కెయిర్న్ ఇండియాకు చమురు దెబ్బ
70 శాతం తగ్గిన నికర లాభం
న్యూఢిల్లీ: మైనింగ్ కుబేరుడు అనిల్ అగర్వాల్‌కు చెందిన కెయిర్న్ ఇండియా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 70 శాతం క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడం దీనికి ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. గత క్యూ2లో రూ.2,278 కోట్లుగా(ఒక్కో షేర్‌కు రూ.13.77) ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.673(ఒక్కో షేర్‌కు రూ.5.54)కు పడిపోయిందని తెలిపింది.
గత క్యూ2లో బ్యారెల్ చమురును సగటున 92.1 డాలర్లకు అమ్మామని, ఈ క్యూ2లో బ్యారెల్ చమురు సగటు విక్రయ ధర 43.7 డాలర్లుగా ఉందని, 53 శాతం క్షీణత నమోదైందని వివరించింది. చమురు ధరలు బాగా తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూలధన వ్యయాలను సగానికి (50 కోట్ల డాలర్లకు) తగ్గించుకున్నామని తెలిపింది. చమురు సరఫరాలు అధికం కావడం కూడా ధరలపై ప్రభావం చూపించిందని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి రూ.17,943 కోట్ల నగదు నిల్వలున్నాయని వివరించింది.