కెయిర్న్‌పై భారత్‌కు ఎదురుదెబ్బ
స్టే ఇవ్వటానికి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్యానెల్ నో...
న్యూఢిల్లీ: బ్రిటన్ చమురు దిగ్గజ సంస్థ– కెయిర్న్ ఎనర్జీ ప్రారంభించిన ఆర్ర్‌బిట్రేషన్ ప్రక్రియపై స్టే విధించాలని భారత్ దాఖలు చేసిన పిటిషన్‌ను అంతర్జాతీయ త్రిసభ్య ఆర్బ్రిట్రేషన్ ప్యానల్ తోసిపుచ్చింది. గతనెలలోనే జరిగిన ఈ వ్యవహారం కాస్త ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం– భారత్ ఆదాయపు పన్ను శాఖ రూ.10,247 కోట్ల రెట్రాస్పెక్టివ్ పన్ను (గత వ్యాపార లావాదేవీలకు వర్తించే విధంగా అమలు చేసే పన్ను) చెల్లించాలంటూ కెయిర్న్‌కు డిమాండ్ నోటీసులిచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ, కెయిర్న్ ఎనర్జీ ఈ అంతర్జాతీయ ఆర్బ్రిట్రేషన్‌ను ఆశ్రయించింది.
రెట్రాస్పెక్టివ్ పన్ను విధానం కింద ఏకంగా రూ.10,247 కోట్ల పన్ను వేయడం సరికాదంటూ కెయిర్న్ వ్యాజ్యం దాఖలు చేసింది. అయితే దీనిపై స్టే ఇవ్వటంతో పాటు అసలు ఈ పన్ను విధింపు భారత్– బ్రిటన్ ద్వైపాక్షిక పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందం కిందికి వస్తుందా? రాదా? అన్న విషయాన్ని కూడా ఆర్బ్రిట్రేషన్ ప్రక్రియలో విచారించాలనిభారత్ చేసుకున్న అభ్యర్థనను త్రిసభ్య ధర్మాసనం మార్చి 27న తోసిపుచ్చింది.
కొత్తగా ఏర్పాటయిన కెయిర్న్ ఇండియాకు భారత్‌లోని తన అసెట్స్‌ను బదలాయించటం, స్టాక్ ఎక్సే్ఛంజింగ్‌లో లిస్ట్ కావటం ద్వారా కెయిర్న్ ఎనర్జీ క్యాపిటల్ గెయిన్స్ పొందిందని పేర్కొంటూ, 2014 జనవరిలో భారత్ ఆదాయపు పన్ను శాఖ ఆ సంస్థకు రెట్రాస్పెక్టివ్ పన్ను డిమాండ్ నోటీసు పంపింది. క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను మినహాయించలేదని పేర్కొంటూ, 2014 ఏప్రిల్‌లో కెయిర్ ఇండియాకు సైతం ఆదాయపు పన్ను శాఖ రూ.20,495 కోట్ల పన్ను డిమాండ్ ఇచ్చింది. అయితే ఈ రెట్రాస్పెక్టివ్ పన్ను విధింపు ఎంతమాత్రం తగదని కెయిర్న్ ఎనర్జీ గత ఏడాది మే నెలలో అంతర్జాతీయ ఆర్ర్‌బిట్రేషన్‌ను ఆశ్రయించింది. భారత్ ప్రభుత్వం నుంచి 5.6 బిలియన్ల పరిహారాన్ని కూడా సంస్థ డిమాండ్ చేస్తోంది.