్‌ వైపు ఆకర్షిస్తున్నాయి. గత మూడేళ్ల రాబడులను పరిగణనలోకి తీసుకుంటే బంగారం, రియల్టీల కంటే కూడా మెరుగ్గా సెన్సెక్స్‌31 శాతం వృద్ది సాధించింది.

ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల పుత్తడి, రియల్టీల్లో నల్లధనం చలామణి తగ్గుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ రెండు రకాల అసెట్స్‌లో నష్టభయం అధికంగా ఉండడం వల్ల కూడా ఇన్వెస్టర్లు ఈక్విటీల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు స్టాక్‌మార్కెట్‌ జోరును పెంచుతాయని, రాబడులు బాగా వస్తాయనే అంచనాలు కూడా ఇన్వెస్టర్లను స్టాక్‌మార్కెట్‌ వైపు ఊరిస్తున్నాయి. రానున్న బడ్జెట్లో పన్ను ఆదా పెరిగే అవకాశాలున్నాయని, దీంతో ఈక్విటీల్లోకి మరింతగా పెట్టుబడులు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

డెరివేటివ్స్‌లో విదేశీ జోరు..
దేశీయ స్టాక్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారని, అయితే డెరివేటివ్స్‌ సెగ్మెంట్లో కొనుగోళ్లు జరుపుతున్నారని, సమీప భవిష్యత్తులో మార్కెట్‌ జోరు ఉంటుందనడానికి ఇది సంకేతమని మార్కెట్‌  విశ్లేషకుల అభిప్రాయం. నవంబర్‌ 8 నుంచి చూస్తే విదేశీ ఇన్వెస్టర్లు రూ.12,725 కోట్ల విలువైన ఇండెక్స్‌ ఫ్యూచర్లను కొనుగోలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement